Kalki 2898 AD Release: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ గురించి స్పందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్
Kalki 2898 AD Release: ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం విడుదల గురించి తాజాగా స్పందించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీంతో రిలీజ్ ఆలస్యం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Kalki 2898 AD Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్లోబల్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’పై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‍లో అడుగుపెట్టిన తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. గత నెల జరిగిన ఆ ఈవెంట్‍లోనే ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్ అందరినీ మెప్పించింది. గ్రాఫిక్స్, టేకింగ్ హాలీవుడ్‍లో రేంజ్‍లో ఉన్నాయి. గ్లింప్స్ తర్వాత ఇండియాతో పాటు హాలీవుడ్ సైతం ఈ చిత్రం గురించి ఎదురుచూస్తోంది. భారతీయ పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని 2024 జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, గ్లింప్స్ రిలీజ్ సమయంలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఓ ఇంగ్లిష్ చానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు. ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ ఇంకా కొంచెం మిగిలే ఉందని తెలిపాడు. ఆ షూటింగ్ పూర్తి చేస్తామని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఆ విషయంపై ఉందని తెలిపాడు. షూటింగ్ పూర్తయ్యేకే విడుదల తేదీని ఖరారు చేసే విషయంపై ఆలోచిస్తామనేలా నాగ్ అశ్విన్ కామెంట్స్ చేశాడు.
‘కల్కి 2898 ఏడీ’ మిగిలిన షూటింగ్ హైదరాబాద్‍లోనే జరగనుందని తెలుస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక పోస్టు ప్రొడక్షన్ పనులకు ఎంత సమయం పడుతుందో లెక్కలు వేసుకొని రిలీజ్ డేట్‍ను చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించినట్టు వచ్చే ఏడాది జనవరిలో రావడం మాత్రం కష్టంగా కనిపిస్తోంది. వచ్చే సంత్సరం ఏప్రిల్, జూన్ మధ్య ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతుందని అంచనాలు ఉన్నాయి.
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పఠానీ, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‍తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు అశ్వినీదత్. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.