Jagapathi Babu: అందుకే గుంటూరు కారంలో నటించడాన్ని ఎంజాయ్ చేయలేదు: జగపతి బాబు కామెంట్స్
Jagapathi Babu on Guntur Kaaram: గుంటూరు కారం సినిమాలో నటించడంపై జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఆ చిత్రం చేయడాన్ని తాను ఎంజాయ్ చేయలేదని వెల్లడించారు. ఎందుకో కూడా వివరించారు.
Jagapathi Babu: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతి బాబు విలన్‍గా నటించారు. డొక్కా మార్క్స్ బాబు అనే నెగెటివ్ క్యారెక్టర్ చేశారు. అయితే, గుంటూరు కారం సినిమాలో నటించడాన్ని తాను ఎంజాయ్ చేయలేదని జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించారు.
మరోలా ఉండాల్సింది..
గుంటూరు కారం సినిమాలో తన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‍గా ఉండాల్సిందని, అయితే ఆ తర్వాత మారిందని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు చెప్పారు. “మహేశ్ బాబుతో కలిసి నటించడాన్ని నేను ఎప్పుడూ ఇష్టపడతా. కానీ నిజం చెప్పాలంటే.. గుంటూరు కారం చిత్రాన్ని నేను ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‍గా ఉండాల్సింది. కానీ కొంతకాలం తర్వాత గందరగోళం అయింది. ముగింపునకు కష్టమైంది. నేను ఏం చేయాలో అంతా చేశా” అని జగపతి బాబు చెప్పారు.
మహేశ్ బాబుతో తన కాంబినేషన్ వేస్ట్ అవ్వాలని తాను అనుకోనని జగపతి బాబు చెప్పారు. తమ కాంబో బెస్ట్‌గా ఉండాలని అనుకుంటానని అన్నారు. మొత్తంగా గుంటూరు కారంలో తన క్యారక్టరైజేషన్‍ను మధ్యలో మార్చడం వల్ల ఎంజాయ్ చేయలేకపోయానని జగపతి చెప్పేశారు.
స్క్రిప్ట్ మారింది
గుంటూరు కారం సినిమాకు ముందుగా రాసుకున్న స్క్రిప్టును దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తిగా మార్చేశారని గతంలోనే సమాచారం వెల్లడైంది. ఈ కారణంగానే తన పాత్రకు ప్రాధాన్యత తగ్గడంతో హీరోయిన్ పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకున్నారని టాక్ బయటికి వచ్చింది. తరచూ స్క్రిప్ట్ మారడం, రీషూట్‍లతో ఈ చిత్రం ఆలస్యం కూడా అయింది. జగపతి బాబు లేటెస్ట్ కామెంట్లను బట్టి చూస్తే.. గుంటూరు కారం స్క్రిప్ట్ మధ్యలో మారిందని మరోసారి కన్ఫార్మ్ అయింది.
గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకోవడంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్‍గా చేశారు మేకర్స్. మీనాక్షి చౌదరిని మరో హీరోయిన్‍గా తీసుకున్నారు. అయితే, ఈ చిత్రంలో మీనాక్షి పాత్రకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ కనిపించలేదు. ఈ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ మొదట్లో చాలా ఇంటెన్స్‌తో ఉండేదని తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత ఆయన సీన్లను కట్ చేసి.. కొన్ని సీన్లకే పరిమితం చేసేశారు.
వరుస సినిమాలతో బిజీగా..
ఒకప్పుడు హీరోగా వెలుగొందిన జగపతి బాబు.. ప్రస్తుతం విలన్‍గా, సపోర్టింగ్ పాత్రల్లో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 చిత్రంలో ఆయన కీలకపాత్ర చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీలో జగపతి బాబుకు మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కిందని తెలుస్తోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ కూడా జగపతి లైనప్‍లో ఉంది. తమిళ సినిమా కంగువ, హిందీ చిత్రం రుస్లాన్ చిత్రాలు కూడా ఆయన చేయనున్నారు. తాజాగా, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో జగపతి బాబు కనిపించారు.