Delhi Crime Season 2 Review: గ్రిప్పింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఢిల్లీ క్రైమ్‌ 2 అదుర్స్‌-delhi crime season 2 is a gripping crime story dealing with brutal murders ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Delhi Crime Season 2 Is A Gripping Crime Story Dealing With Brutal Murders

Delhi Crime Season 2 Review: గ్రిప్పింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఢిల్లీ క్రైమ్‌ 2 అదుర్స్‌

Hari Prasad S HT Telugu
Aug 30, 2022 03:07 PM IST

Delhi Crime Season 2 Review: ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2 వచ్చేసింది. ఈసారి మరింత గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో కట్టిపడేసింది. దారుణమైన హత్యల కేసులను సాల్వ్‌ చేయడానికి డీసీపీ వర్తికా చతుర్వేది తన టీమ్‌తో కలిసి మళ్లీ వచ్చింది.

ఢిల్లీ క్రైమ్ 2
ఢిల్లీ క్రైమ్ 2 (Twitter)

Delhi Crime Season 2 Review: ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 1 నిర్భయ గ్యాంగ్‌రేప్‌, దారుణమైన హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ చుట్టూ తిరిగింది. ఆ సీజన్‌ సూపర్‌ సక్సెస్‌ కావడంతో ఇప్పుడీ టీమ్‌ ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి అంతటి ఆసక్తిరేపే స్టోరీ కాకపోయినా.. ఢిల్లీలో కచ్చా బనియన్‌ గ్యాంగ్‌ పేరుతో జరుగుతున్న క్రూరమైన హత్యల కేసులను పరిష్కరించడానికి డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ షా) తన టీమ్‌తో కలిసి వచ్చింది.

ఢిల్లీ క్రైమ్‌ 2 రివ్యూ (Delhi Crime Season 2 Review)

క్రియేటర్: రిచీ మెహతా

డైరెక్టర్‌: తనూచ్‌ చోప్రా

నటీనటులు: షెఫాలీ షా, రసికా దుగల్‌, రాజేష్‌ తైలాంగ్‌, ఆదిల్‌ హుస్సేన్‌, అనురాగ్‌ అరోరా, యశస్విని దయామా

మొత్తం ఎపిసోడ్లు: 5

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్‌

ఢిల్లీ క్రైమ్‌ 2 (Delhi Crime Season 2) స్టోరీ ఏంటి?

1990ల్లో ఢిల్లీని వణికించిన కచ్చా బనియన్‌ గ్యాంగ్‌ మళ్లీ వచ్చిందా? ఢిల్లీ శివార్లలో కాదు.. ఈసారి నగరం నడిబొడ్డున ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఒంటరిగా ఉండే వృద్ధులను టార్గెట్‌ చేసుకొని దారుణంగా హత్య చేసి అందిన కాడికి దోచుకెళ్తుందా? హత్యలు చేస్తోంది నిజంగా కచ్చా బనియన్‌ గ్యాంగేనా? లేక వాళ్ల పేరు చెప్పుకొని ఎవరైనా ఈ దారుణాలకు పాల్పడుతున్నారా? ఈ హత్యలకు అసలు కారణం ఎవరు? వాళ్ల ఉద్దేశం ఏంటి? ఈ కేసు డీసీపీ వర్తికా చతుర్వేదికి ఎలాంటి సవాళ్లు విసిరింది అన్నది రెండో సీజన్‌లో చూడొచ్చు.

మాజీ పోలీస్‌ బాస్‌ నీరజ్‌ కుమార్‌ రాసిన ఖాకీ ఫైల్స్‌ బుక్‌లోని మూన్‌ గేజర్‌ చాప్టర్‌ ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. రిచీ మెహతా ఈ సిరీస్‌ క్రియేటర్‌. భారత ప్రభుత్వం డీనోటిఫై చేసిన ఓ తెగ ఈ హత్యలకు పాల్పడుతుందన్న అనుమానంతో వాళ్ల కమ్యూనిటీ మొత్తాన్ని క్రిమినల్స్‌గా చూడటం ఎంత వరకు కరెక్ట్‌? అణగారిన వర్గాలు, స్లమ్‌ ఏరియాల్లో ఉండే వాళ్లే ఈ నేరాలకు పాల్పడతారని ముద్ర వేయడం సమంజసమేనా? సమాజంలో పెరిగిపోతున్న అసమానతలు ఈ క్రైమ్‌ రేట్ పెరగడానికి కారణమా లాంటి సున్నితమైన అంశాలను ఈ సిరీస్‌ లేవనెత్తింది.

ఢిల్లీ క్రైమ్‌ తొలి సీజన్‌ నిర్భయ రేప్‌, మర్డర్‌ వాస్తవ ఘటనలు, ఆ కేసు ఇన్విస్టిగేషన్‌ సాగిన తీరును ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించి తెర వెనుక జరిగే అంశాలను అద్భుతంగా చూపించారు. ఇక ఈ సీజన్‌ 2లో ఇంట్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న హత్యలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ చూపించారు.

ఢిల్లీ క్రైమ్‌ 2.. షెఫాలీ షో

రెండో సీజన్‌లోనూ సిరీస్‌ లీడ్‌ క్యారెక్టర్‌ షెఫాలీ షా తన నటనతో ఒంటి చేత్తో సిరీస్‌ను నడిపించింది. డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో ఆమె జీవించేసింది. ఆమెకు ఏసీపీ నీతీ సింగ్‌ పాత్రలో కనిపించిన రసికా దుగల్‌, రాజేష్‌ తైలాంగ్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, అనురాగ్‌ అరోరాల నుంచి మంచి సపోర్ట్‌ లభించింది.

ఇక లేడీ విలన్‌ క్యారెక్టర్‌లో కనిపించిన తిలోత్తమా షోమ్‌ నటన కూడా ఈ సిరీస్‌కు హైలైట్‌ అని చెప్పాలి. ఈ టీమ్‌ ఢిల్లీని వణికిస్తున్న ఆ క్రైమ్‌ను ఎలా సాల్వ్‌ చేయగలిగింది అన్నే ఢిల్లీ క్రైమ్‌ 2 అసలు స్టోరీ. సిరీస్‌ను మరీ ఎక్కువగా సాగదీసినట్లుగా కాకుండా ఐదు ఎపిసోడ్లలోనే చాలా ఫాస్ట్‌ఫాస్ట్‌గా ముగించేశారు.

అయితే ఈ రెండో సీజన్‌లో ఇంగ్లిష్‌లో ఎక్కువగా డైలాగ్స్‌ ఉండటం సగటు ప్రేక్షకుడిని దీనికి దూరం చేయొచ్చు. క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీలంటే ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. అయితే ఇలాంటి స్టోరీలను సాధ్యమైనంత వరకూ సగటు ప్రేక్షకుడి భాషలో, సులువుగా అర్థమయ్యేలే తెరకెక్కించడం చాలా అవసరం. ఈ విషయంలో మేకర్స్‌ దారి తప్పినట్లు కనిపిస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం