Mansion 24 OTT Series Review: ఓంకార్ ‘మ్యాన్షన్ 24’ హారర్ సిరీస్ ఎలా ఉంది? భయపెడుతూ ఆకట్టుకుందా?
Mansion 24 OTT Web series Review: ఓంకార్ దర్శకత్వం వహించిన ‘మ్యాన్షన్ 24’ హారర్ వెబ్ సిరీస్ డిస్నీ+ హాట్‍స్టార్ (Disney+ Hotstar) ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేసింది. ఈ సిరీస్ ఆకట్టుకునేలా ఉందో లేదో ఈ రివ్యూలో చూడండి.
Mansion 24 Review: వెబ్ సిరీస్: మ్యాన్షన్ 24; స్ట్రీమింగ్ డేట్: ఆక్టోబర్ 17 నుంచి; ప్లాట్‍ఫామ్: డిస్నీ+ హాట్‍స్టార్; ఎపిసోడ్లు: 6
ప్రధాన నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, సత్యరాజ్, రావు రమేశ్, అవికా గోర్, రాజీవ్ కనకాల, అభినయ, అర్చనా జోయిస్, బిందు మాధవి, శ్రీమాన్, అమర్ దీప్, నందు, అయ్యప్ప శర్మ, మానస్, తులసి తదితరులు
రచయిత, దర్శకుడు: ఓంకార్; నిర్మాణ సంస్థ: ఓఏకే ఎంటర్‌టైన్‍మెంట్; నిర్మాతలు: ఓంకార్, అశ్విన్ బాబు, కల్యాణ్ చక్రవర్తి
సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్: వికాస్ బాడిస; ఎడిటర్: ఆది నారాయణ్
Mansion 24 Review: టెలివిజన్‍లో స్టార్ హోస్ట్, క్రియేటర్ అయిన ఓంకార్.. హారర్ జానర్‌పై తన ఇష్టాన్ని, ప్యాషన్‍ను వెండితెరపై ఇప్పటికే చూపించారు. రాజుగారి గది లైనప్‍లో మూడు సినిమాలకు దర్శకత్వం వహించి.. సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇదే హారర్ జానర్‌తో ఓటీటీ వెబ్ సిరీస్‍ను కూడా డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మ్యాన్షన్ 24’ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు (అక్టోబర్ 17) స్ట్రీమింగ్‍కు వచ్చింది. వరలక్ష్మి శరత్‍కుమార్, సత్యరాజ్, బిందు మాధవి, అవికా గోర్ సహా మరికొందరు ప్రముఖ నటులు ఈ సిరీస్‍లో ఉండటంతో మంచి బజ్ నెలకొంది. సత్యరాజ్ కూడా ఈ సిరీస్ గురించి చాలా హైప్ ఇచ్చారు. మరి ‘మ్యాన్షన్ 24’ ఆకట్టుకునేలా ఉందా? అంచనాలను అందుకుందా? అనే విషయాలను ఈ రివ్యూలో తెలుసుకోండి.
మ్యాన్షన్ 24 కథ ఇదే..
Mansion 24 Review: అమృత (వరలక్ష్మి శరత్ కుమార్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పని చేస్తుంటారు. ఆమె తండ్రి కాళిదాస్ (సత్యరాజ్) ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్‍లో అధికారిగా ఉంటారు. విలువైన సంపదతో పరారయ్యాయడనే అభియోగం ఆయనపై పడుతుంది. దేశ ద్రోహిగా ముద్ర పడుతుంది. ఈ బాధతో అమృత తల్లి (తులసి) ఆసుపత్రి పాలవుతారు. తన తండ్రి విషయంలో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు అమృత నిర్ణయించుకుంటారు. ఆయన ఏ తప్పు చేయలేదని తాను నిరూపిస్తానని చెబుతారు. తన తండ్రిని తీసుకొస్తేనే తల్లికి ఆరోగ్యం బాగవుతుందని అనుకుంటారు. దీంతో కాళిదాస్ కోసం అన్వేషణ మొదలుపెడతారు. ఆయన ఓ పాడుబడ్డ మ్యాన్షన్‍కు వెళ్లారని అమృత తెలుసుకుంటారు. ఆ మ్యాన్షన్‍కు తాను కూడా వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే, ఆ మ్యాన్షన్‍కు వెళితే మళ్లీ తిరిగి రావని అమృతను ఆర్కియాలజీ హెడ్, పోలీసులతో పాటు మరికొందరు హెచ్చరిస్తారు. భయపెడుతుంటారు. అయితే, ఆ భయంకరమైన మ్యాన్షన్ 24లోకి వెళ్లేందుకే అమృత నిర్ణయించుకుంటారు.
