Krishna Mukunda Murari August 8th Episode: కృష్ణకు కోడలిగా పట్టాభిషేకం చేసిన భవానీ - ముకుంద మాస్టర్ ప్లాన్ రివర్స్
Krishna Mukunda Murari August 8th Episode: కృష్ణను ఇంటి కోడలిగా అంగీకరిస్తుంది భవానీ. వంశపారంపర్యంగా వస్తోన్న ఏడు వారాల నగలను ఆమెకు బహుమతిగా ఇస్తుంది. ఆ తర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Krishna Mukunda Murari August 8th Episode: మురారి, కృష్ణలు విడిపోకుండా ఆపాలంటే భవానీని రంగంలోకి దింపడమే మంచిదని ఫిక్స్ అవుతుంది రేవతి. వారిద్దరి గురించి భవానీతో చెప్పాలని అనుకుంటుంది. కానీ రేవతిని వెతుక్కుంటూ భవానీ వస్తుంది. కృష్ణ విషయంలో తాను ఓ నిర్ణయానికి వచ్చానని అంటుంది. చెప్పకుండా పెళ్లిచేసుకున్నందుకు మురారిపై కోపంతో కృష్ణను ఇన్నాళ్లు దూరం పెట్టానని, కృష్ణ పట్ల అయిష్టాన్ని ప్రదర్శించారనని రేవతితో అంటుంది భవానీ.
రోజులుగడుస్తోన్న కొద్ది కృష్ణ మంచితనం అర్థం చేసుకున్నానని భవానీ అంటుంది. ఎదుటివాడికి సాయపడేతత్వం కృష్ణలో ఉందని, ఆమె వల్లే నందు మళ్లీ పుట్టింటిలో ఆనందంగా తిరుగుతోందని కృష్ణపై ప్రశంసలు కురిపిస్తుంది భవానీ.
కృష్ణకు సర్‌ప్రైజ్...
మంచి గుణాలున్న కృష్ణను కోడలిగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నానని, తన తర్వాత ఇంటి బాధ్యతల్ని కృష్ణకే అప్పగించాలని నిర్ణయించుకుంటున్నట్లు రేవతితో అంటుంది భవానీ. కోడలికి ఇచ్చే ఏడు వారాల నగలు కృష్ణకు పెళ్లి వేడుకలో ఇచ్చి సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు చెబుతుంది.
కృష్ణ కళ్లలో ఆనందం తానే మొదట చూడాలని అనుకుంటున్నట్లు, ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని రేవతిని రిక్వెస్ట్ చేస్తుంది భవానీ. కృష్ణ నీ మనసును గెలుచుకున్నందుకు ఆనందించాలో, ఇంటి నుంచి వెళ్లిపోతుందని తెలిసి బాధపడాలో అర్థం కావడం లేదని రేవతి లోలోన వేదనకు గురవుతుంది.
మంచి మొగుడు...
తన గోరింటాకు బాగా పండటంతో కృష్ణ ఆనందపడుతుంది. గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని బామ్మ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటుంది. మంచి మొగుడు వచ్చాడు కానీ అతడి మనసులో తనకు స్థానం లేదని, అతడు నా సొంతం కాదని అనుకుంటుంది. ఇంట్లో పది రోజులు మాత్రమే ఉండబోతున్నట్లు గుర్తుచేసుకొని బాధపడుతుంది. పెళ్లి రోజు కూడా ఆలస్యంగా నిద్రలేవడంతో మురారి, కృష్ణలపై ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ అవుతారు.
ముకుంద మాస్టర్ ప్లాన్...
కృష్ణ, మురారిలను విడదీసేందుకు ముకుంద కొత్త ఎత్తు వేస్తుంది. నందు మనసులో కృష్ట పట్ల ద్వేషాన్ని నింపాలని అనుకుంటుంది. మురారికి కృష్ణ అంటే ప్రాణమని అంటుంది. కానీ కృష్ణకు మాత్రం ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఎదురుచూస్తుందని నందుతో అంటుంది ముకుంద.
