Aarogyasri Cards : గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలకు పెంపు, త్వరలోనే కొత్త డిజిటల్ కార్డులు-govt to distribute new aarogyasri digital cards soon in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aarogyasri Cards : గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలకు పెంపు, త్వరలోనే కొత్త డిజిటల్ కార్డులు

Aarogyasri Cards : గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలకు పెంపు, త్వరలోనే కొత్త డిజిటల్ కార్డులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 19, 2023 07:18 AM IST

Aarogyasri Cards in Telangana: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇటీవల ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచగా... కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులును అందజేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు... అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులు
కొత్త ఆరోగ్య శ్రీ డిజిటల్ కార్డులు

New Aarogyasri Digital Cards: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీతో పాటు పదోన్నతులపై కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే... ఆరోగ్య శ్రీ పథకానికి సంబంధించి కొత్త కార్డులు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. డిజిటల్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

మంగళవారం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి హరీశ్ రావ్.... పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నంబర్‌ వంటి ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ లోగో, సీఎం కేసీఆర్‌ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్‌ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూఆర్‌ కోడ్‌ను కూడా కార్డ్‌పై ముద్రిస్తారు. వెనకభాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉంటాయి.

నిర్ణయాలివే:

కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం.

లబ్ధిదారుల e KYC ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు.

కొవిడ్ సమయంలో ఎక్కడా చేయని విధంగా రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి రూ. కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం.

మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ తరహా సేవలు త్వరలోనే MGM వరంగల్ లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం.

నియోజకవర్గం పరిధిలోనే ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల ద్వారా కిడ్నీ బాధితులకు మరింత నాణ్యంగా డయాలిసిస్ సేవలు అందించేందుకు గాను ఆన్లైన్ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి.

ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్ వెర్ వినియోగానికి అనుమతి.

బయోమెట్రిక్ విధానం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయం.

Whats_app_banner