Soundarya Birth Anniversary : నట సౌందర్యం.. నిన్ను ఎలా మరిచిపోగలం
Sondarya Birth Anniversary : తెర మీద నువ్ నవ్వితే మాకు ఆనందం.. నీ కంట కన్నీరు వస్తే.. మాకూ బాధ. స్క్రీన్ మీద నిన్ను చూస్తే నిండుతనం. నీ అసలు పేరు సౌమ్య సత్యనారాయణ అయినా.. సౌందర్యంతో మాకు సౌందర్యగానే పరిచయం అయ్యావ్. అలాంటి నీ జయంతి అంటే ఈరోజుకు ఇంకా నమ్మలేకున్నాం..
కొంతమంది నటిస్తారు.. మరికొంతమంది జీవిస్తారు.. కానీ అతికొద్దిమందే.. తమ నటనతో ప్రతీ ఇంటిలోని సభ్యులు అవుతారు. అలా తెలుగునాట ప్రతీ ఇంటి మనిషి అయింది నట సౌందర్యం సౌందర్య. విధి చేసిన వింత నాటకంలో నువ్ దూరమయ్యావ్. వెళ్లిపోయి.. కాలం పరుగులు పెడుతున్నా.. నువ్ లేవని కంటనీరు పెడుతుంది సినిమా. అంతటి అందం, అభినయం నీ సొంతం. కన్నడనాట పుట్టినా.. తెలుగు ప్రజలు నిన్ను దగ్గర చేసుకున్న తీరు.. వెండితెరకు ఇంకా గుర్తే. టీవీలో ఇప్పటికీ నీ సినిమా వస్తే.. నిన్ను గుర్తుచేసుకోని తెలుగు గుండె ఉండదేమో. అయ్యో.. సౌందర్యకు ఎందుకిలా అయిందని, ఇప్పుటికీ కళ్లలో నీరు తెచ్చుకునేవారు బోలేడు. అలాంటి నీ జయంతి(July 18) నేడు. ఒక్కసారి, మరోసారి.. కాదు.. కాదు.. ఎన్నిసార్లు నీ గురించి తలుచుకున్నా.. మళ్లీ మళ్లీ తలుచుకోవాలనిపించే రూపం, గుణం నీ సొంతం.
తెలుగు చిత్రపరిశ్రమలో కొంతమంది మహానటులు మన మధ్య లేకపోయినా.. వారి పాత్రలతో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారి వరుసలో ఉంటుంది సౌందర్య. ఎన్నో మంచి పాత్రలు చేసి.. తెలుగు వారి మదిలో చిరకాలం నిలిచిపోయింది. సావిత్రమ్మ తర్వాత.. అంతటి పేరు తెచ్చుకుంది సౌందర్య. ఈ తరం సావిత్రి అంటూ.. విమర్శకుల చేత అనిపించుకునేలా నటించింది.
తెర మీద తన నటనే.. కాదు తెర వెనక కూడా తన మనసు బంగారమే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగర్జున.. ఇలా చెప్పుకుంటూ పోతే.. పెద్ద పెద్ద స్టార్ నటులతో తెరను పంచుకుంది. సౌందర్యే హీరోయిన్ గా కావాలని వెయిట్ చేసిన వాళ్లూ ఉన్నారు.
మనవరాలి పెళ్లితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సౌందర్య. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో ఆకట్టుకుంది. హలో బ్రదర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. అమ్మోరు, పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది. హిందీలో సూర్యవంశం సినిమాతో అమితాబ్ తో కలిసి కనిపించింది.
ఇటు సాత్, అటు నార్త్ ప్రేక్షకులకు దగ్గరైంది. చనిపోయేంతవరకూ హీరోయిన్ గానే ఉంది. అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకున్న ఏకైన నటి సౌందర్య. నెంబర్ వన్ స్థానంలోనే ఉంటూ కన్నుమూసింది. పేరుకే ఆమె కన్నడ కస్తూరి.. కానీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి.. తెలుగు ఇంటి మనిషైంది.
18 జులై 1972 కర్ణాటకలో పుట్టిన సౌందర్య.. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. 100కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆమె అసలు పేరు సౌమ్య సత్యనారాయణ.. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి సలహా మేరకు సౌందర్యగా పేరు మార్చుకుంది.
సౌందర్య చివరిసారిగా వెండితెర మీద కనిపించిన తెలుగు చిత్రం మోహన్ బాబు హీరోగా నటించిన శివ శంకర్. ఈ సినిమా అప్పట్లో సౌందర్య చనిపోయాక థియేటర్స్ లో విడుదలైంది. ఆమె చనిపోయేనాటికి ఆమె ఆస్తుల విలువ 100 కోట్ల వరకూ ఉందని అంచనా. అంత డబ్బు ఉన్నా.. డౌన్ టూ ఎర్త్ ఉండేది సౌందర్య. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేది. ఇప్పటికి ఆమె ఇంటి నుంచి కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తాయని చెబుతుంటారు.