Kalki 2898 AD Release Trailer: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శుక్రవారం (జూన్ 21) సాయంత్రం 6 గంటలకు రావాల్సిన ఈ ట్రైలర్.. రెండు గంటల 45 నిమిషాలు ఆలస్యంగా 8.45 గంటలకు రిలీజైంది. అయితే ఈ వెయిటింగ్ ను మరచిపోయేలా మొదటి ట్రైలర్ కంటే కూడా ఈ రిలీజ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది.
కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ కూడా వచ్చేసింది. ఫైనల్ వార్ అంటూ మూవీ మేకర్స్ సినిమా రిలీజ్ కు ఆరు రోజుల ముందు ఈ ట్రైలర్ తీసుకొచ్చారు. తొలి ట్రైలర్ లాగే ఈ రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంది. ఈ రిలీజ్ ట్రైలర్ లో ప్రభాస్, అమితాబ్ మధ్య ఫైట్ సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
దీపిక కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడంటాడు అమితాబ్.. ఆ బిడ్డను చంపడానికి ప్రత్యర్థులు చూస్తుంటారు. దానిని అడ్డుకోవడానికి అశ్వత్థామ పాత్రలోని అమితాబ్ ముందు నిలిస్తే.. అతని అడ్డు తప్పించడానికి భైరవ పాత్రలోని ప్రభాస్ ఫైట్ చేస్తాడు. ఈ ఇద్దరి ఫైట్, కళ్లు చెదిరిపోయేలాంటి విజువల్స్, ట్రైలర్ చివర్లో అవతార్ మూవీలోలాగా ఓ పెద్ద రోబోనేసుకొని ఫైట్ కు రావడం హైలైట్స్ గా చెప్పొచ్చు.
కల్కి 2898 ఏడీ మూవీలో దీపిక కడుపులో ఉన్న ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను బయటకు రాకుండా చేయడానికి ఎవరు ప్రయత్నిస్తారు? వాళ్లకు భైరవ ఎందుకు సాయం చేస్తాడు? ఈ యుద్ధంలో చివరికి గెలిచేదెవరు? ఈ ప్రశ్నలకు మూవీలోనే సమాధానం దొరకనుంది. దానికి కూడా మరీ ఎక్కువ సమయం ఏమీ లేదు. జూన్ 27నే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నిజానికి కల్కి 2898 ఏడీ ట్రైలర్ సాయంత్రం 6 గంటలకే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ మేకర్స్ రెండు గంటల పాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని సరిగ్గా ట్రైలర్ రిలీజ్ సమయానికి చెప్పారు. "సారీ డార్లింగ్స్.. ఇది ఫైనల్ వార్ కదా.. కాస్త వేచి చూడాల్సిందే.. ప్లీజ్.. 8 పీఎం షార్ప్.." అని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అభిమానులకు చెప్పింది.
8 పీఎం షార్ప్ అని చెప్పినా.. ఆ సమయానికి కూడా ట్రైలర్ రాలేదు. అరగంట గడిచిపోయినా ఏ సమాచారం ఇవ్వలేదు. మొత్తానికి 8.45 గంటలకు ఈ రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
కల్కి 2898 ఏడీ మూవీ 3 గంటల 56 సెకన్ల నిడివితో చాలా పెద్ద సినిమాగా రానుంది. ఈ మధ్యే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే ఈ మూవీ మూడు గంటల పాటు ఉండటమే మైనస్ అవుతుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు వేర్వేరు ప్రపంచాల చుట్టూ తిరిగే కథే ఈ కల్కి 2898 ఏడీ మూవీ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన విషయం తెలిసిందే.