Hanuman Director Prashanth Varma: రెమ్యునరేషన్లపై బడ్జెట్ వృథా చేయను: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Hanuman Director Prashanth Varma: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీ సీక్వెల్ జై హనుమాన్ బడ్జెట్, యాక్టర్ల రెమ్యునరేషన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఈ సినిమా కోసం బడ్జెట్ పరిమితి లేకపోయినా.. రూ.1000 కోట్ల పెట్టాల్సిన అవసరం లేదని అన్నాడు.
Hanuman Director Prashanth Varma: హనుమాన్ మూవీతో సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జలాంటి ఓ చిన్న హీరోతో, సాధారణ బడ్జెట్ తో పెద్ద హీరోలతో ఫైట్ వద్దంటున్నా వచ్చి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు జై హనుమాన్ అంటూ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడు.
ఈ మూవీ బడ్జెట్ కు తనకు ఎలాంటి పరిమితి లేదని, అలా అని తాను రూ.1000 కోట్లు పెట్టి మూవీ తీయనని ప్రశాంత్ వర్మ అనడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఈ కామెంట్స్ చేశాడు.
రెమ్యునరేషన్లకు బడ్జెట్ దండగ
సిద్ధార్థ్ కన్నన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ యాక్టర్స్ రెమ్యునరేషన్లపై కూడా స్పందించాడు. తన సినిమాటిక్ యూనివర్స్ లో ఇంద్ర దేవుడి నుంచి శక్తులను పొందే హీరోను అధీరగా తీసుకురాబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరో మూవీ కూడా తాను తీయబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతానికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పై పని చేస్తున్నట్లు తెలిపాడు.
ఈ సినిమా కోసం తనకు బడ్జెట్ పరిమితి అసలు లేదని అన్నాడు. "ఇది ఇండియాలోనే అతి పెద్ద సినిమా కావచ్చు. కానీ నేను మాత్రం రెమ్యునరేషన్ల వంటి వాటిపై అనవసరంగా ఖర్చు చేయను. ఇప్పటికే స్క్రిప్ట్, స్టోరీ సిద్ధంగా ఉంది. ఒక్కో షాట్ తీస్తూ వెళ్తాం. బడ్జెట్ ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. అయినా నేను రూ.1000 కోట్లు పెట్టి సినిమా తీయడానికి సిద్ధంగా లేను. అది నా ఉద్దేశం కాదు. ఈ సినిమా, స్టోరీ కోసం ఎంత అవసరమో అంతే పెడతాం" అని ప్రశాంత్ అన్నాడు.
అనవసర షూటింగ్ చేయను
ఇక మరో ఇంటర్వ్యూలోనూ ప్రశాంత్ వర్మ మాట్లాడాడు. తాను ఖర్చు పరంగా చాలా పొదుపుగా ఉంటానని అతడు అన్నాడు. అనవసర షాట్లు షూట్ చేయబోనని చెప్పాడు. హనుమాన్ మూవీని రూ.40 కోట్లతో తీసినట్లు వెల్లడించాడు. ఇంత చిన్నబడ్జెట్ తో అంత పెద్ద హిట్ ఇచ్చిన తనను తన టీమ్ లో అందరూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారని తెలిపాడు.
హనుమాన్ మూవీ 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. "నేను ఏ ప్రొడ్యూసర్ ను కలిసినా ఒకటే చెబుతాను. నేను ఎంత ప్రయత్నించినా బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను కొత్త కొత్త ఐడియాలతో వస్తుంటాను. కానీ నా ఐడియాపై మీకు నమ్మకం ఉంటేనే డబ్బు ఇవ్వండి. ఆ సీన్ తీస్తాను. లేదంటే ఇవ్వొద్దు. అయినా ఆ సీన్ తీస్తాను. కానీ దానిని తీసే సమయంలో, రాసే సమయంలో, ఎడిట్ చేసే సమయంలో, డబ్బింగ్ సమయంలో చాలా మారుస్తాను" అని ప్రశాంత్ వర్మ చెప్పాడు.
అయోధ్యలో జనవరి 22న రామ మందిరంలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ట రోజే జై హనుమాన్ సినిమా గురించి ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైనట్లు అతడు చెప్పాడు.