Ilaiyaraaja concert OTT: ఓటీటీలోకి రానున్న ఇళయరాజా కాన్సెర్ట్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Ilaiyaraaja concert OTT: మాస్ట్రో ఇళయరాజా నిర్వహించిన మ్యూజిక్ కాన్సెర్ట్ ఓటీటీలోకి రానుంది. స్ట్రీమింగ్ తేదీ కూడా ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.
Ilayaraja concert OTT: ఇసై జ్ఞాని, దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లైవ్ కాన్సెర్ట్‌లకు క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంటుంది. ఆయన కాన్సెర్ట్ ఎక్కడ నిర్వహించినా భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతారు. సంగీతం ప్రపంచంలో మునిగితేలుతారు. ఈ ఏడాది జూన్ 8వ తేదీన హైదరాబాద్‍లో ‘సమతా ఇళయ రాగం’ పేరుతో ఓ కాన్సెర్ట్ జరిగింది. ముచ్చింతల్‍లోని సమతామూర్తి క్షేత్రంలో ఈ సంగీతం వేడుక జరిగింది. ఈ కాన్సెర్ట్‌కు వేలాది సంఖ్యలో ప్రేక్షకులు, చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ సమతా ఇళయరాగం కాన్సెర్ట్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
సమతా ఇళయరాగం కాన్సెర్ట్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 7వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు (జూలై 3) వెల్లడించింది. సమతా ఇళయరాగం.. మదిని తాకే ఘనమైన సంగీతం యాగం. సమతా ఇళయరాగం జూలై 7న ఆహాలో ప్రీమియర్ కానుంది” ఆహా ట్వీట్ చేసింది. ప్రోమోను కూడా రిలీజ్ చేసింది.
ప్రోమో ఇలా..
సమతా ఇళయరాగం కాన్సెర్ట్‌లో ఇళయరాజా సారథ్యంలో గాయకులు ఎస్‍పీ చరణ్, శ్వేత మోహన్, మనో, శిరీష సహా మరికొందరు పాటలు ఆలపించారు. ఇళయరాజా స్వరపరచిన ఈ పాటలను లైవ్‍లో విని ప్రేక్షకులు సంగీతం లోకంలోకి వెళ్లారు. సమతా ఇళయరాగం స్ట్రీమింగ్‍కు సంబంధించి ప్రోమోను ఆహా వెల్లడించింది. “మాటే మంత్రము.. మమతే బంధం” పాటను ఇళయరాజా పాడటంతో ఈ ప్రోమో మొదలైంది. స్వయంగా ఆయనే పాడటంతో ప్రేక్షకులు హర్షధ్వానాలతో మోతెక్కించారు. “తప్పులు పాడితే కూడా ఇంత చప్పట్లు కొడుతున్నారంటే.. సరిగా పాడితే ఎలా ఉంటుందో” అని ఇళయరాజా సరదాగా అన్నారు. గాయకులతోనూ సరదాగా మాట్లాడారు.
సమతా ఇళయరాగం కాన్సెర్ట్‌కు చినజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇళయరాజాను చినజీయర్ స్వామి ప్రశంసించారు. ఈ కాన్సెర్ట్‌ను జూలై 7 నుంచి ఆహా ఓటీటీలో చూడొచ్చు.
తెలుగు ఇండియన్ ఐడల్‍కు దేవరకొండ
ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్ ఇటీవలే మొదలైంది. గత రెండు సీజన్లు ఫుల్ సక్సెస్ కాగా.. మూడో సీజన్ భారీ అంచనాలతో షురూ అయింది. ప్రతీ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్లు స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. కాగా, ఈ సింగింగ్ షోకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గెస్టుగా హాజరుకానున్నారు. విజయ్ పాల్గొనే ఎపిసోడ్లు జూలై 5, 6 తేదీల్లో స్ట్రీమింగ్‍కు రానున్నాయి. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍కు థమన్, కార్తిక్, గీతా మాధురి జడ్జిలుగా ఉన్నారు.