Double iSmart Climax: డబుల్ ఇస్మార్ట్ క్లైమ్యాక్స్.. 12 రోజులు.. వందల మంది ఫైటర్లు.. భారీ బడ్జెట్-double ismart climax huge budget for ram pothineni puri jagannadh movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Double Ismart Climax: డబుల్ ఇస్మార్ట్ క్లైమ్యాక్స్.. 12 రోజులు.. వందల మంది ఫైటర్లు.. భారీ బడ్జెట్

Double iSmart Climax: డబుల్ ఇస్మార్ట్ క్లైమ్యాక్స్.. 12 రోజులు.. వందల మంది ఫైటర్లు.. భారీ బడ్జెట్

Hari Prasad S HT Telugu
Jan 24, 2024 07:32 PM IST

Double iSmart Climax: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ క్లైమ్యాక్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. దీనికోసం భారీ బడ్జెట్ తోపాటు వందల మంది ఫైటర్లతో షూట్ చేయడం విశేషం.

డబుల్ ఇస్మార్ట్ మూవీలో రామ్ పోతినేని
డబుల్ ఇస్మార్ట్ మూవీలో రామ్ పోతినేని

Double iSmart Climax: ఐదేళ్ల కిందట ఇస్మార్ట్ శంకర్ అంటూ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఇప్పుడా మూవీకి సీక్వెల్ తో వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ పేరుతో డబుల్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి సిద్ధమైంది.

తాజాగా ఈ మూవీ క్లైమ్యాక్స్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తోంది. ఈ ఒక్క క్లైమ్యాక్స్ కోసమే భారీ బడ్జెట్ కేటాయించడంతో పాటు ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ పూర్తి చేశారు.

డబుల్ ఇస్మార్ట్.. డబుల్ వినోదం

ఇస్మార్ట్ శంకర్ మూవీ 2019లో రిలీజైంది. పూరి జగన్నాథ్ మార్క్ సినిమాతో రామ్ పోతినేని కెరీర్లో పెద్ద హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతనికి పెద్దగా సక్సెస్ దొరకలేదు. రెడ్, వారియర్, స్కంధ లాంటి సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. అటు పూరి కూడా లైగర్ మూవీతో చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా భారీ నష్టాలను మిగల్చడంతోపాటు అతని ఇమేజ్ ను కూడా దెబ్బ తీసింది.

ఈ నేపథ్యంలో ఆ హిట్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తుందన్న ఆశతో రామ్, పూరి ఉన్నారు. ఈ డబుల్ ఇస్మార్ట్ కోసం తాజాగా ముంబైలో వేసిన ఓ భారీ సెట్లో క్లైమ్యాక్స్ షూటింగ్ పూర్తి చేశారు. రూ.7.5 కోట్లతో నిర్మించిన ఈ సెట్ లోనే క్లైమ్యాక్స్ షూటింగ్ జరగడం విశేషం. 12 రోజుల పాటు వందల మంది ఫైటర్లతో ఈ క్లైమ్యాక్స్ షూటింగ్ జరిపారు. ఇందులో మూవీలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు.

పూరి జగన్నాథ్ కెరీర్లోనే ఇంత భారీ బడ్జెట్ తో ఓ క్లైమ్యాక్స్ సీన్ తీయడం ఇదే తొలిసారి. రామ్ పోతినేనిని ఓ రగ్గ్‌డ్ లుక్ లో ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో చూపించబోతున్నాడు పూర్తి జగన్నాథ్. ఇప్పటికే లైగర్ మూవీతో చేతులు కాల్చుకున్నా.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కు కూడా ఇలా భారీ స్థాయిలో క్లైమ్యాక్స్ ప్లాన్ చేసి పూరి జగన్నాథ్ పెద్ద రిస్కే చేస్తున్నాడు.

ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు గతేడాదే మేకర్స్ వెల్లడించారు. అప్పుడే 100 రోజుల కౌంట్ డౌన్ కూడా ప్రారంభించారు. ఆ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో రామ్ పోతినేని చాలా ఇంటెన్స్ లుక్ లో, చేతుల్లో ఆయుధాలతో కనిపించాడు.

బుధవారం (జనవరి 25) ఈ మూవీతోపాటు రామ్ పోతినేని కూడా సోషల్ మీడియా ఎక్స్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నట్లు అధికారిక అకౌంట్ పూరి కనెక్ట్స్ వెల్లడించింది. ఈ క్లైమ్యాక్స్ షూటింగ్ విషయం బయటకు రావడంతో ఫ్యాన్స్ దీని గురించే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్‌తో సహా పలు చిత్రాలలో పూరీ జగన్నాధ్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ 'డబుల్ ఇస్మార్ట్‌'కు సంగీతం అందిస్తున్నారు. రామ్, పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ రూపొందుతోంది.