Prasanth Varma: హనుమాన్‍లో ఆ పాత్రకు కన్నడ హీరోను తీసుకుందామనుకున్నా.. కానీ: ప్రశాంత్ వర్మ-prasanth varma reveals his initial choice for vibhisahan in hanuman was rishab shetty ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prasanth Varma: హనుమాన్‍లో ఆ పాత్రకు కన్నడ హీరోను తీసుకుందామనుకున్నా.. కానీ: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: హనుమాన్‍లో ఆ పాత్రకు కన్నడ హీరోను తీసుకుందామనుకున్నా.. కానీ: ప్రశాంత్ వర్మ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 23, 2024 03:13 PM IST

Prasanth Varma - HanuMan Movie: హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇంకా ప్రమోషన్లను చేస్తోంది మూవీ టీమ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రశాంత్ వర్మ (Photo: X (Twitter))
ప్రశాంత్ వర్మ (Photo: X (Twitter))

Prasanth Varma - HanuMan Movie: హను-మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. సూపర్ హీరోగా మూవీగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూ.. భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కలెక్షన్ల జోరు ఇంకా కొనసాగుతోంది. హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించారు. హను-మాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వూలో కొన్ని విషయాలను పంచుకున్నారు.

హనుమాన్ చిత్రంలో విభీషణుడి పాత్రను ప్రముఖ సీనియర్ నటుడు సముద్రఖని చేశారు. ఆ పాత్రకు మూవీలో చాలా ప్రాధాన్యం ఉంది. అయితే, విభీషణుడి క్యారెక్టర్ కోసం ముందుగా కన్నడ హీరో, కాంతార స్టార్ రిషబ్ శెట్టిని అనుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

“హనుమాన్‍లో విభీషణుడి రోల్ కోసం ముందుగా నేను రిషబ్ శెట్టిని అనుకున్నా. కానీ ఆయన కాంతారా సినిమాలో ఉన్నారు. అయితే, పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లోని ఓ సినిమాలో నటించేందుకు ఆయన ఆసక్తిని చూపారు” అని ప్రశాంత్ వర్మ చెప్పారు.

కాగా, హనుమాన్ సినిమాను చూశాక ఇటీవల రిషబ్ శెట్టి ట్వీట్ కూడా చేశారు. ప్రశాంత్ వర్మ స్టోరీ టెల్లింగ్, ఫిల్మ్స్ మేకింగ్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. తేజ సజ్జా పర్ఫార్మెన్స్ చాలా కాలం అందరికీ గుర్తుండిపోతుందని రాసుకొచ్చారు. హనుమాన్ చిత్రాన్ని ప్రశంసిస్తున్న వారిలో తాను కూడా చేరుతున్నానని సంతోషం వ్యక్తం చేశారు రిషబ్ శెట్టి.

పవన్ కల్యాణ్ లాంటి మాస్ హీరోను తెరపై చూస్తే ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో.. హనుమాన్ మూవీలో ఆంజనేయుడు కనిపించిన ప్రతీసారి అభిమానులు అలాగే కేరింతలు కొట్టారని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు.

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజైన హనుమాన్ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల కలెక్షన్ల మార్కును దాటింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లో ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో 12 మంది సూపర్ హీరోలు ఉంటారని, 20 కథలు ఉన్నాయని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల చెప్పారు. అధీర అనే సూపర్ హీరో చిత్రాన్ని కూడా ఆయన ప్రస్తుతం చేస్తున్నారు. హనుమాన్‍కు సీక్వెల్‍గా ‘జై హనుమాన్’ను కూడా మేకర్స్ ప్రకటించారు. జై హనుమాన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్టు ప్రశాంత్ వర్మ.. ప్రకటించారు.

జై హనుమాన్ మూవీలో హనుమంతుడిగా ఓ స్టార్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నట్టు ఇటీవలే ప్రశాంత్ వర్మ చెప్పారు. ఈ చిత్రంలో తేజ సజ్జా కూడా ఉంటారు. జై హనుమాన్ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

హనుమాన్ మూవీలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‍కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, రాజ్‍దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకం నిర్మించిన ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, గౌర హరి, కష్ణ సౌరభ్ సంగీతం అందించారు.

Whats_app_banner