Gaami Review: గామి రివ్యూ - విశ్వక్‌సేన్ ప్రయోగం ఎలా ఉందంటే?
Gaami Review: విశ్వక్‌సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన గామి మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించాడు.
Gaami Review: కెరీర్‌లో ఇప్పటివరకు లవ్ , యూత్‌ఫుల్ కథాంశాలతోనే సినిమాలు చేశాడు విశ్వక్‌సేన్(Vishwak Sen). తన పంథాకు భిన్నంగా ఫస్ట్‌టైమ్ ప్రయోగాత్మక కథాంశాన్ని ఎంచుకొని ఆయన చేసిన తాజా చిత్రం గామి. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. చాందిని చౌదరి, అభినయ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్స్, టీజర్స్‌తో ఈ చిన్న సినిమా సినీ వర్గాలతో పాటు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నది. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
మూడు కథలు...
శంకర్ (విశ్వక్‌సేన్) ఓ అఘోరా. ఓ అరుదైన సమస్యతో బాధపడుతోంటాడు. శంకర్‌ను ఎవరైనా తాకిన వెంటనే అతడి శరీరంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. శంకర్‌తో పాటుఅతడిని తాకిన వారికి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంటుంది. త్రివేణి పర్వతంపై 36 ఏళ్లకు ఒక్కసారి పూసే మాలిపత్రి అనే ఔషద మొక్క మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అని శంకర్ తెలుసుకుంటాడు. ఈ మొక్క కోసం హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు.
దుర్గ (అభినయ) ఓ దేవదాసి. తన కూతురు ఉమాను(హారిక) కూడా దేవదాసి వృత్తిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. కానీ ఉమా దేవదాసి వృత్తికి సెట్ కాదని తేలుతుంది. ఇండియా, చైనా బోర్డర్‌లోని ఓ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో ఓ యువకుడు (సీ333) బందీగా ఉంటాడు. ప్రయోగాల పేరుతో అతడిని చిత్రహింసలకు గురిచేస్తుంటారు.
ఆ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి తప్పించుకునేందుకు అతడు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు? శంకర్, ఉమాతో పాటు రీసెర్చ్ సెంటర్‌లో బందీగా మారిన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి? హిమాలయాలకు చేరుకునే క్రమంలో శంకర్ ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు? శంకర్ వెంట హిమాలయాలకు బయటుదేరిన జాహ్నవి ఎవరు? అన్నదే గామి మూవీ(Gaami Review) కథ.
గామి ఓ ప్రయోగం...
టాలీవుడ్ కమర్షియల్ సినిమాల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయోగాత్మక సినిమాలకు తెలుగు నాట ఆదరణ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ ట్రెండ్‌లో సినిమాలు చేయడం రిస్క్‌గా భావిస్తుంటారు హీరోలు, దర్శకుడు. అడపాదడపా కొందరు హీరోలు మాత్రమే సేఫ్ గేమ్ లైన్‌ను దాటి రిస్క్‌లకు సిద్ధపడుతుంటారు. గామితో(Gaami Review) విశ్వక్‌సేన్ అలాంటి ప్రయత్నమే చేశారు.
అడ్వెంచరస్ థ్రిల్లర్...
అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు విద్యాధర్ గామి సినిమాను తెరకెక్కించాడు. మూడు కథలను కలుపుతూ సాగే గమ్మత్తైన సినిమా ఇది. స్క్రీన్‌ప్లే, విజువల్స్, వీఎఫ్ఎక్స్‌తో మ్యాజిక్ చేయాలని అనుకున్నాడు డైరెక్టర్. మూడు కథలను కలుపుతూ వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.
శంకర్, దుర్గ, మెడికల్ సెంటర్‌లోచిక్కుకున్న కుర్రాడు ముగ్గురు జీవితాల్ని ప్యారాలల్‌గా చూపిస్తూ చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా సినిమా(Gaami Review) సాగుతుంది. సమస్యల వలయంలో చిక్కుకొని వారు పడే సంఘర్షణ నుంచి చక్కటి ఎమోషన్స్ రాబట్టుకున్నాడు డైరెక్టర్. హిమలాయాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్, సింహంతో యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అనిపిస్తాయి.
కాన్సెప్ట్ బాగుంది కానీ...
కాన్సెప్ట్ బాగున్నా దానిని అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు తడబడినట్లు అనిపిస్తుంది. మూడు కథలకు ఉన్న సంబంధాన్ని కన్వీన్సింగ్‌గా చెప్పలేకపోయారు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీని తీసుకొని తనకు కన్వీనెంట్‌గా కథను రాసుకున్నాడు. హిమాలయాల్లో హీరో సాగించే జర్నీ బోర్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.
అఘోరా పాత్రలో...
శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్‌సేన్ జీవించాడు. పాత్ర కోసం అతడు పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అతడి లుక్, బాడీలాంగ్వేజ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అభినయ, అబ్దుల్ సమద్‌ల నటన బాగుంది. చాందిని చౌదరి పాత్ర కథకు సంబంధం లేనట్లుగా అనిపిస్తుంది. యాక్టింగ్‌లో మాత్రం విశ్వక్‌సేన్‌తో పోటీపడింది.
టెక్నికల్‌గా విశ్వనాథ్ కెమెరా, స్వీకర్తి అగస్తి, నరేష్ కుమరన్ మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. పెద్ద సినిమాకు ధీటుగా టెక్నికల్‌గా బ్రిలియెంట్‌గా మూవీ ఉంది.
సరికొత్త ప్రయోగం...
గామి ఓ భిన్నమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ప్రయోగాత్మక సినిమాలు తెలుగులో రావడం లేదనే లోటును గామి కొంత వరకు తీర్చింది.