మురారిని చూస్తే జాలేస్తుందని చెబుతుంది ముకుంద. కానీ నందు మాత్రం ముకుందకు షాకిస్తుంది. ఆదర్శ్ లేకపోవడంతో నువ్వు కూడా ఒంటరిగా మారిపోయావని, ఆ విషయంలో నిన్ను చూస్తుంటే కూడా జాలిగా ఉందంటూ ఎదురుసమాధానం ఇస్తుంది. కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోయే సంగతి తనకు తెలుసునని ముకుందతో అంటుంది.
భవానీ ట్విస్ట్...
పెళ్లిపీటలపై కూర్చొనే సమయంలో నీ ప్రేమ సంగతి కృష్ణతో చెబితే మంచిదని మురారికి సలహా ఇస్తుంది నందు. ఈ విషయం గురించి కృష్ణతో తాను మాట్లాడాతనని అంటుంది. కృష్ణ మనసులో తాను లేనని తెలిసిన తర్వాత ప్రేమ గురించి చెబితే బాగుండదని నందుతో అంటాడు మురారి. కృష్ణను పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి తీసుకొస్తుంది ముకుంద.
గతంలో మాకు చెప్పకుండా సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్నారు, మీ పెళ్లిని కళ్లారా చూడలేకపోయామని, అందుకే మళ్లీ పెళ్లి ఏర్పాట్లు తానే చేసినట్లు కృష్ణతో అంటుంది భవానీ. ఈ పెళ్లితో నువ్వు సంపూర్ణంగా మా ఇంటి కోడలివి అవుతావని అంటుంది. నిన్ను చిన్న కోడలిగా అంగీకరిస్తున్నట్లు చెబుతుంది. తమ కుటుంబానికి వంశపారంపర్యంగా ఇచ్చే ఏడు వారాల నగలు ఇచ్చి కృష్ణకు కోడలిగా పట్టాభిషేకం చేయబోతున్నట్లు భవానీ ప్రకటిస్తుంది.
ఏడు వారాల నగలు...
కృష్ణను తన రూమ్‌లోకి తీసుకెళుతుంది భవానీ. ముగ్గురిలో ఏ కోడలు తన మనసును గెలుచుకుంటుందో, ఎవరైతే ఈ ఇంటిని, వంశగౌరవాన్ని నిలబెడతారో వారికే ఈ ఏడు వారాల నగలను ఇవ్వాలని ఇన్నాళ్లు దాచిపెట్టానని కృష్ణతో అంటుంది భవానీ. ఇప్పుడు ఇవన్నీ నీకు ఇస్తున్నట్లు సంతోషంగా కృష్ణతో చెబుతుంది భవానీ.
ఈ ఇంట్లో అందరిని భయంతో తాను క్రమశిక్షణలో పెడితే, కానీ నువ్వు ప్రేమతో దారిలోకి తీసుకొచ్చావని కృష్ణను మెచ్చుకుంటుంది భవానీ. . నీపై నాకు ఆ నమ్మకం ఉందని అంటుంది. కానీ మీ అందరి మనసుల్ని తాను గెలుచుకున్నా...మురారి మనసును మాత్రం గెలవలేకపోయానని బాధపడుతుంది కృష్ణ. మురారి, తాను కలిసి పెళ్లి పేరుతో నాటకం ఆడుతూ భవానీని మోసం చేస్తున్నట్లుగా ఫీలవుతుంది. మనసులోనే భవానీకి క్షమాపణలు చెబుతుంది.
ముకుంద అసహనం...
భవానీ చేత కృష్ణ చిన్నకోడలిగా పట్టాభిషేకం చేయించుకోవడం ముకుంద జీర్ణించుకోలేకపోతుంది.ఈ కొద్ది రోజులు కృష్ణపై భవానీ ఎంత ప్రేమ చూపిస్తే, అగ్రిమెంట్ మ్యారేజీ గురించి దాచి కృష్ణ తనను మోసం చేసిందని తెలిసిన తర్వాత అంత అసహ్యించుకుంటుందని అనుకుంటుంది. ఈ లోపు కృష్ణ, మురారిల ప్రేమ విషయం బయటపడకుండా జాగ్రత్తపడాలని అనుకుంటుంది.