Gaami OTT Release: ఓటీటీలోకి రాబోతోన్న విశ్వక్‌సేన్ గామి - ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందంటే?
Gaami OTT Release: థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన విశ్వక్‌సేన్ గామి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 5 నుంచి జీ5 ఓటీటీలో ఈ అడ్వెంచరస్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Gaami OTT Release: విశ్వక్‌సేన్ గామి థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీలోకి రాబోతోంది. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గామి మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 ఓటీటీ దక్కించుకున్నది. ఏప్రిల్ 5న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
క్రౌడ్ ఫండింగ్ విధానంలో...
గామి సినిమాతో విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ దాదాపు ఐదారేళ్ల పాటు సాగింది. గామి మూవీని వీ సెల్యూలాయిడ్ సంస్థ రిలీజ్ చేసింది. గామి సినిమాలో చాందిని చౌదరి, అభియన కీలక పాత్రలు పోషించారు.
గామి కథ ఇదే..
మూడు కథలతో పారాలాల్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో దర్శకుడు విధ్యాదర్ గామి సినిమాను తెరకెక్కించాడు. శంకర్ (విశ్వక్‌సేన్) ఓ అఘోరా. ఓ సమస్య కారణంగా శంకర్ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ ప్రాబ్లెమ్ నుంచి గట్టెక్కడానికి త్రివేణి పర్వతంపై 36 ఏళ్లకు ఒక్కసారి పూసే మాలిపత్రి అనే ఔషద మొక్క శంకర్‌కు అవసరం పడుతుంది. ఆ మొక్క కోసం హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు శంకర్.
దుర్గ (అభినయ) తన కూతురు ఉమాను(హారిక) దేవదాసి వృత్తిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. కానీ ఉమా దేవదాసి వృత్తికి పనికిరాదని తేలుతుంది. ఇండియా, చైనా బోర్డర్‌లోని ఓ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో ఓ యువకుడు (సీ333) బందీగా ఉంటాడు.
ప్రయోగాల పేరుతో అతడిని చిత్రహింసలకు గురిచేస్తుంటారు.ఆ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి తప్పించుకునేందుకు అతడు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు? శంకర్, ఉమాతో పాటు రీసెర్చ్ సెంటర్‌లో బందీగా మారిన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి? హిమాలయాలకు చేరుకునే క్రమంలో శంకర్ ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు? శంకర్ వెంట హిమాలయాలకు బయటుదేరిన జాహ్నవి (చాందని చౌదరి) ఎవరు? అన్నదే గామి మూవీ కథ.
అఘోరాగా...
ఈ సినిమాలో అఘోర పాత్రలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించాడు. చిన్న సినిమా అయినా విజువల్స్, గ్రాఫిక్స్ బాగున్నాయంటూ ప్రశంసలు వచ్చాయి.
ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కిన గామి కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. దాదాపు 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 22 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. గామి సినిమాకు నరేష్ కుమారన్ బీజీఎమ్ అందించగా స్వీకర్ అగస్తి పాటలు సమకూర్చాడు.
నాలుగు సినిమాలతో బిజీ...
గామితో సక్సెస్ అందుకున్న విశ్వక్‌సేన్ ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. విశ్వక్‌సేన్, డైరెక్టర్ కృష్ణచైతన్య కాంబోలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 17న రిలీజ్ కాబోతోంది. . గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. నేహాశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్నది. రవితేజ ముళ్లపూడి అనే కొత్త దర్శకుడిగా విశ్వక్‌సేన్ ఓ మూవీ చేయబోతున్నాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.