హీరో ధనుష్‌కు హైకోర్టు నోటీసులు
దర్శకుడు, నిర్మాత, జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న ప్రముఖ తమిళ నటుడు ధనుష్‌కు మద్రాసు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ధనుష్ తమ కుమారుడేనంటూ వృద్ధ దంపతులు వేసిన పిటిషన్ విచారణ నిమిత్తం ఈ సమన్లు జారీ చేసింది.
ధనుష్ తమ కుమారుడేనని, చానాళ్ల క్రితం సినిమాల్లో చేరడం కోసం ఇల్లు వదిలి పారిపోయాడని కొన్ని సంవత్సరాల క్రితం కధిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టులో కేసు వేశారు. ధనుష్ తమ మూడో కొడుకు అని ఆ దంపతులు వాదిస్తున్నారు. ధనుష్ నుంచి వారు నెలకు రూ. 65 వేల మెయింటెనెన్స్ కూడా కోరుతున్నారు. ధనుష్ కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించాడని, పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నవిషయం తెలిసిందే. ఈ సంవత్సరం వారిరువురు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల విడుదల అయిన అసురన్, కర్ణన్ తదితర సినిమాల్లో తన నటనతో ధనుష్ ప్రశంసలు అందుకున్నారు.
డీఎన్ఏ పరీక్షకు నో
తన తల్లిదండ్రుల వివరాలకు సంబంధించి ధనుష్ కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించాడని, ఆయనపై పోలీసు కేసు వేయాలని, గతంలో కొట్టివేసిన తన కేసును పునః ప్రారంభించాలని కధిరేశన్ దంపతులు తాజాగా కోర్టును కోరారు. దాంతో, విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు ధనుష్‌కు సమన్లు జారీ చేసిందని సమాచారం. కధిరేశన్, మీనాక్షి దంపతులు వేసిన కేసు విచారణకు ధనుష్ గతంలో పలుమార్లు హాజరయ్యారు. వారి వాదనను ఖండిస్తూ తాను సినీ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడినని, తన తల్లి విజయలక్ష్మి అని, తన పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా అని ధనుష్ కోర్టుకు తెలిపారు. డీఎన్ఏ పరీక్షకు హాజరవాలని గత విచారణల సమయంలో కోర్టు ధనుష్‌కు సూచించగా, ధనుష్ ఆ సూచనను తిరస్కరించారు.