Fight Club Movie Review: ఫైట్ క్లబ్ రివ్యూ - ప్రొడ్యూసర్‌గా లోకేష్ కనగరాజ్ తొలి సినిమా ఎలా ఉందంటే?
Fight Club Movie Review: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్... ఫైట్ క్లబ్‌మూవీతో ప్రొడ్యూసర్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ కుమార్ హీరోగా అబ్బాస్ ఏ రహమాత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Fight Club Movie Review: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రొడ్యూసర్‌గా మారి తొలి ప్రయత్నంగా నిర్మించిన ఫైట్ క్లబ్ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. విజయ్‌కుమార్, మోనీషామోహన్ జంటగా నటించిన ఈ సినిమాకు అబ్బాస్ ఏ రహమత్ దర్శకత్వం వహించాడు.
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? దర్శకుడిగా కోలీవుడ్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన లోకేష్ కనగరాజ్ ప్రొడ్యూసర్‌గా తొలి సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…
నార్త్ చెన్నై కథ...
నార్త్ చెన్నై ప్రాంతంలో చాలా మంది చిన్నారులు చదువుకుదూరమై డ్రగ్ పెడ్లర్స్‌గా మారుతుంటారు. వారందరికి స్పోర్ట్స్‌లో ట్రైనింగ్ ఇచ్చి మంచి మార్గంలో నడిపించేందుకు బెంజిమెన్ అలియా బెంజి (కార్తికేయన్ సంతానం)ప్రయత్నిస్తుంటాడు. బెంజి అండదండలతో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేరుతెచ్చుకోవాలని సెల్వ (విజయ్ కుమార్) కలలు కంటాడు. బెంజిని అతడి సోదరుడు జోసెఫ్ (అవినాష్ రఘుదేవన్) చేత కిర్బా (శంకర్ థాస్) అనే రౌడీ చంపిస్తాడు. ఈ మర్డర్ కేసులో జోసెఫ్ జైలుకు వెళతాడు.
బెంజి మరణంతో సెల్వ ఫుట్‌బాల్ కలకు పుల్‌స్టాప్ పడుతుంది. చదువు పూర్తిచేసుకున్న సెల్వ ఎలాంటి బరువుబాధ్యతలు లేకుండా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. జైలు నుంచి జోసెఫ్ విడుదలయ్యే టైమ్‌కు కిర్బా పొలిటీషియన్‌గా మారుతాడు.
డ్రగ్స్, రియల్ఎస్టేట్ దందాతో బాగా డబ్బు సంపాదించి కౌన్సిలర్ ఎన్నికల్లో గెలుస్తాడు. తనను కిర్బా మోసం చేశాడని పగతో రలిగిపోతాడు జోసెఫ్...సెల్వ ద్వారా కిర్బాపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. కిర్బా బావమరదిది కార్తితో సెల్వ ఉన్న గొడవలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ కిర్బాను దెబ్బకొట్టాలని చూస్తాడు.
జోసెఫ్ ప్లాన్ ఫలించిందా? జోసెఫ్ మాయలో పడిన సెల్వ కిర్బాతో పాటు అతడి బావమరిది కార్తి ఎదురించి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? జోసెఫ్ మోసాన్ని సెల్వ తెలుసుకున్నాడా? బెంజిని జోసెఫ్, కిర్బాలలో ఎవరు హత్యచేశారు? సెల్వ తమ్ముడి చావుకు కారకులు ఎవరు? కిర్బా, జోసెఫ్‌లను చంపేసి నార్త్ చెన్నైలో డ్రగ్స్, మత్తు పదార్థాల మూలాలు లేకుండా చేయాలని అనుకున్న సెల్వ ప్రయత్నం నెరవేరిందా? లేదా? అన్నదే ఫైట్ క్లబ్ మూవీ(Fight Club Movie Review) కథ.
నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే...
ఫైట్ క్లబ్ సాదాసీదా రివేంజ్ డ్రామా మూవీ. నార్త్ చెన్నై నేటివిటీతో రియలిస్టిక్‌గా సినిమాను తెరకెక్కించి ఫ్రెష్‌నెస్ ఫీలింగ్‌ను కలిగించాడు డైరెక్టర్ అబ్బాస్ ఏ రహమత్. సినిమా మొత్తం నాన్‌లీనియర్ స్క్రీన్‌ప్లేలో సాగుతుంది.
