Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పి.. తన వివాదాస్పద వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్న నటి కస్తూరి
Actress Kasthuri Controversy: నటి కస్తూరి ఎట్టకేలకి వెనక్కి తగ్గింది. తెలుగు వారిపై నోరుజారి రెండు రోజులు విమర్శలు ఎదుర్కొన్న కస్తూరి.. ఈరోజు బహిరంగ క్షమాపణలు చెప్తూ లేఖని విడుదల చేసింది.
నటి కస్తూరి ఎట్టకేలకు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. తెలుగు వారికి క్షమాపణలు చెప్పింది. దాంతో గత రెండు రోజులుగా నడుస్తున్న వివాదానికి ఇక్కడితో తెరపడినట్లు కనిపిస్తోంది. తమిళనాడులో రెండు రోజుల క్రితం జరిగిన ఒక మీటింగ్‌లో తెలుగు వారికి గురించి హేళనగా నటి కస్తూరి మాట్లాడింది.
నోరుజారిన కస్తూరి
తమిళనాడులో సుమారు మూడు శతాబ్దాల క్రితం అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు ఇక్కడికి వచ్చారంటూ నటి కస్తూరి ఆ మీటింగ్‌లో మాట్లాడింది. ఇప్పుడు వాళ్లంతా తమది తెలుగు జాతి అంటున్నారంటూ వెటకారం చేసింది. సేవ చేయడానికి వలస వచ్చిన వాళ్లే.. ఇప్పుడు బ్రహ్మణులను తమిళులు కాదంటున్నారని.. అలా కాదు అని చెప్పడానికి వీళ్లు ఎవరు? అంటూ తెలుగు వారిపై రెచ్చిపోయింది.
సమర్థించుకున్న కస్తూరి
నటి కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవగా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర స్థాయిలో కస్తూరిపై మండిపడ్డారు. వెంటనే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. సోమవారం తన వ్యాఖ్యలను సమర్థించుకున్న కస్తూరి.. . డీఎంకే పార్టీ తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. అయినప్పటికీ తెలుగు వారు వెనక్కి తగ్గలేదు. కస్తూరిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఈ సీనియర్ నటికి తత్వం బోధపడింది.
క్షమాపణ చెప్తూ కస్తూరి బహిరంగ లేఖ
తెలుగు ప్రజలకి బహిరంగంగా క్షమాపణలు చెబుతూ.. తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకూంటూ ఒక లేఖని కస్తూరి మంగళవారం విడుదల చేసింది. ‘‘తెలుగు వారిని బాధపెట్టడం నా ఉద్దేశం కాదు.. నేను మాట్లాడిన మాటల్ని ఉపసంహరించుకుంటున్నాను. నేను కేవలం తమిళనాడులోని బ్రాహ్మణులకి మద్దతుగా నిలవాలని ప్రయత్నించాను.
ఈ క్రమంలో మాట్లాడిన మాటలే అవి. తెలుగు ప్రజలు సుదీర్ఘకాలంగా నాకు ఎంతో ప్రేమ, కుటుంబాన్ని, కీర్తిని ఇచ్చారు. నేను తెలుగు వారి అందరి గురించి అలా మాట్లాడలేదు. కేవలం కొందరిని ఉద్దేశించి మాత్రమే అలా మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అని ఆ లేఖలో కస్తూరి రాసుకొచ్చింది.
కస్తూరిపై కేసు నమోదు
కస్తూరి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే చెన్నైలో కేసు నమోదైంది. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ తాజాగా ఆమెపై చెన్నై పోలీస్ కమీషనర్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసింది. కస్తూరి వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా ఉన్నాయని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ పేర్కొంది.