Ileana Marriage: అదో మిస్టరీ.. తన పెళ్లిపై ఇలియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ileana Marriage: ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన జీరో సైజ్ ఇలియానా తన పార్ట్నర్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకుందా? గతేడాది పెళ్లి కాకుండానే బిడ్డను జన్మనిచ్చిన ఆమె.. తాజాగా తన పెళ్లిపై స్పందించింది.
Ileana Marriage: గోవా బ్యూటీ ఇలియానా డిక్రజ్ ఒకప్పుడు టాలీవుడ్‌ను, తర్వాత బాలీవుడ్‌ను కూడా ఏలింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా.. గతేడాది ఆగస్ట్ 1న పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది. అయితే ఆ తర్వాత అయినా ఆమె తన పార్ట్నర్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకుందా లేదా అన్నది మాత్రం తెలియలేదు.
తల్లి అయిన తర్వాత ఇలియానా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి వార్తలపై స్పందించింది. ఆ విషయాన్ని కాస్త సీక్రెట్ గానే ఉంచాలని అనుకుంటున్నట్లు ఇల్లీ బేబీ చెప్పడం విశేషం. ఇలియానా ప్రస్తుతం మైఖేల్ డోలాన్, తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలాన్ తో కలిసి అమెరికాలో ఉంటోంది.
ఇలియానా పెళ్లి చేసుకుందా?
ఆగస్ట్ లో ఆమె బిడ్డకు జన్మనిచ్చినా.. అంతకుముందు మే నెలలోనే బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. "దీనిపై చాలా పుకార్లు వచ్చాయి. దీనిని వాటికే వదిలేద్దాం. కాస్త మిస్టరీ ఉండటం కూడా బాగుంటుంది కదా. నా జీవితంలోని ఈ భాగం గురించి నేను పెద్దగా మాట్లాడదలచుకోలేదు.
నా రిలేషన్షిప్ గురించి గతంలో చెప్పాను. దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. నా గురించి ఏది మాట్లాడినా నేను పట్టించుకోను. కానీ నా పార్ట్నర్ గురించి లేదా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మాత్రం నాకు బాగా అనిపించదు" అని ఇలియానా స్పష్టం చేసింది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో తల్లి అయిన తర్వాత అందరు ఆడవాళ్లు ఎదుర్కొనే మానసిక, శారీరక సమస్యలపైనా ఇలియానా స్పందించింది. అమ్మతనం అనుభవించిన తర్వాత డిప్రెషన్ నిజమే అని ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ దశలో తన పార్ట్నర్ మైఖేల్ డోలాన్ తనకు ఎంతో అండగా నిలిచాడని, అతడో అద్బుతమైన పార్ట్నర్ అని ఇలియానా అనడం విశేషం.
గతేడాది తన పార్ట్నర్ ను కూడా ఆమె నేరుగా పరిచయం చేయలేదు. అతనికి సంబంధించిన అస్పష్టమైన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను టీజ్ చేసింది.
నిజానికి ఇలియానా గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరూ కత్రినా దంపతులతో కలిసి మాల్దీవ్స్ లో వెకేషన్ కూడా ఎంజాయ్ చేశారు. అంతకుముందు ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తోనూ ఇల్లీ బేబీ చెట్టాపట్టాలేసుకొని తిరిగింది.
2019లో వీళ్లు విడిపోయారు. దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఇలియానా తర్వాత పోకిరి, జల్సా, జులాయి, కిక్, లాంటి హిట్ సినిమాల్లో నటించింది. తర్వాత బాలీవుడ్ లోనూ బర్ఫీ, రుస్తుం, బాద్షాహో, రెయిడ్, ది బిగ్ బుల్ లాంటి సినిమాలు చేసింది. అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ, లవర్స్ అనే హిందీ సినిమాల్లో ఆమె నటించినా.. ఇంకా ఈ మూవీస్ రిలీజ్ కాలేదు.