వాచ్‍మెన్ (రావు రమేశ్) మ్యాన్షన్‍కు కాపలాగా ఉంటారు. మ్యాన్షన్‍లోకి వెళ్లాలనుకునే అమృతకు గతంలో అక్కడికి వెళ్లిన వారు ఏమయ్యారో కథలుగా చెబుతారు. ఆ మ్యాన్షన్‍లోని వేర్వేరు గదుల్లో ఒకప్పుడు ఉన్న రైటర్ చతుర్వేది (శ్రీమాన్), స్వప్న (అవికా గోర్), రాజీవ్ కనకాల ఫ్యామిలీ, డ్యాన్సర్ రాధిక (అర్చనా జోయిస్), లిల్లీ (నందు), సుల్తానా బేగం (బిందు మాధవి)కు ఏమైందనే విషయాన్ని అమృతకు వాచ్‍మెన్ చెబుతారు. అయితే, ఆ కథల్లో దెయ్యాలు ఉన్నాయనే దాన్ని అమృత నమ్మరు. వాచ్‍మెన్‍తో వారిస్తారు. ఆ మ్యాన్షన్‍లో రూమ్ నంబర్ 24 మిస్టరీగా ఉంటుంది. అసలు కాళిదాస్ ఏమయ్యారు? అమృత ఆయనను గుర్తించారా? కాళిదాస్ నిజాయితీపరుడని నిరూపించారా? ఆ కథల్లో వారికి ఏం జరిగింది? అనే విషయాలే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథగా ఉన్నాయి.
కథనం సాగిందిలా..
Mansion 24 Review: దెయ్యాలు, ఆత్మలు నిజంగానే ఉన్నాయా.. మనుషుల మానసిక సంఘర్షణ వల్ల కలిగే అభూత కల్పనలేనా అనేది ఎడతెగని చర్చ. ఈ అంశంపై చాలా హారర్ చిత్రాలు, సిరీస్‍లు వచ్చాయి. ఈ ‘మ్యాన్షన్ 24’లోనూ అలాంటి అంశం కనిపిస్తుంది. మ్యాన్షన్ 24 సిరీస్‍లో వరలక్ష్మీ శరత్ కుమార్ కథతో పాటు మరో ఐదు స్టోరీలు కూడా ఉంటాయి. అసలు కథలోకి వెళ్లేందుకు దర్శకుడు ఓంకార్ ఎక్కువ సమయం తీసుకోలేదు. అసలు విషయాన్ని ఫస్ట్ ఎపిసోడ్ ఆరంభం నుంచే మొదలుపెట్టేశారు. కథనాన్ని పరుగులు పెట్టించారు.
స్టోరీలను చాలా క్లుప్తంగా, స్ట్రైట్‍గా చూపించేశారు దర్శకుడు. స్క్రీన్‍ప్లేలో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా స్టోరీలను తెరకెక్కించారు. హారర్‌కు కామెడీని జోడించకుండా మంచి పని చేశారు. అందుకే ఎక్కడా పక్కదోవ పడుతున్న ఫీలింగ్ కలగదు. అనవసర సన్నివేశాలు కూడా ఎక్కువగా కనిపించవు. హారర్‌పైనే పూర్తిగా దృష్టి సారించారు ఓంకార్. అలాగేని అతిగా భయపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. మోస్తరుకు మించి ఎఫెక్టులు పెట్టలేదు.
‘మ్యాన్షన్ 24’ సిరీస్‍లోని స్టోరీలను చూస్తే సమాజంలో తరచూ జరిగే కొన్ని ఘటనల ఆధారంగానే ఓంకార్ రాసుకున్నారని అర్థమవుతుంది. పిల్లలపై ద్వేషం, వివాహేతర సంబంధంతో కుటుంబం హత్య, గతం వెంటాడం, చనిపోయిన వ్యక్తి కోసం ఆత్మహత్య చేసుకోవడం, ఓ సైకో.. ఇలాంటి అంశాలు ఆ కథల్లో ఉన్నాయి. దీంతో ఈ కథలు ప్రేక్షకులకు ఎంగేజ్ కూడా అవుతాయి. ఈ విషయంలో ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్లలేదు ఓంకార్. అయితే, ఎమోషనల్‍గా ఈ స్టోరీలు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. కొన్ని చోట్ల అదరాబాదరాగా స్టోరీ ముగిసిందనే భావన కలుగుతుంది.
