Telugu Indian Idol Season 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 వచ్చేస్తోంది.. ఎక్కడ చూడాలంటే?
Telugu Indian Idol Season 3: మోస్ట్ పాపులర్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ తెలుగు మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ఆహా వెల్లడించింది.
Telugu Indian Idol Season 3: ఇండియన్ ఐడల్ షో తెలుసు కదా. హిందీలో సోనీ టీవీ రెండు దశాబ్దాలుగా ఈ సింగింగ్ షోని విజయవంతంగా నడుపుతోంది. అయితే తెలుగులోనూ రెండేళ్ల కిందట ఇండియన్ ఐడల్ మొదలైంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ నంబర్ వన్ సింగింగ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. మూడో సీజన్ కు సిద్ధమైంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విషయాన్ని ఉగాది సందర్బంగా మంగళవారం (ఏప్రిల్ 9) ఆహా ఓటీటీ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది. "ఇండియాలో బిగ్గెస్ట్ సింగింగ్ షో త్వరలోనే కొత్త సీజన్ తో రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని చెప్పింది. ఈ సందర్భంగా ఇండియన్ ఐడల్ సీజన్ 3 పోస్టర్ రిలీజ్ చేస్తూ ఎట్లిచ్చినం అనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేయడం విశేషం.
ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హిందీలో అయితే ఇప్పటికే 14 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మొదట్లోనే 14వ సీజన్ ముగిసింది. ఇక తెలుగులో మాత్రం 2022లోనే ఇండియన్ ఐడల్ ప్రారంభమైంది. రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు మూడో సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన తేదీని మాత్రం వెల్లడించలేదు.
తెలుగు ఇండియన్ ఐడల్
ఆహా ఓటీటీ తొలిసారి 2022లో తెలుగు ఇండియన్ ఐడల్ షోని స్ట్రీమింగ్ చేసింది. ఈ షో ఫైనల్ జూన్ 7, 2022న జరిగింది. దునియాని దున్నేద్దాం అనే క్యాప్షన్ తో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఈ షోకి జడ్జీలుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కార్తీక్ ఉన్నారు. రెండు సీజన్లలోనూ వీళ్లు ఉండగా.. తొలి సీజన్లో నటి నిత్యా మేనన్, రెండో సీజన్లో సింగర్ గీతా మాధురి జడ్జీలుగా ఉన్నారు.
రెండు సీజన్లు కలిపి మొత్తం 31 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. తొలి సీజన్ విజేతగా నెల్లూరుకు చెందిన వాగ్దేవి నిలిచింది. ఇక రెండో సీజన్లో న్యూజెర్సీకి చెందిన శృతి నండూరి గెలవడం విశేషం. జడ్జీలతోపాటు ఈ షోకి బాలకృష్ణ, కోటి, బాబా సెహగల్, ఎస్పీ చరణ్, నాని, చంద్రబోస్, స్మిత, కేఎస్ చిత్ర, దేవి శ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా గెస్టులుగా వచ్చారు.
రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మూడో సీజన్ ను ప్రారంభించడానికి ఆహా ఓటీటీ ప్లాన్ చేస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1లో మొత్తం 12 మంది, రెండో సీజన్లో మొత్తం 13 మంది పార్టిసిపేట్ చేశారు. తొలి సీజన్లో సింగర్ శ్రీరామచంద్ర, రెండో సీజన్లో సింగర్ హేమచంద్ర హోస్టులుగా వ్యవహరించారు.
ఆహా ఓటీటీ షోస్
ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ తోపాటు చాలా షోలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్, ఫ్యామిలీ ధమాకా, నేను సూపర్ వుమన్, డ్యాన్స్ ఐకాన్ లాంటి షోలు కూడా ఉన్నాయి.