OTT Web Series: ఓటీటీలో దూసుకెళుతున్న హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో టాప్
OTT: ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ దుమ్మురేపుతోంది. నేషనల్ వైడ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. వివరాలివే..
OTT Web Series: ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‍లకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. ఈ జానర్‌లో వచ్చిన కొన్ని సిరీస్‍లు చాలా పాపులర్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవలే స్ట్రీమింగ్‍కు వచ్చిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్‍స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్ కూడా అదగొడుతోంది. యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ భారీగా వ్యూస్‍ను దక్కించుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ దూసుకెళుతోంది. ఆ వివరాలివే..
ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ మార్చి 29న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్, మిస్టరీ, హారర్ ఇలా మల్టీ జానర్ సిరీస్‍గా ఇది రూపొందింది. తమిళంతో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ట్రైలర్‌తోనే ఈ సిరీస్‍పై మంచి క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగా సిరీస్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో భారీస్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
నేషనల్ వైడ్ టాప్‍లో..
ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్‍ల్లో టాప్‍లో ఉంది. ఈ సిరీస్ వచ్చి ఆరు రోజులు కాగా.. ఇంకా నంబర్ వన్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. ఫారెస్ట్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన ఈ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సోషల్ మీడియాలోనూ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‍కు నందిని జేఎస్ దర్శకత్వం వహించారు. అడవిలో జరిగే వరుస హత్యలను ఛేదించే ఇన్‍స్పెక్టర్ రిషి పాత్రను నవీన్ చంద్ర పోషించారు. ఈ సిరీస్‍లో సునైనా ఎల్లా, శ్రీకృష్ణ దయాల్, ఎలాంగో కుమారవేల్, కన్నా రవి, మాలినీ జీవరత్నం కీలకపాత్రలు పోషించారు.
ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‍ను సుఖ్‍దేవ్ లహరి నిర్మించగా.. అశ్వత్ సంగీతం అందించారు. ఈ వెబ్ సిరీస్ మంచి నిర్మాణ విలువలతో రూపొందింది. ఈ సిరీస్‍కు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా భార్గవ్ శ్రీధర్ వ్యవహరించారు.
ఇన్‍స్పెక్టర్ రిషి స్టోరీ బ్యాక్‍డ్రాప్
వరుస హత్యల కేసును ఇన్‍స్పెక్టర్ రిషి ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఆసక్తికరమైన కథనం, కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. తమిళనాడులోని అటవీ ప్రాంతంలో ఒకే తీరులో వరుసగా హత్యలు జరుగుతాయి. ఈ హత్య కేసును ఇన్‍స్పెక్టర్ రిషి (నవీన్ చంద్ర).. అయ్యన్నార్ (కన్నా రవి), చిత్ర (మాలిని జీవరత్నం)తో కలిసి దర్యాప్తు చేస్తారు. ఈ హత్యలను అడవి దేవత వనరచ్చి చేస్తోందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే, ఈ హత్యల వెనుక మిస్టరీని ఛేదించేందుకు రిషి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అటవీ శాఖలో పనిచేసే క్యాథీ (సునైనా ఎల్లా), నంబీషన్ (శ్రీకృష్ణ దయాల్) కూడా ఆయనకు సహకరిస్తారు. మరి ఈ హత్య కేసులను రిషి ఛేదించాడా? ఈ హత్యలకు పాల్పడింది ఎవరు? వనరచ్చి నిజంగానే ఉందా? అనే విషయాలు ఇన్‍స్పెక్టర్ రిషి సిరీస్‍లో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.