Game On Review: గేమ్ ఆన్ రివ్యూ - తెలుగులో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Game On Review: గీతానంద్, నేహాసోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన గేమ్ ఆన్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి దయానంద్ దర్శకత్వం వహించాడు.
Game On Review: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన గేమ్ ఆన్ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి దయానంద్ దర్శకత్వం వహించాడు. మధుబాల, ఆదిత్యమీనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
సిద్ధు గేమ్ ఆడితే?
సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు (గీతానంద్) గేమ్ లూప్ అనే కంపెనీలో పనిచేస్తుంటాడు. కంపెనీ ఇచ్చిన టార్గెట్స్ పూర్తిచేయకపోవడంతో సిద్దు ఉద్యోగం పోతుంది. అదే టైమ్‌లో ప్రాణంగా ప్రేమించిన మోక్ష (వాసంతి)కూడా అతడికి బ్రేక్ చెబుతుంది. సమస్యలను తట్టుకోలేక సిద్ధు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే టైమ్‌లో అతడు అనుకోకుండా ఓ రియల్ గేమ్ ఆడటం మొదలుపెడతాడు.
చిన్న చిన్న టాస్క్‌లకే అతడి లక్షల రూపాయలు వస్తాయి. గేమ్‌లోని చాలా టాస్క్‌లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేయడంతో లూజర్ నుంచి విన్నర్‌గా మారానని ఆనందపడుతుంటాడు సిద్ధు. ఆ గేమ్‌లో భాగంగానే ఓ మనిషిని చంపాలంటూ అతడికి టాస్క్ అసైన్ చేస్తారు. ఆ టాస్క్‌కు సిద్ధు ఒప్పుకున్నాడా? ఈ గేమ్‌ను అతడితో ఆడిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు?
సిద్ధు చంపాల్సింది ఎవరిని? మోక్ష దూరమైన తర్వాత సిద్ధు జీవితంలోకి వచ్చిన తార (నేహా సోలంకి) ఎలా వచ్చింది? అర్చన (మధుబాల), సూర్యనారాయణలతో(శుభలేఖ సుధాకర్) సిద్ధుకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ డేంజరస్ గేమ్ నుంచి సిద్ధు బయటపడేందుకు సైకాలజిస్ట్ మదన్ (ఆదిత్యమీనన్) ఎలా హెల్ప్ చేశాడు? అన్నదే గేమ్ మూవీ కథ.
సైకలాజికల్ థ్రిల్లర్...
గేమింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. అనుకోకుండా రియల్ గేమ్‌లోకి ఓ యువకుడు ఎలా ఎంటర్ అయ్యాడు? ఈ గేమ్‌లోకి టాస్క్‌ల కారణంగా అతడి జీవతం లో ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు చోటుచేసుకున్నాయనే పాయింట్‌తో గ్రిప్పింగ్‌గా గేమ్ ఆన్ క థను రాసుకున్నాడు డైరెక్టర్ దయానంద్. థ్రిల్లర్ కథకు రొమాన్స్, లవ్‌స్టోరీ జోడించి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు.
గేమ్ మాదిరిగానే..
ఏ గేమ్ అయినా ఆరంభంలో సింపుల్‌గానే ఉంటుంది. గెలుపు దగ్గరకు చేరుకునేసరికి ఛాలెజింగ్‌గా మారిపోతుంది. సినిమాలో అదే జరిగింది. దర్శకుడు ఎంచుకున్న గేమింగ్ బ్యాక్‌డ్రాప్ బాగుంది. యూత్ ఆడియెన్స్‌ను థియేటర్లలో కూర్చోబెట్టడానికి ఓ రొమాంటిక్ లవ్ ట్రాక్, హీరోను నెగెటివ్ షేడ్స్‌లో కనిపించే లవ్ ట్రాక్...కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని మీటర్స్ సినిమాకు కుదిరాయి. ఎండ్‌కు వచ్చే సరికి ఏదో లోటు కనిపిస్తుంది.
సీరియస్ సీన్‌తో...
సీరియస్ సీన్‌తోనే గేమ్ ఆన్ కథ మొదలవుతుంది. హీరో కష్టాలను చూపిస్తూ పరిచయ ఘట్టాలు సాగుతాయి. ఉద్యోగం పోవడం, ప్రియురాలు దూరమవ్వడం లాంటి సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. ఎప్పుడైతే హీరో గేమ్ ఆడటం మొదలుపెడతాడో అక్కడి నుంచే కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఒక్కో పాత్ర అతడి జీవితంలోకి రావడం, డిఫరెంట్ టాస్క్‌లను పూర్తిచేసే సీన్స్‌తో ముందు ముందు ఏదో జరుగబోతుందనే క్యూరియాసిటీని కొంత వరకు ఆడియెన్స్‌లో కలిగించారు డైరెక్టర్.. సెకండాఫ్‌లో హీరోలోని మరో కోణాన్ని చూపిస్తూ వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగుతుంది. లూజర్ నుంచి విన్నర్‌గా హీరో ఎలా మారాడన్నది రెగ్యులర్ క్లైమాక్స్‌తో ఎండ్ చేశాడు.
లాజిక్స్ దూరం...
గేమింగ్, టాస్క్‌లు విషయంలో లాజిక్‌లను దర్శకుడు పట్టించుకోలేదు. కొన్ని టాస్క్‌లు సిల్లీగా అనిపిస్తాయి. గేమ్ ఆన్ కాన్సెప్ట్ బాగున్నా స్క్రీన్‌ప్లే మాత్రం ఫ్లాట్‌గా సాగుతుంది. దర్శకుడు రాసుకున్న చాలా మలుపులు ఈజీగా గెస్ చేసేలానే ఉన్నాయి. హీరోయిన్ ట్రాక్ చాలా వరకు కథలో ఇరికిపించినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్ నెమ్మదిగా సాగడం కూడా బోర్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
స్క్రీన్ ప్రజెన్స్...
హీరోగా గీతానంద్‌కు ఇదే మొదటి సినిమా. అతడి స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. నేహా సోలంకి యాక్టింగ్ కంటే గ్లామర్‌తోనే ఎక్కువగా ఇంప్రెస్ చేస్తుంది. గీతానంద్, నేహా సోలంకి రొమాంటిక్ ట్రాక్ మెప్పిస్తుంది. మధుబాల, శుభలేఖ సుధాకర్, ఆదిత్యమీనన్ వంటి అనుభవజ్ఞులు ఈ సినిమాకు యాక్టింగ్ పరంగా బలంగా నిలిచారు. తల్లిగా మధుబాల పాత్రను డిఫరెంట్‌గా రాసుకున్నాడు డైరెక్టర్.
ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా...
గేమ్ ఆన్ టైటిల్‌కు తగ్గట్లుగానే కొత్త బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ. ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఎంటర్‌టైన్‌చేస్తుంది.
రేటింగ్: 2.5/5