Oscar Winners from India ఆస్కార్ అందని ద్రాక్ష! అందుకున్న భారతీయులు వీరే-here the indians who have won the oscar awards till now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Here The Indians Who Have Won The Oscar Awards Till Now

Oscar Winners from India ఆస్కార్ అందని ద్రాక్ష! అందుకున్న భారతీయులు వీరే

Maragani Govardhan HT Telugu
Jan 25, 2023 10:19 AM IST

Oscar Winners from India: ఆస్కార్ అవార్డులంటే ఒకప్పుడు మనవాళ్లు అందని ద్రాక్షగా భావించే వాళ్లు. గెలవడం వరకు పక్కనపెడితే కనీసం నామినేషన్ వరకు కూడా వెళ్లింది చాలా తక్కువ. అలాంటిది కొంత మంది మాత్రం అకాడమీ అవార్డులను సైతం ఒడిసిపట్టుకున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

ఆస్కార్ అవార్డులు
ఆస్కార్ అవార్డులు (AFP)

Oscar Winners from India: ఆస్కార్ 2023 నామినేషన్‌లో మూడు భారత చిత్రాలకు ఈ సారి అవకాశం లభించింది. ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అకాడమీకి పోటీ పడుతుండగా.. ఆల్ దట్ భ్రీథ్స్ అనే డాక్యూమెంటరీ, ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే షార్ట్ ఫిల్మ్ ఈ నామినేషన్‌లో అవకాశం దక్కించుకున్నాయి. 1929లో ఆస్కార్ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ కావడం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో ఆస్కార్ గెలిచిన భారత విజేతల గురించి ఇప్పుడు చూద్దాం.

భాను ఆతియా..

మహారాష్ట్రా కోల్హాపుర్‌లో జన్మించిన భాను ఆతియా.. ఆర్టిస్ట్ కావాలని కలలు కన్నారు. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారి ఎన్నో బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. ఇందులో ప్యాసా(1957), ఆమ్రాపాలి(1966), గైడ్(1965), స్వదేశ్(2004) లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమాతో ఆమె అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్నారు. విలియం అటెన్ బరో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆమెకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ వచ్చింది. భారత్‌కు తొలి అకాడమీ అవార్డు ఇదే కావడం గమనార్హం. 100కిపైగా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన భాను ఆతియా రెండు జాతీయ పురస్కారాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. లెకిన్(1990), లగాన్(2001) సినిమాలకు ఆమెకు ఈ పురస్కారాలు వచ్చాయి.

సత్యజీత్ రే..

భారత చలనచిత్ర రంగ చరిత్రలోనే సత్య జీత్ రే పేరు సువర్ణ అక్షరాలతో లిఖించారు. 1992లో ఆయనకు అకాడమీ అవార్డు లభించింది. చలన చిత్ర కళలో ఆయన అరుదైన నైపుణ్యానికి, ప్రపంచ వ్యాప్తంగా చిత్ర నిర్మాతలు, ప్రేక్షకులుై చెరగని ముద్ర వేసిన ఆయన లోతైన మానవ దృక్పథానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సత్యజీత్ రే భారత అత్యున్న పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును కూడా గెల్చుకున్నారు.

రసూల్ పూకుట్టి..

2008లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఇయాన్ టాప్, రిచర్డ్ ప్రైక్, రసూల్ పూకుట్టికి సంయుక్తంగా ఆస్కార్ అవార్డు లభించింది. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో గ్రాడ్యూయేట్ అయిన రసూల్.. హిందీ, తమిళం, తెలుగులో పలు చిత్రాలకు పనిచేశారు. రావన్(2011), హైవే(2014), కొచ్చాడియన్(2014), పుష్ప(2021) లాంటి పలు చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. 2009లో వచ్చిన కేరలవా వర్మ పళాసిరాజ అనే సినిమాకు జాతీయ అవార్డును కూడా గెల్చుకున్నారు.

ఏఆర్ రెహమాన్..

రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డు గెల్చుకున్న మొదటి భారతీయుడిగా ఏఆర్ రెహమాన్ చరిత్ర సృష్టించారు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డులను గెల్చుకున్నారు. ఇది కాకుండా ఓ సాయా అనే మరో పాటలోనూ నామినేషన్ అందుకున్నారు. మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో అరుదైన అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళం, హిందీ, తెలుగులో చాలా చిత్రాలకు సంగీతాన్ని అందించిన రెహమాన్.. పలు అంతర్జాతీయ సినిమాలకు కూడా స్వరాలను సమకూర్చారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాకు గానూ.. నేషనల్ అవార్డు అందుకున్నారు.

గుల్జార్ ..

ప్రముఖ హిందీ సినిమాల పాటల రచయిత గుల్జార్ కూడా ఆస్కార్ అవార్డును గెల్చుకున్నారు. ఏఆర్ రెహమాన్‌తో సంయుక్తంగా ఆ పురస్కారాన్ని పంచుకున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జై హో పాటను రాసినందుకు గానూ ఆయన అవార్డును దక్కించుకున్నారు.

వీరు కాకుండా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యూమెంటరీకి కూడా ఆస్కార్ అవార్డు లభించింది. 2019లో ఈ డాక్యూమెంటరీని భారత నిర్మాత గునీత్ మోంగా నిర్మించారు. ఇరానియన్-అమెరికన్ డైరెక్టర్ రైకా జేటాబాచీ ఈ డాక్యూమెంటరీకి దర్శకత్వం వహించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం