Bhola Shankar OTT Official: ఓటీటీలోకి చిరంజీవి భోళా శంకర్.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
Bhola Shankar OTT: గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల విజయం తర్వాత భోళా శంకర్ సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవి ఘోరమైన డిజాస్టర్ అందుకున్నారు. దీంతో థియేటర్లలో చూడని జనాలు ఓటీటీలోకి వస్తే లుక్కేద్దామనుకున్నారు. తాజాగా భోళా శంకర్ ఓటీటీ విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సందడి చేసిన సినిమా భోళా శంకర్. బిల్లా, శక్తి చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో చిరుకి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే చిరంజీవికి చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ చేసింది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‍పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళంలో ఎనిమిదేళ్ల క్రితం సూపర్ హిట్ కొట్టిన అజిత్ వేదాళం సినిమాకు రీమేక్‍గా వచ్చిన భోళా శంకర్ మూవీ ఆగస్ట్ 11న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే తొలి రోజు నుంచే భోళా శంకర్ సినిమా నెగెటివ్ టాక్, రివ్యూస్ తెచ్చుకుంది.
ఆచార్య తర్వాత అంతటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అని భోళా శంకర్ సినిమాపై ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. ఇక సినిమా ఫలితంతో డైరెక్టర్ మెహర్ రమేష్‍పై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. హీరోలు జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమాలు చేయాలంటే రాజమౌళితో అయినా, లేదా మెహర్ రమేష్‍తో అయినా చేయాలి అని మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. అలాంటి భోళా శంకర్ సినిమా ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకు భోళా శంకర్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ డేట్‍ను తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.
చిరంజీవి భోళా శంకర్ సినిమా ఓటీటీ హక్కులను దిగ్గజ సంస్థ నెట్‍ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 15 (శుక్రవారం) నుంచి నెట్‍ఫ్లిక్స్ లో భోళా శంకర్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భోళా శంకర్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు అంతగా థియేటర్లలోకి వెళ్లి చూడలేదు. మరి ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్న భోళా శంకర్ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే భోళా శంకర్ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. వెన్నెల కిశోర్, శ్రీముఖి, యాంకర్ రష్మి, హైపర్ ఆది, గెటప్ శీను పలువురు నటించారు.