Blink OTT: దసరా హీరో దీక్షిత్ శెట్టి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Blink OTT: దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ మూవీ బ్లింక్ ఓటీటీలోకి వచ్చింది. ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్‌లో...
మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో బ్లింక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం కన్నడ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. బ్లింక్ కన్నడ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
మౌత్ టాక్‌తో...
బ్లింక్ మూవీకి శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టికి జోడీగా మందాత హీరోయిన్‌గా నటించింది. చైత్ర జే ఆచార్ కీలక పాత్ర పోషించింది. మార్చి 8న ఈ కన్నడ మూవీ థియేటర్లలో రిలీజైంది. తొలుత యాభై లోపు థియేటర్లు మాత్రమే ఈ సినిమాకు దొరికాయి. మౌత్‌టాక్ బాగుండటంతో థియేటర్లు పెరిగాయి. కథ, కథనాలతో పాటు దీక్షిత్ శెట్టి యాక్టింగ్, డైరెక్టర్ శ్రీనిధి టేకింగ్‌పై ప్రశంసలు కురిశాయి.
బ్లింక్ కథ ఇదే...
అపూర్వ (దీక్షిత్ శెట్టి) పీజీలో ఫెయిలవుతాడు. ఆ విషయం తల్లి దగ్గర దాచిపెట్టి పార్ట్‌టైమ్ జాబ్‌లు చేస్తూ పబ్బం గడుపుతుంటాడు. స్వప్నను (మందాత) ప్రాణంగా ప్రేమించిన అపూర్వ మంచి జాబ్ సంపాదించి జీవితంలో సెటిల్ కావాలని అనుకుంటాడు. తండ్రి గురించి వెల్లడైన ఓ రహస్యం కారణంగా సాఫీగా సాగిపోతున్న అపూర్వ జీవితం మొత్తం తలక్రిందులు అవుతుంది.
కంటిరెప్పలను మూయకుండా నియత్రించే శక్తి అపూర్వకు ఎక్కడి నుంచి వచ్చింది? అదే అతడి లైఫ్‌ను ఎలా కష్టాల్లోకి నెట్టింది? కంటి రెప్పలను మూసిన మరుక్షణం టైమ్ ట్రావెల్‌లో అతడు ముందుకు...వెనక్కి ఎలా వెళ్లాడు అన్నదే బ్లింక్ మూవీ కథ. 1996, 2001, 2021, 2035 కాలాన్ని చూపిస్తూ మొత్తం నాలుగు టైమ్ పీరియడ్స్ నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఈ మూవీ సాగుతుంది.
దియా మూవీతో హీరోగా...
దియా మూవీతో కన్నడంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దీక్షిత్ శెట్టి. ట్రాయాంగిల్ లవ్‌స్టోరీతో తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. దసరా మూవీలో కీర్తి సురేష్ లవర్ పాత్రతో తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు.
తెలుగులో దసరాతో పాటు ముగ్గురు మొనగాళ్లు, ది రోజ్ విల్లా సినిమాలు చేశాడు. నాని నిర్మించిన మీట్ క్యూట్ వెబ్‌సిరీస్‌లో కనిపించాడు. ప్రస్తుతం కన్నడంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు దీక్షిత్ శెట్టి. తెలుగులో దీక్షిత్ శెట్టి కొత్త మూవీ ఇటీవలే ఓపెనింగ్‌ను జరుపుకుంది.సినిమాల్లోకి రాకముందు కన్నడంలో పలు టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు దీక్షిత్ శెట్టి.