Kajal Karthika Review: కాజల్ కార్తీక రివ్యూ - ఓటీటీలో రిలీజైన కాజల్, రెజీనా తెలుగు హారర్ మూవీ ఎలా ఉందంటే?
Kajal Karthika Review: కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ కాజల్ కార్తీక ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు కథలతో రూపొందిన ఈ అంథాలజీ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే?
కార్తీక రాసిన బుక్…
ఉమాదేవి కార్తీక (రెజీనా) ప్రేమలో ఓడిపోతుంది. బుక్స్ చదువుతూ లవ్ బ్రేకప్ తాలూకు బాధ నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉంటుంది. ఫ్రెండ్ సలహా మేరకు ఓ పాతకాలం నాటి లైబ్రరీకి వెళుతుంది ఉమాదేవి. అక్కడ ఆమెకు వంద ఏళ్ల క్రితం రాసిన కాటుకబొట్టు అనే బుక్ కనబడుతుంది.
ఆ బుక్ చదవడం మొదలుపెట్టిన ఉమాదేవికి అందులోని పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. ఆ బుక్ రాసిన కార్తీకకు (కాజల్ అగర్వాల్) ఉమాదేవికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ బుక్‌లోని మీరా (రైజా విల్సన్), కాజల్(జననీ అయ్యర్) , సిద్ధార్థ్ అభిమన్యు చనిపోయి ఎలా ఆత్మలుగా మారారు?
భవిష్యత్తును ఊహించే శక్తి ఉన్న కార్తీక ను ఊరి ప్రజలే ఎందుకు చంపేశారు? తన మరణానికి కారణమైన అప్పలనాయుడుపై కార్తీక ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది అన్నదే కాజల్ కార్తీక మూవీ కథ.
హారర్ కామెడీ జోనర్...
హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ కొత్తదేం కాదు. ఈ జోనర్‌లో దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన సినిమాలొచ్చాయి. హారర్, కామెడీ రెండు సమపాళ్లలో ఉండేలా కథను దర్శకుడు రాసుకున్నప్పుడే ఈ జోనర్ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. కామెడీ డోసు తగ్గినా, భయపెట్టడంలో విఫలమైన అసలుకే మోసం వస్తుంది. కాజల్ కార్తీక అందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది.
ఆరు కథలు...
కాజల్ కార్తీకను ఓ అంథాలజీ హారర్ మూవీగా దర్శకుడు డీకే తెరకెక్కించాడు. మొత్తం ఆరు కథలతో ఈ హారర్ మూవీ సాగుతుంది. ఈ కథలన్నీ చాలా వరకు లాక్‌డౌన్ నేపథ్యంలోనే సాగుతాయి. ఈ కథల్లో కొన్నింటిని సీరియస్ హారర్ ఎలిమెంట్స్ తో నడిపించాడు డైరెక్టర్. మరికొన్ని కామెడీ ప్రధానంగా రాసుకున్నాడు.
మీరా ఎపిసోడ్ ట్విస్ట్...
రెజీనా ఎపిసోడ్‌తోనే కాజల్ కార్తీక మూవీ మొదలవుతుంది. ఆమె బుక్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కో కథ స్క్రీన్‌పై వస్తుంటాయి. వీటిలో మీరా, శక్తి ఎపిసోడ్ ఉత్కంఠను పంచుతుంది. అమ్మాయిలను చంపుతూ ఆనందించే సీరియల్ కిల్లర్ శక్తికి మీరా ఇచ్చే షాకింగ్ ట్విస్ట్‌ను డైరెక్టర్ బాగానే రాసుకున్నాడు.
జననీ అయ్యర్ ఎపిసోడ్ అర్థం కావడం కష్టమే. అనుబంధాలు, అప్యాయతలు మర్చిపోయిన ఇద్దరు స్నేహితులకు వాటిని ఏలియన్స్ ఎలా గుర్తుచేశారనే పాయింట్‌తో సీక్రెట్ బార్ కథను ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఆ ఎపిసోడ్ అంతగా కన్వీన్సింగ్‌గా అనిపించదు.
సిద్ధార్థ్ అభిమన్యు కథ...
సిద్ధార్థ్ అభిమన్యు అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వచ్చిన మూవీ డైరెక్టర్ జాకబ్, సింగర్ శృతికి ఎదురయ్యే వింత మనుషులు, అనుభవాల ఎపిసోడ్‌లో కామెడీ మొత్తం తమిళ వాసనలతో సాగుతుంది. ఆ ఫన్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కష్టమే. సిద్ధార్థ్ అభిమన్యు బతికి ఉన్నాడా, చనిపోయాడా అనే ట్విస్ట్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది
ఎమోషన్స్ ప్లస్...
ఈ ఆరు కథల్లో ఒక్క కాజల్ ఎపిసోడ్స్‌లోనే ఎమోషన్స్, యాక్టింగ్ పరంగా మెప్పిస్తుంది. ఆ ఎపిసోడ్‌ను థ్రిల్లింగ్ గా రాసుకున్నాడు డైరెక్టర్. ఊళ్లో చిన్నపిల్లలు తప్పిపోవడం, పెద్దవాళ్లు హత్యలకు గురవ్వడం లాంటి హారర్ అంశాలను చూపిస్తూనే మరోవైపు కార్తీక పాత్రకు జరిగిన అన్యాయాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు. చివరలో ఉమాదేవికి, కార్తీకకు ఉన్న సంబంధించి చూపిస్తూ సర్‌ప్రైజింగ్ మలుపుతో సినిమాను ఎండ్ చేశారు.
కాజల్...రెజీనా...
ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ లేరు. కాజల్, రెజీనాతో పాటు మిగిలిన క్యారెక్టర్స్ అందరూ గెస్టులు అని చెప్పడమే సబబుగా ఉంటుంది. కాజల్ క్యారెక్టర్ నిడివి ఇరవై నిమిషాలలోపే ఉంటుంది.
కార్తీక పాత్రలో ఎమోషనల్ రోల్‌లో మెప్పించింది. రెజీనా క్యారెక్టర్ చిన్నదే అయినా కథకు కీలకంగా ఉంటుంది. రైజా విల్సన్, జనని అయ్యర్, యోగిబాబు, కలైయరాసన్ తమ పరిధుల మేర ఆకట్టుకున్నారు.
ఆంథాలజీ హారర్ మూవీ...
కాజల్ కార్తీక ఓ అంథాలజీ హారర్ మూవీ. పేరులో ఉన్న కొత్తదనం సినిమాలో మాత్రం కనిపించదు. భయపెట్టని, నవ్వించని హారర్ కామెడీ మూవీ ఇది.
టాపిక్