Kismat Review: కిస్మత్ మూవీ రివ్యూ.. ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Kismat Movie Review In Telugu: అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఏప్రిల్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా కిస్మత్. డబ్బు చుట్టూ తిరిగే నేపథ్యంతో ఉన్న ఈ మూవీ ఎలా ఉందో కిస్మత్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: కిస్మత్
నటీనటులు: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకొండ, రియా సుమన్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, టెంపర్ వంశీ తదితరులు
దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని
నిర్మాత: రాజు
సంగీతం: మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫీ: వెదరామన్ శంకరన్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
థియేట్రికల్ రిలీజ్ డేట్: ఫిబ్రవరి 2, 2024
ఓటీటీ రిలీజ్ డేట్: ఏప్రిల్ 2, 2024
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
Kismat Review In Telugu: అభినవ్ గోమఠం, నరేష్ అగస్త్య, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా కిస్మత్. రియా సుమన్ హీరోయిన్‌గా అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సరిగ్గా రెండు నెలలకు అంటే ఏప్రిల్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది కిస్మత్ రివ్యూలో చూద్దాం.
కథ:
కార్తీక్ (నరేష్ అగస్త్య), అభి (అభినవ్ గోమఠం), (కిరణ్ విశ్వదేవ్) ముగ్గురు మంచి ఫ్రెండ్స్. మంచిర్యాలకు చెందిన ఈ ముగ్గురు బీటెక్ పూర్తి చేసి నిరోద్యుగులుగా ఉంటారు. ఊరిలో అల్లర చిల్లరగా తిరుగుతూ, తల్లిదండ్రులతో తిట్లు తింటుంటారు. ఓసారి గొడవ కారణంగా పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ల మాటలతో ఉద్యోగం వెతుక్కుందామని హైదరాబాద్ వెళ్తారు. మరోవైపు హైదరాబాద్‌లో ఎలక్షన్ హడావిడి నడుస్తుంటుంది.
పది కోట్లతో ఎస్కేప్
అనేక విద్యాసంస్థలను నెలకొల్పి విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న జనార్ధన్ (అజయ్ ఘోష్) ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతన్ని ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ లోక్‌నాథ్ (సమీర్) టార్గెట్ చేసి దాడులు చేస్తుంటాడు. అతని నుంచి తప్పించుకునేందుకు తన వద్ద ఉన్న రూ. 20 కోట్ల డబ్బును తన అనుచరులు సూరి, రాజుకు ఇచ్చి దాచి పెట్టమని చెబుతాడు. కానీ, రాజు మాత్రం పది కోట్లతో ఎస్కేప్ అవుతాడు. రాజును పట్టుకునే క్రమంలో అతన్ని చంపేస్తాడు సూరి.
హైలెట్ అంశాలు
మరి రాజు ఆ పది కోట్లు ఎక్కడ పెట్టాడు? అతను దాచిన ఆ డబ్బు కార్తీక్ బ్యాచ్‌కు ఎలా దొరికింది? ఆ తర్వాత వాళ్ల జీవితంలో ఎలాంటి సంఘటనలు ఫేస్ చేశారు? కార్తీక్ అతని స్నేహితులు ఉద్యోగం సంపాదించుకున్నారా? ఈ క్రమంలో అజయ్ ఘోష్ వద్ద ఉన్న మరో 10 కోట్లు ఎలా పోయాయి? అవి చివరికీ ఎవరికి చిక్కాయి? బ్యాక్ డోర్ ఉద్యోగాలు, హెచ్ఆర్ తాన్య (రియా సుమాన్), ఎస్సై వివేక్ (అవసరాల శ్రీనివాస్) పాత్రలు ఏంటీ? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే కిస్మత్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
కిస్మత్ ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ. డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి తరహాలో ఇప్పటికీ చాలా సినిమాలే వచ్చాయి. కథలో కొత్తదనం ఏముండదు. కానీ, ప్రారంభం నుంచి టేకింగ్ మాత్రం బాగుంటుంది. ముందు జనార్ధన్ పాత్ర తాలుకూ ఇంట్రడక్షన్, ఎమ్మెల్యే అవడానికి కారణం, బ్లాక్ మనీ, ఇన్‌కమ్ టాక్స్ దాడి సీన్లతో ఇంట్రెస్టింగ్‌గా థ్లిల్లింగ్‌గా ఉంటుంది. అనంతరం ముగ్గురు స్నేహితుల సరదాలు, చిల్లర గొడవలు, పంచ్ డైలాగ్స్ ఉన్న కామెడీ సీన్లతో ఎంగేజ్ చేశారు.
క్యాట్ అండ్ మౌస్ గేమ్
ఈ ముగ్గురు స్నేహితులకు డబ్బు దొరికే విధానం, తాన్యతో కార్తీక్ లవ్ ట్రాక్, బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే కిస్మత్ టైటిల్ సాంగ్ ఇతర సన్నివేశాలతో మెప్పించారు. సినిమాను ఊహించేలా రొటీన్ సీన్స్ ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. చాలా వరకు కామెడీతో, డబ్బు కొట్టేసే సన్నివేశాలతో క్యాట్ అండ్ మౌస్ గేమ్‌తో చాలా బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. మధ్యలో వచ్చే ఒకటి రెండు పాటలు సైతం బాగానే ఉన్నాయి.
ఫైనల్‌గా చెప్పాలంటే..
Kismat Movie Review 2024: సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు అన్ని చక్కగా కుదిరాయి. ఇక నటీనటుల పర్ఫామెన్స్ చాలా బాగుంది. సినిమా అంతటికి వారి నటనే హైలెట్. అభినవ్ గోమఠం నుంచి గంగవ్వ వరకు అంతా చాలా బాగా చేశారు. అభినవ్ గోమఠం తన కామెడీ టైమింగ్‌తో మరోసారి అలరించాడు. అలాగే నరేష్ అగస్త్య, విశ్వదేవ్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ బాగా చేశారు. అవసరాల శ్రీనివాస్ కామెడీ ట్రాక్ అలరిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌లో మంచి టైమ్ పాస్ చేసే సినిమా కిస్మత్.