Aha ott new web series: ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా వచ్చేస్తోంది
Aha ott new web series: ఆహా ఓటీటీలో గతేడాది వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ రెండో సీజన్ రాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Aha ott new web series: ఆహా ఓటీటీ తమ హిట్ వెబ్ సిరీస్ అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ రెండో సీజన్ తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. త్వరలోనే ఈ సీరిస్ రాబోతోందని సదరు ఓటీటీ చెప్పింది. తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో కొత్త సీజన్ ను తీసుకురానున్నాయి. ఓ కార్పొరేట్ ఉద్యోగి కష్టాల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఇది.
అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2
అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ ను ఆహా ఓటీటీ మంగళవారం (ఏప్రిల్ 9) ఉగాది సందర్భంగా చేసింది. "ఆఫీస్ కు వెళ్లి ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ ఇష్టపడతారు. సీజన్ 2 లోడింగ్" అనే క్యాప్షన్ తో ఆహా ఈ విషయాన్ని చెప్పింది. ఈ సిరీస్ ను మోస్ట్ లవ్‌డ్ ఆఫీస్ డ్రామాగా ఆ ఓటీటీ అభివర్ణించింది. ఎట్లిచ్చినం అనే హ్యాష్‌ట్యాగ్ తో ఆహా తమ కొత్త సినిమాలు, సిరీస్ లను అనౌన్స్ చేస్తోంది.
గతేడాది జూన్ 30న అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ తొలి సీజన్ ఆహాలోకివచ్చింది. ఈ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఓ చిన్న టౌన్ కుర్రాడు పెద్ద కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలని కలలు కని.. దాని ద్వారానే ఇబ్బంది పడటం తొలి సీజన్లో చూడొచ్చు.
అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ తొలి సీజన్
హిందీలో ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్న అఫీషియల్ చౌక్యాగిరి అనే వెబ్‌సిరీస్ ఆధారంగా అర్ధమైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్. కార్పొరేట్ వరల్డ్‌లో ఓ సామాన్య యువకుడికి ఎదురైన సమస్యలు, వృత్తి నిర్వహణలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణను ఎంటర్‌టైనింగ్‌గా ఈ సిరీస్‌లో చూపించారు. ఈ సింపుల్ పాయింట్‌కు ఓ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీతో చిన్న సందేశాన్ని జోడించి సీజన్ వన్‌ను ఎండ్‌చేశారు.
అరుణ్‌కుమార్‌గా హర్షిత్‌రెడ్డి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచాడు. పల్లవిగా అనన్య శర్మ సింపుల్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఇంకాస్త ఎమోషనల్‌గా ఆమె క్యారెక్టర్‌ను రాసుకుంటే బాగుండేది. షాలినిగా డామినేషన్, స్వార్థం కలబోసిన పాత్రలో తేజస్వి మదివాడ కనిపించింది. మిగిలిన వారిలో కాకా పాత్రలో వాసు ఇంటూరి ఎక్కువగా హైలైట్ అయ్యాడు. హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ చెప్పే అతడి డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి.
ఆహా ఓటీటీ కొత్త షోలు, సినిమాలు ఇవే
ఉగాది రోజు ఆహా ఓటీటీ తమ ప్లాట్‌ఫామ్ లోకి రాబోతున్న కొత్త సినిమాలు, సిరీస్ లను అనౌన్స్ చేసింది. అందులో ఈ అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ రెండో సీజన్ తోపాటు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, డ్యాన్స్ ఐకాన్ 2, లవ్ డైరీస్ అనే ఆహా ఒరిజినల్ మూవీ, ఆఫీస్ స్టోరీస్, రాక్షసి మూవీ, సిన్ 2, హరివిల్లు అపార్ట్‌మెంట్స్, థ్రిల్లర్ మూవీ డ్రైవ్, 3 రోజెస్ సీజన్ 2, బెంచింగ్ మూవీ.. ఇలా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఎన్నో ఆహా ఓటీటీలోకి రానున్నాయి.