TBSP Schemes : బ్రాహ్మణుల విద్య, స్వయం ఉపాధి పథకాలు .. వీటి గురించి మీకు తెలుసా.. ?-telangana brahmin samkshema parishad invites applications various schemes know details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Brahmin Samkshema Parishad Invites Applications Various Schemes Know Details Here

TBSP Schemes : బ్రాహ్మణుల విద్య, స్వయం ఉపాధి పథకాలు .. వీటి గురించి మీకు తెలుసా.. ?

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 10:44 PM IST

TBSP Schemes : రాష్ట్రంలో బ్రాహ్మణుల విద్య, స్వయం ఉపాధి, వేద విద్య, కళల ప్రోత్సాహం కోసం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పలు పథకాలు అమలు చేస్తోంది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది.

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలు

TBSP Schemes : రాష్ట్రంలో బ్రాహ్మణ విద్యార్థులు, నిరుద్యోగులు, స్వయం ఉపాధి ఆశావాహుల కోసం అండగా నిలిచి.. సహాయం అందించేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (TBSP) కృషి చేస్తోంది. 2017, జనవరి 28న తెలంగాణ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు వేలాది మంది బ్రాహ్మణులు ఈ పరిషత్ ద్వారా లబ్ధి పొందారు. టీబీఎస్పీ ఆధ్వర్యంలో పలు పథకాలు అమలవుతున్నాయి. వీటి కింద దరఖాస్తు చేసుకున్న వారికి ప్రయోజనాలు అందించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. తాజాగా.. వివేకానంద విదేశీ విద్యా పథకం 121 మంది విద్యార్థులకు రూ. 24.20 లక్షల మంజూరు పత్రాలను అందించారు.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మొత్తం 8 పథకాలు అమలవుతున్నాయి. అవి... వివేకానంద విదేశీ విద్యా పథకం.. శ్రీ రామానుజ ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం... వేద, శాస్త్ర పండితులకు గౌరవ వేతనం... వేదహిత - వేద పాఠశాలలకు మరియు వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం... సాంప్రదాయ పాఠశాల - కంచి కామకోటి పీఠం... ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తల ప్రోత్సాహం... విప్రహిత బ్రాహ్మణ సదనం.... తెలంగాణ బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు శిక్షణ.

వివేకానంద విదేశీ విద్యా పథకం

ఈ పథకం కింద విదేశాలలో మాస్టర్స్ చేయాలని అనుకునే బ్రాహ్మణ విద్యార్థులకు రూ. 20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తారు. తెలంగాణకు చెందిన బ్రాహ్మణ పట్టభద్రులు అర్హులు. బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించరాదు. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐలెట్స్, పీటీఈ వంటి పరీక్షలు రాసి కనీస మార్కులు పొంది ఉండాలి. వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక సహాయం ఫీజు రీయంబర్స్ మెంట్ రూపంలో అందిస్తారు. దరఖాస్తు చేసిన తేదీ నుంచి పథకం వర్తిస్తుంది.

శ్రీ రామానుజ ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం

పీజీ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఫీజు రీయంబర్స్ మెంట్ రూపంలో ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాలలో రూ. 2 లక్షలు.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వివిధ కోర్సులకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వడం జరుగుతుంది.

వేద, శాస్త్ర పండితులకు గౌరవ వేతనం

సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరవు అవుతున్న నేపథ్యంలో.. వేద విద్యను ప్రోత్సహించడం కోసం... వేద, శాస్త్ర విద్యలలో నిష్టాతులైన 75 సంవత్సరాలు పైబడిన వేద మరియు శాస్త్ర పండితులకు రూ. 2,500 నెలసరి గౌరవ భృతి అందించే పథకం ఇది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కమిటీ సిఫార్సుల మేరకు గౌరవ భృతి మంజూరు చేస్తారు.

వేదహిత - వేద పాఠశాలలకు మరియు వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

ఈ స్కీమ్ కింద... వేదహిత, వేద పాఠశాలలను ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందిస్తారు. వేద పాఠశాలలకు ఆలంబనగా రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ఇస్తారు. అర్హత ఉన్న వేద పాఠశాలలు ఆన్ లైన్ ద్వారా లేదా నేరుగా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు.

వేద విద్యార్థులకి నెలకి రూ. 250 స్టైపెండ్ ఇస్తారు. స్మార్తం పూర్తి చేసిన విద్యార్థులకు జీవనోపాధి కొరకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే.. ఆగమం, క్రమాంతం మరియు ఘనాంతం విద్య పూర్తి చేసిన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సాంప్రదాయ పాఠశాల - కంచి కామకోటి పీఠం

కంచికామకోటి మఠాధిపతి ఆశీస్సులతో ప్రత్యక్ష చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నాగోల్ లో ఒక సంప్రదాయ పాఠశాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. కళలు, నృత్యం, సంగీతం, యోగ, కుట్లు, అల్లికలు వంటి కళలను ఈ పాఠశాల నేర్పిస్తోంది.

ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తల ప్రోత్సాహం

తెలంగాణలోని పేద బ్రాహ్మణులు వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించే పథకం ఇది. దీని ద్వారా .... యూనిట్ విలువ రూ. 1 లక్ష లోపుఉంటే.. 80 శాతం రాయితీ... రూ. 2 లక్షల లోపుఉంటే.. 70 శాతం, రూ. 2 నుంచి రూ. 12 లక్షల లోపు ఉంటే.. 60 శాతం రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ పథకం కింద ప్రాజెక్టు విలువ రూ. 12 లక్షలు మించకూడదు. కనీస విద్యార్హత 10వ తరగతి. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాలలో రూ. 2 లక్షలు.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

విప్రహిత బ్రాహ్మణ సదనం

బ్రాహ్మణ సమాజ హిత కార్యక్రమాల నిర్వహణ అవసరమైన అన్ని వసతులతో కూడిన భవన నిర్మాణానికై ఉద్దేశించిన పథకం ఇది. దీనిద్వారా భవన నిర్మాణంలో అయ్యే ఖర్చులో 75 శాతం పరిషత్తు భరిస్తుంది. ఒక ఎకరానికి తక్కువ కాకుండా ఉచిత పద్ధతిన పరిషత్తుకు భూ యాజమాన్య హక్కులు కల్పించాల్సి ఉంటుంది.

తెలంగాణ బ్రాహ్మణ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు శిక్షణ

టీఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బ్రాహ్మణ అభ్యర్థులకు.. ఉచిత శిక్షణ ఇచ్చేపథకం ఇది. ఇందులో భాగంగా... టీబీఎస్పీ బీసీ సంక్షేమ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా 12 బీసీ స్టడీ సెంటర్లలో బ్రాహ్మణ అభ్యర్థులు కోచింగ్ తీసుకోవచ్చు. అర్హులైన వారు.. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకూ 161 మంది లబ్ధి పొందారు.

ఈ పూర్తి పథకాలకు సంబంధించిన మరింత సమాచారం, దరఖాస్తు ప్రక్రియ కోసం

https://brahminparishad.telangana.gov.in/ వెబ్ సైట్ ని సందర్శించండి.

IPL_Entry_Point