Lawrence Bishnoi Web Series: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ కూడా ఫిక్స్.. ఆర్జీవీ ఏం చేస్తాడో?-lawrence bishnoi web series to come out soon gangster who is threatening salman khan to get his biopic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lawrence Bishnoi Web Series: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ కూడా ఫిక్స్.. ఆర్జీవీ ఏం చేస్తాడో?

Lawrence Bishnoi Web Series: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ కూడా ఫిక్స్.. ఆర్జీవీ ఏం చేస్తాడో?

Hari Prasad S HT Telugu
Oct 18, 2024 06:24 PM IST

Lawrence Bishnoi Web Series: లారెన్స్ బిష్ణోయ్‌పై ఓ వెబ్ సిరీస్ రాబోతోందట. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపుతామని అతని గ్యాంగ్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అతడు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాడు.

గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ కూడా ఫిక్స్.. ఆర్జీవీ ఏం చేస్తాడో?
గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్.. టైటిల్ కూడా ఫిక్స్.. ఆర్జీవీ ఏం చేస్తాడో? (HT File Photo)

Lawrence Bishnoi Web Series: లారెన్స్ బిష్ణోయ్.. పదేళ్లుగా జైల్లో ఉంటున్నా ఇప్పుడీ గ్యాంగ్‌స్టర్ పేరు మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. కృష్ణ జింకలను వేటాడినందుకు ఎన్నో ఏళ్లుగా సల్మాన్ ఖాన్ వెంట పడుతున్నారు అతడు, అతని గ్యాంగ్. ఈ మధ్యే సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని కూడా ఆ గ్యాంగే హత్య చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పుడదే లారెన్స్ బిష్ణోయ్ పై వెబ్ సిరీస్ రానుందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్

లారెన్స్ బిష్ణోయ్ పై వెబ్ సిరీస్ అన్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జానీ ఫైర్‌ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సిరీస్ ను నిర్మించనుందని న్యూస్18 రిపోర్టు వెల్లడించింది. అతని జీవితం ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుందట. అంతేకాదు ఈ సిరీస్ కు లారెన్స్ - ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిందట.

ఇక ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఇప్పటికే టైటిల్ కు ఓకే చెప్పినట్లు కూడా సదరు రిపోర్టు తెలిపింది. ఓ సాధారణ వ్యక్తి ఎలా గ్యాంగ్‌స్టర్ గా ఎదిగాడన్నది ఈ సిరీస్ లో చూపించనున్నట్లు సమాచారం. సుమారు 40 క్రిమినల్ కేసులు ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. 2014 నుంచి జైల్లోనే ఉన్నాడు.

గతంలోనూ రియల్ స్టోరీలతో..

లారెన్స్ బిష్ణోయ్ పై వెబ్ సిరీస్ తెరకెక్కిద్దామనుకుంటున్న జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్స్ గతంలోనూ కొన్ని రియల్ లైఫ్ ఘటనల ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టింది. అందులో ఎ టేలర్ మర్డర్ స్టోరీ, కరాచీ టు నోయిడాలాంటివి ఉన్నాయి.

ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ స్టోరీతోనూ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయాలని తాను భావిస్తున్నట్లు ఈ ప్రొడక్షన్ హౌజ్ హెడ్ అమిత్ జానీ అన్నారు. కాలేజీ వయసులోనే గ్యాంగ్‌స్టర్ గా మారి సుమారు 700 మందిని రిక్రూట్ చేసుకున్న లారెన్స్ బిష్ణోయ్ జీవితాన్ని వెబ్ సిరీస్ లో ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరమే.

లారెన్స్ బిష్ణోయ్‌పై ఆర్జీవీ కన్ను

కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ తిరిగి వార్తల్లో నిలుస్తుండటంతో అతని జీవితంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. కొన్ని రోజులుగా అతనిపై వరుస ట్వీట్లు చేస్తున్నాడు. అతని జీవితాన్ని తెరకెక్కించడంపైనా ఆసక్తి చూపించాడు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్ వెబ్ సిరీస్ వార్తలు వస్తుండటం విశేషం.

మరోవైపు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ గ్యాంగ్ నుంచి మరోసారి హెచ్చరికలు రావడంతో అతని ఇంటి దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా సల్మాన్ ఖాన్ ను చంపుతామని తాజాగా హెచ్చరికలు వచ్చాయి. తన సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యపై సల్మాన్ ఇప్పటి వరకూ స్పందించలేదు.

Whats_app_banner