Guntur Kaaram TV Premiere: గుంటూరు కారం టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్.. అధికారికంగా వెల్లడించిన ఛానెల్
Guntur Kaaram TV Premiere: గుంటూరు కారం సినిమా టీవీలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రీమియర్ డేట్‍ను ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. పండుగ రోజున ఈ చిత్రం స్ట్రీమింగ్ అవనుంది.
Guntur Kaaram Television Premiere: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఫుల్ హంగామా మధ్య ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రిలీజ్ అయింది. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మహేశ్ - త్రివిక్రమ్ కాంబో కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోగా.. ఆశించిన స్థాయిలో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అయితే, మహేశ్ స్టార్ డమ్‍తో మంచి వసూళ్లనే రాబట్టింది. గుంటూరు కారం ఇప్పుడు మరో పండుగకు టీవీల్లో ప్రసారం కానుంది.

టీవీలో టెలికాస్ట్ తేదీ
గుంటూరు కారం సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ దక్కించుకుంది. ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ డేట్‍ను ఆ ఛానెల్ తాజాగా ఖరారు చేసింది. తెలుగువారి పండుగ ఉగాదికి గుంటూరు కారం చిత్రాన్ని టెలికాస్ట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా జెమినీ ఛానెల్‍లో ప్రసారం కానుంది.
గుంటూరు కారం చిత్రాన్ని ఉగాది ప్రీమియర్‌గా ఏప్రిల్ 9వ తేదీన టెలికాస్ట్ చేయనున్నట్టు ఓ ప్రోమోను కూడా జెమినీ టీవీ వెల్లడించింది. అయితే, అందులో టైమ్ మాత్రం ఖరారు చేయలేదు. అయితే, ఏప్రిల్ 9 సాయంత్రం ఈ చిత్రం ప్రసారమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. త్వరలోనే టైమ్‍ను కూడా వెల్లడించనుంది. పండుగకు రానుండటంతో గుంటూరు కారం చిత్రానికి భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గుంటూరు కారం ఓటీటీ స్ట్రీమింగ్
గుంటూరు కారం ఫిబ్రవరి 9న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. కొన్ని వారాల పాటు నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో నిలిచింది.
గుంటూరు కారం సినిమాలో రమణ అనే మాస్ క్యారెక్టర్లో మహేశ్ బాబు యాక్షన్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో కథ, కథనాలపరంగా మిక్స్డ్ టాక్ వచ్చినా.. మోస్తరు కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి సాంగ్ సూపర్ పాపులర్ అయింది.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేశ్ బాబు తల్లిపాత్రను సీనియర్ నటి రమ్యకృష్ణ పోషించారు. జయరాం, జగపతి బాబు, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రకాశ్ రాజ్, ఈశ్వరి రావు కీలకపాత్రలు పోషించారు.
గుంటూరు కారం మూవీకి రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయని మూవీ టీమ్ పోస్టర్లు వెల్లడించింది. ఈ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు.
మహేశ్ నెక్ట్స్ మూవీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో గ్లోబల్ రేంజ్ మూవీ (SSMB29) చేయనున్నారు. సుమారు రూ.1,000 కోట్ల బడ్జెట్‍తో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. మరో నెలలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.