Ilayaraja Biopic: ఇళయరాజాగా హీరో ధనుష్.. సంగీత జ్ఞాని బయోపిక్ మూవీ.. షూటింగ్, రిలీజ్ డేట్ ఇదే!
Ilayaraja Biopic: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రతిష్టాత్మక పాత్రలో నటించనున్నారు. సంగీత జ్ఞాని ఇళయరాజాగా త్వరలో భారతీయ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇళయరాజా బయోపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Dhanush In Ilaiyaraaja Biopic: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఇటు దక్షిణాది ప్రేక్షకులనే కాదు, ఉత్తరాది ప్రేక్షకులకు సైతం సుపరిచితులయ్యారు టాలెంటెడ్ యాక్టర్ ధనుష్. ఇటీవల సార్ సినిమాతో మంచి హిట్ కొట్టిన ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే మూవీతో బిజీగా ఉన్నారు. ఇదే కాకుండా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు ఈ వెర్సటైల్ స్టార్. ఆ మూవీ ఏదో కాదు.. మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుంది.
ఇళయరాజ బయోపిక్‌గా మూవీ రానుండటంతో సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులను సంబరపడిపోతున్నారు. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది. దీనికి ఆర్ బల్కీ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక మిగతా నటీనటులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉంటే, రాబోయే మూడు సంవత్సరాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్ చిత్రాలను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమ సంవత్సరానికి 900 కంటే ఎక్కువ సినిమాలను విడుదల చేస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. ఈ నేపథ్యంలో కనెక్ట్ మీడియా నుంచి వరుణ్ మాథుర్ మాట్లాడారు.
"మెర్క్యురి అనేది ప్రపంచ వినోద ప్రదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పేర్లలో ఒకటి. మెగా-బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం భారతీయ వినోద పరిశ్రమ చాలా కీలక పరిణామ దశలో ఉంది. రాబోయే రెండు దశాబ్దాలు ఇది మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక జాతీయ స్టూడియోగా మెర్క్యురీతో మా భాగస్వామ్యం గొప్పగా ఉంటుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులకు నచ్చే సినిమాలను అందించడంలో మా వంతు ప్రయత్నం చేస్తాం" అని వరుణ్ మాథుర్ తెలిపారు.
"ప్రస్తుతం ప్రాంతీయ కథలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ప్రాంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మాకు ఇంటర్నేషనల్ వైడ్‌గా వ్యాపారం చేసిన అనుభవం ఉంది. ఇక ముందు లోకల్, ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తాం. కనెక్ట్ మీడియాతో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. కనెక్ట్ మీడియా మాకు విశ్వసనీయ భాగస్వామి మాత్రమే కాకుండా వినోద పరిశ్రమపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంది. పరిశ్రమలోని ఇతర విభాగాల వారితోనూ వివిధ వాటాదారులతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి" అని మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తిశరణ్ వెల్లడించారు.