Kangana Ranaut: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. ఈ దేశంలోని పరిస్థితులు చూసి బాధేస్తోంది: నటి, ఎంపీ కామెంట్స్ వైరల్
Kangana Ranaut: చంపేస్తామని బెదిరిస్తున్నారని అధికార పార్టీ ఎంపీ, నటి అయిన కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ దేశంలోని పరిస్థితులు చూసి బాధేస్తున్నట్లు ఆమె చెప్పడం గమనార్హం. తన సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇంకా రాకపోవడంపై ఆమె ఇలా స్పందించింది.
Kangana Ranaut: తరచూ వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంది బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. ఈ మధ్యే రైతుల ఉద్యమం బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులకు దారి తీసేదంటూ నోరు జారిన ఆమె.. తాజాగా తన నెక్ట్స్ మూవీ ఎమర్జెన్సీకి సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ రాకపోవడంపై స్పందించింది. చంపేస్తామని బెదిరిస్తున్నారని కంగనా ఓ వీడియో రిలీజ్ చేసింది.
చంపేస్తామని బెదిరిస్తున్నారు
ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ రోజుల ఆధారంగా కంగనా రనౌత్ నిర్మించిన మూవీ ఎమర్జెన్సీ. ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది. అయితే ఇంత వరకూ తన సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ రాకపోవడంపై శుక్రవారం (ఆగస్ట్ 30) కంగనా స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
తమతోపాటు సీబీఎఫ్‌సీ సభ్యులకు కూడా బెదిరింపులు వస్తున్నట్లు ఆమె చెప్పింది. "మా సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ వచ్చేసిందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదు. నిజానికి మా సినిమాకు సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ వచ్చినా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపారు. ఎందుకంటే సెన్సార్ వాళ్లను చంపేస్తామంటూ చాలా బెదిరింపు సందేశాలు వస్తున్నాయి" అని ఆ వీడియోలో కంగనా వెల్లడించింది.
దేశం పరిస్థితి చూసి బాధేస్తోంది
ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చూస్తే బాధేస్తోందని కూడా కంగనా ఆ వీడియోలో చెప్పింది. "మిసెస్ గాంధీ హత్యను చూపించకూడదని, భింద్రేవాలాను చూపించొద్దని, పంజాయ్ అల్లర్లను చూపించకూడదని మాపై ఒత్తిడి వస్తోంది. మరి ఏం చూపించాలో అర్థం కావడం లేదు. హఠాత్తుగా సినిమాను బ్లాకౌట్ చేస్తున్నారు. ఇది నమ్మశక్యం కాని సమయం. ఈ దేశంలో పరిస్థితులు చూసి నాకు చాలా బాధేస్తోంది" అని కంగనా ఆ వీడియోలో వాపోయింది.
ఎమర్జెన్సీ మూవీలో ఇందిరా గాంధీ పాత్రలో నటించడంతోపాటు మూవీని కంగనానే డైరెక్ట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. మొత్తానికి సెప్టెంబర్ 6న రిలీజ్ కాబోతున్నట్లు కొన్ని రోజుల కిందట అనౌన్స్ చేసి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
ఎమర్జెన్సీ మూవీలో కంగనాతోపాటు అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయస్ తల్పడే, విశాఖ్ నాయర్, దివంగత సతీష్ కౌశిక్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. దేశంలో ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో 1975 నుంచి 1977 మధ్య రెండేళ్ల పాటు విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.