కథలను వరలక్ష్మీ శరత్ కుమార్‌కు రావు రమేశ్ చెబుతున్నట్టు నరేట్ చేయడం వల్ల ఆసక్తిని ఆసాంతం కొనసాగించగలిగారు దర్శకుడు ఓంకార్. ప్రతీ కథ ముగిశాక తాను ఆత్మలను నమ్మనంటూ వాటిని వరలక్ష్మి విశ్లేషించడం కూడా ఆసక్తికరంగా సాగింది. అయితే, చివరి ఎపిసోడ్‍లో కథ సాధారణంగా అనిపిస్తుంది. కొత్తదనం కొరవడుతుంది. భారీ ట్విస్ట్ రివీల్ అయినా.. ఇదేనా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే, రెండో సీజన్ కోసం చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంది. తదుపరి సీజన్ కోసం వేచిచూసేలా చేస్తుంది.
సాంకేతిక విషయాలు
Mansion 24 Review: ఈ సిరీస్‍కు ఓంకార్ డైరెక్షన్ మంచి బలంగా నిలిచింది. హారర్ ఎలిమెంట్లను ఎంత ఉంచాలో అంతే ఉంచి.. ఆసక్తికరంగా కథనాన్ని సాగించారు. స్టోరీలు చిన్నగానే ఉండటంతో ఎక్కడా బోరు కొట్టించకుండానే చూపించారు. అయితే, ప్రేక్షకులను ఎమోషనల్‍గా కనెక్ట్ చేయడంలో మాత్రం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. కథనం ఆసక్తికరంగానే ఉన్నా.. మరీ లీనమయ్యేంత లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బాడిస ఈ సిరీస్‍కు పూర్తి న్యాయం చేశారు. తగిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సౌండ్ డిజైన్ చాలా చోట్ల కొత్తగా అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ బి.రాజశేఖర్ పనితనం కూడా ఈ ‘మ్యాన్షన్ 24’కు పెద్ద బలం. కలర్ గ్రేడింగ్ సూటైంది. ఈ సిరీస్ కోసం ఓంకార్ బాగానే ఖర్చు పెట్టినట్టు అర్థమవుతోంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.
నటీనటులు
అమృత పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ అలవోకగా చేసేశారు. ఆమెకు ఎంతో సూటయ్యే సీరియస్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. సత్యరాజ్ పాత్ర నిడివి చాలా తక్కువ. భారీతనం కోసమే ఆయనను ఈ సిరీస్‍లో తీసుకున్నట్టు అర్థమవుతుంది. కథలను నరేట్ చేసే వాచ్‍మెన్ పాత్రకు రావు రమేశ్ సరిగ్గా సూటయ్యారు. ఆయన లుక్, ఇంటెన్స్ వాయిస్ వల్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. మ్యాన్షన్‍లోకి వెళ్లే వారిని హెచ్చరించే పాత్రలో అయ్యప్ప శర్మ బాగా చేశారు. అవికా గోర్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, అభియన, మానస్, అమర్ దీప్, అర్చనా జాయిస్, బిందు మాధవి వారివారి కథల్లో పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల, అభియన, అవికా గోర్ నటన మెప్పిస్తుంది.
మొత్తంగా.. ‘మ్యాన్షన్ 24’ ఎక్కడా బోరు కొట్టించకుండా సాగే హారర్ వెబ్ సిరీస్. కథలు ఎక్కువగా ఉన్నా.. ఎక్కడా గందరగోళం ఉండదు. ఇది ఈ సిరీస్‍కు పెద్ద ప్లస్. అలాగని మరీ థ్రిల్లింగ్‍గానూ అనిపించదు. హారర్ తగిన మోతాదులోనే ఉంది. ‘ఏ’ రేటింగ్ ఉన్నా.. అభ్యంతరకర సన్నివేశాలు లేవు. ప్రధానమైన ట్విస్ట్ అంత థ్రిల్ చేయకపోయినా.. అంతకు ముందు మాత్రం మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. అధిక శాతం మంది ప్రేక్షకులను ‘మ్యాన్షన్ 24’ను మెప్పిస్తుంది.
బలాలు
- కథనం, ఓంకార్ డైరెక్షన్
- వరలక్ష్మీ శరత్ కుమార్ సహా నటీనటుల పర్ఫార్మెన్స్
- బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్
బలహీనతలు
- ఎమోషనల్‍గా కనెక్ట్ కాకపోవడం
- ప్రధానమైన ట్విస్ట్ ఊహించేలా ఉండడం
Mansion 24 Review: రేటింగ్: 2.75/5