కాలేజీలో ఉన్న హీరోతో పాటు అతడి ఫ్రెండ్స్‌పై ఎటాక్ చేసేందుకు విలన్ గ్యాంగ్ ప్రయత్నించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడే ఆ సీన్‌ను అక్కడే కట్ చేసి చివరలో దానికి ముందు, వెనుక ఏం జరిగింది అన్నది చూపిస్తాడు. చాలా చోట్ల సినిమాలో అలాంటి టెక్నిక్ వాడాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో వదిలివేసిన చాలా ప్రశ్నలకు సెకండాఫ్‌లో ఆన్సర్ ఇస్తూ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశాడు.
హీరోలోని ఆవేశం, ధైర్యాన్ని వాడుకుంటూ తన ప్రత్యర్థిపై పగ తీర్చుకోవాలని భావించే ఓ విలన్ కథతో సినిమా సాగుతుంది. స్టూడెంట్స్ గ్యాంగ్ వార్స్ తో పాటు ఓ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాను అల్లుకుంటూ కథను రాసుకున్నారు.
క్లైమాక్స్ హైలైట్...
క్లైమాక్స్ ఫైట్ దర్శకుడి ప్రతిభకు అద్ధం పడుతుంది. వేర్వేరు చోట్ల ఉన్న విలన్స్‌తో హీరో ఫైట్ చేసే సీన్‌ను ఇంప్రెసివ్‌గా డైరెక్టర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. సౌండ్ డిజైనింగ్ చాలా కొత్తగా ఉంది. క్యారెక్టర్ ఎంపిక కూడా బాగుంది. ప్రతి పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డాడు.
లవ్‌స్టోరీ రొటీన్...
అసలు కథలోకి వెళ్లడానికి డైరెక్టర్ చాలా టైమ్ తీసుకున్నాడు. ఆరంభంలో వచ్చే బెంజిమెన్, జోసెఫ్, కిర్బా ట్రాక్ నత్తనడకన సాగుతుంది. సెల్వ ఎంట్రీతోనే కథ చకచక పరుగులు పెడుతుంది. విజయ్ కుమార్, మోనిసా మోహన్ లవ్ స్టోరీ కథకు అసలు అతకలేదు. విలన్‌తో గొడవకు కారణం అని చూపించడానికే ఆ లవ్ స్టోరీని వాడుకున్నాడు. పదిహేను నిమిషాల ఆ ఎపిసోడ్ తర్వాత మళ్లీ సినిమాలో హీరోయిన్ ఎక్కడ కనిపించదు.
కల్ట్ క్లాసిక్స్ రిఫరెన్స్
మణిరత్నం నాయకుడు నుంచి పా రంజిత్ కాలా, కబాలి, లోకేష్ కనకరాజ్ తమిళంలో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాల్ని రిఫరెన్స్‌గా తీసుకుంటూ ఫైట్ క్లబ్ సినిమాను తెరకెక్కించాడు అబ్బాజ్ ఏ రహమత్. టేకింగ్, మేకింగ్‌లో చాలా చోట్ల ఆ పాత సినిమాల్ని ఫాలో అయ్యాడు డైరెక్టర్.
సెల్వ పాత్రలో...
సెల్వ పాత్రను పూర్తిగా విజయ్ కుమార్ ఓన్ చేసుకొని నటించాడు. ఈ క్యారెక్టర్‌లో అతడి బాడీలాంగ్వేజ్, ఆటిట్యూడ్ బాగుంది. సెటిల్డ్‌గా చూపిస్తూనే క్యారెక్టర్‌ను నుంచి హీరోయిజాన్ని డైరెక్టర్ బాగా రాబట్టుకున్నాడు. జోసెఫ్, కిర్బా మధ్య వైరాన్ని కన్వీన్సింగ్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్. కిర్బా కంటికి కనిపించకుండా సెల్వ సహాయంతో అతడి ఎదుగుదలకు జోసెఫ్ అడ్డుతగిలే రివేంజ్ డ్రామా థ్రిల్లింగ్‌ను పంచుతుంది. హీరోయిన్ ఓ పాట, ఒకటి, రెండు సీన్స్‌కు మాత్రమే పరిమితమైంది.
Fight Club Movie Review -మేకింగ్ వైజ్...
ఫైట్ క్లబ్ కథ రొటీన్ అయినా టేకింగ్, మేకింగ్ వైజ్ కొత్తగా అనిపిస్తుంది. విజయ్ కుమార్ యాక్టింగ్ కూడా మెప్పిస్తుంది.
టాపిక్