Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Kalvan Review: జీవీ ప్రకాష్ కుమార్, ఇవానా జంటగా నటించిన కాల్వన్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో రిలీజైన ఈ తమిళ మూవీ ఎలా ఉందంటే?
Kalvan Review: జీవీ ప్రకాష్ కుమార్, భారతీరాజా, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన కాల్వన్ మూవీ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజైంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి పీవీ శంకర్ దర్శకత్వం వహించాడు. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న కాల్వన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
బాలమణితో ప్రేమాయణం...
కెంబన్ అలియాస్ కెంబరాజు (జీవీ ప్రకాష్ కుమార్) తన స్నేహితుడు సూరితో(దీనా) కలిసి అడవి పక్కన ఉన్న పల్లెటూళ్లో జీవిస్తుంటాడు. ఇద్దరు అనాథలు. ఊళ్లోనే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పబ్బం గడుపుకుంటారు. ఓ రోజు బాలామణి (ఇవానా) ఇంట్లో దొంగతానినికి వెళతారు కెంబన్, సూరి. వారిని తెలివిగా పోలీసులకు పట్టిస్తుంది బాలామణి. ఆమె ధైర్యం, అందచందాలు చూసి బాలామణితో కెంబన్ ప్రేమలో పడతాడు. కెంబన్ ప్రేమ విషయం తెలుసుకున్న బాలామణి అతడిని దొంగ అంటూ దారుణంగా అవమానిస్తుంది.
బాలామణి మనసును గెలవడం కోసం అనాథశ్రమంలో ఉన్న ఓ వృద్ధుడిని (భారతీరాజా)తాతగా దత్తత తీసుకొని తన ఇంటికి తీసుకొస్తాడు కెంబన్. నిజంగానే వృద్ధుడిని కెంబన్ దత్తత తీసుకున్నాడని అతడి మంచితనానికి బాలామణి ఫిదా అవుతుంది. అతడితో ప్రేమలో పడుతుంది.
కానీ దత్తత పేరుతో డ్రామా ఆడుతాడు కెంబన్. ఎనుగుల దాడిలో ఎవరైన చనిపోతే వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని తెలుసుకుంటాడు. ఆ డబ్బు కోసం తాతను దత్తత తీసుకున్న కెంబన్...అతడిని ఎలాగైనా ఏనుగుల బారిన పడేలా చేసి చంపేయాలని ప్లాన్‌వేస్తాడు? కెంబన్ ప్లాన్‌ను తాత ఎలా తిప్పికొట్టాడు? ఎలాంటి జంతువునైనా క్షణాల్లో మచ్చిక చేసుకునే శక్తి వృద్ధుడికి ఎలా వచ్చింది? కెంబన్ కుట్రల గురించి బాలామణితో పాటు తాతకు తెలిసిందా? కెంబన్ కోసం తాత చేసిన త్యాగం ఏమిటి? కెంబన్ మంచివాడిగా ఎలా మారాడు? అన్నదే కాల్వన్ మూవీ కథ.
సర్వైవల్ థ్రిల్లర్ మూవీ...
సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌కు లవ్‌స్టోరీ, హ్యుమన్ ఎమోషన్స్ జోడిస్తూ దర్శకుడు పీవీ శంకర్ కాల్వన్ మూవీని తెరకెక్కించాడు. డబ్బు కోసం ఓ దొంగ ఎలాంటి ఎత్తులు వేశాడు? అతడి ప్లాన్స్ ఎలా రివర్స్ అయ్యాయన్నది సెంటిమెంట్, కామెడీతో ప్రధానంగా ఈ సినిమాలో చూపించారు
ప్రతి పాత్ర వెనుక మరో కోణం...
సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, భారతీరాజాతో పాటు ప్రతి పాత్ర వెనుక మరో కోణం ఉండేలా దర్శకుడు రాసుకున్న తీరు బాగుంది. బ్యాక్‌డ్రాప్, పాయింట్ కొత్తగా ఉన్నా దానిని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కామెడీ, సెంటిమెంట్, లవ్ ఏది సరిగా వర్కవుట్ కాలేదు.
తాతను దత్తత తీసుకోవడం వెనుకున్న రీజన్‌ను హీరో రివీల్ చేయడం, ఆ వృద్ధుడి నేపథ్యానికి సంబంధించి వచ్చే ఒకటి రెండు ట్విస్ట్‌లు మాత్రమే పర్వాలేదనిపిస్తాయి. అలాంటివి మరికొన్ని ఉండేలా కథ రాసుకుంటే బాగుండేది.
లవ్ స్టోరీ సాగతీత...
హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీతో పాటు వృద్ధుడిని ఏనుగుదాడిలో చంపేందుకు హీరో, అతడు స్నేహితులు వేసే ప్లాన్స్ ప్రహాసనంలా సాగిపోతుంటాయి. కంటి చూపుతో పులిని భారతీరాజా భయపెట్టే సీన్‌ను డైరెక్టర్ సీరియస్‌గా ప్లాన్ చేశాడు. కానీ ఆ సీన్ మొత్తం కామెడీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది.
జీవీ ప్రకాష్ యాప్ట్ కాదు...
కెంబన్ పాత్రకు జీవీ ప్రకాష్ కుమార్ సరైన యాప్ట్ అనిపించలేదు. ఎమోషనల్ సీన్స్‌లో తేలిపోయాడు. భారతీరాజా క్యారెక్టర్‌ను డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. ఇవానా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. హీరో స్నేహితుడిగా దీనా పంచ్ డైలాగ్స్ కొన్ని నవ్వించాయి.
పేరులో ఉన్న థ్రిల్...
కాల్వన్ అంటే తెలుగులో దొంగ అని అర్థం. ఈ పేరులో ఉన్న థ్రిల్ సినిమాలో మాత్రం లేదు. ఔట్‌డేటెడ్ కామెడీ, లవ్‌స్టోరీతో సాగే సాదాసీదా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇది.