Dhanush Sir Release Date: సార్ సినిమా రిలీజ్ డేట్ చెప్పేశారు- బాలకృష్ణతో పోటీకి సిద్ధమైన ధనుష్
Dhanush Sir Release Date: ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సార్ సినిమా రిలీజ్ డేట్‌ను సోమవారం వెల్లడించారు. ఈసినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే...
Dhanush Sir Release Date: ఇటీవల విడుదలైన తిరు సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు తమిళ అగ్ర హీరో ధనుష్. స్నేహం,ప్రేమ అంశాలతో రూపొందిన ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న ధనుష్ ఈ ఏడాది చివరలో ద్విబాషా సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతడు హీరోగా నటిస్తున్న సార్ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు సోమవారం ప్రకటించారు.
సార్ సినిమాలో విద్యావ్యవస్థలోని లోపాలపై పోరాటం చేసే బాల గంగాధర్ తిలక్ అనే లెక్చరర్ గా ధనుష్ కనిపించబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సంయుక్తమీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య ఈసినిమాను నిర్మిస్తోంది.
తెలుగులో సార్ అనే పేరుతో తమిళంలో వాతి అనే టైటిల్‌తో ఈసినిమా రిలీజ్ కానుంది. కాగా డిసెంబర్ 2న బాలకృష్ణ 107 సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫైనల్ చేసినట్లుగా సమాచారం. అదే నిజమైతే ఒకేరోజు బాలకృష్ణ,ధనుష్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడటం ఖాయమని అంటున్నారు.