Krishna Vrinda Vihari Pre Release: ఈ సినిమా కోసం పాదయాత్ర చేశాను: నాగశౌర్య ఎమోషనల్ స్పీచ్
Krishna Vrinda Vihari Pre Release: ఈ సినిమా కోసం పాదయాత్ర చేశానంటూ కృష్ణ వ్రిందా విహారీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగశౌర్య ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Krishna Vrinda Vihari Pre Release: టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు పోషించే హీరో నాగశౌర్య ఇప్పుడు కృష్ణ వ్రిందా విహారి అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 23) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మంగళవారం (సెప్టెంబర్ 20) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మూవీ యూనిట్ మొత్తం పాల్గొని తమ అనుభవాలను పంచుకుంది.
ఈ మూవీలో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా నటిస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ ఇద్దరూ కలిసి ఓ పాటకు స్టెప్పులు కూడా వేయడం విశేషం. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. ఇక ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ మూవీతో తనకు రెండున్నరేళ్ల అనుబంధం ఉన్నదని చెప్పాడు.
"కొవిడ్ కారణంగా ఈ మూవీకి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆర్థిక సమస్యలూ తలెత్తాయి. అయినా ధైర్యంగా ఎదుర్కొని మొత్తానికి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నాం. డైరెక్టర్ అనీస్ కృష్ణ మంచి మనసున్న దర్శకుడు. నాకు మంచి సినిమా ఇవ్వబోతున్నారన్న నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం పాదయాత్ర చేశాను. అన్ని ఊళ్లూ తిరిగాను. కంటెంట్ బాగుంది కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాను. ఈ మూవీ బాగుందని నిజాయతీగా నమ్ముతున్నాను. మీరందరూ సెప్టెంబర్ 23న థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడండి" అని నాగశౌర్య కోరాడు.
ఇక ఈ కృష్ణ వ్రిందా విహారి మూవీ నాగశౌర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నాడు. ఇలాంటి సినిమాలు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఈ మూవీలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషిస్తోంది. ఇక తొలిసారి తెలుగులో నటించిన షిర్లీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
తాను కథ చెప్పగానే కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి షూటింగ్ మొదలుపెట్టిన నాగశౌర్యకు కృతజ్ఞతలు చెప్పాడు డైరెక్టర్ అనీష్ కృష్ణ. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించాడు.