Bigg Boss Telugu 7 Promo: ఫొటోలు పగులగొట్టిన నాగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్లు.. గెస్ట్‌గా రామ్: ప్రోమో చూడండి
Bigg Boss Telugu 7 day 21 Promo: బిగ్‍బాస్ తెలుగు 7 మూడో వారం ముగింపునకు వచ్చింది. నేటి ఎపిసోడ్‍లో ఎలిమినేషన్ తంతు ఉండనుంది. ఈ ఎపిసోడ్‍కు హీరో రామ్ పోతినేని అతిథిగా వచ్చారు.
Bigg Boss Telugu 7 day 21 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో మరో ఎలిమినేషన్‍కు రంగం సిద్ధమైంది. మూడో వారం ముగింపునకు వచ్చింది. 7వ సీజన్ 22వ రోజునైన ఆదివారం ఎపిసోడ్ నేడు రానుంది. హౌస్‍మేట్ల మధ్య ఈవారం వాదనలు చాలాసార్లు హాట్‍హాట్‍గా జరిగాయి. కొందరు గొడవలు పడ్డారు. శనివారం చాలా మందికి క్లాస్ పీకారు హోస్ట్ నాగార్జున. నేడు (సెప్టెంబర్ 24) ఆదివారం ఫన్ గేమ్‍లతో పాటు ఎలిమినేషన్ ఉండనుంది. నేటి ఎపిసోడ్‍కు యంగ్ హీరో రామ్ పోతినేని అతిథిగా వస్తున్నారు. వివరాలివే..
ఆదివారం ఎపిసోడ్ కావడంతో హౌస్‍మేట్లతో కొన్ని గేమ్స్ ఆడించారు నాగార్జున. చిట్టి ప్రశ్నలు అంటూ.. ఓ గేమ్ పెట్టారు. చక్రం తిప్పాలని, దాంట్లో వచ్చిన కలర్ ఆధారంగా తన వద్ద ఉన్న బాక్సులో చిట్టీలు తీస్తానని చెప్పారు. దాని ఆధారంగా హౌస్‍మేట్స్ గురించి ప్రశ్నలు అడిగారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు కంటెస్టెంట్లు. ఇదంతా సరదాగా సాగింది. ఆ తర్వాత హీరో రామ్ పోతినేని అతిథిగా ఎంట్రీ ఇచ్చారు. స్కంద మూవీ ప్రమోషన్ల కోసం ఆయన వచ్చారు. కంటెస్టెంట్లతో రామ్ మాట్లాడారు. "నాతో కళ్లజోడు పెట్టుకొని మాట్లాడి.. ఆడ పిల్లలు కనిపించగానే కళ్లజోడు తీసేశాడు” అని రామ్‍ను ఆట పట్టించారు నాగ్. ఆ తర్వాత హౌస్‍మేట్లతో రామ్ మాట్లాడారు. వారి డ్యాన్స్ చూశారు. అయితే, మూడో ప్రోమోలో అసలు విషయం ఉంది.
ప్రిన్స్ యావర్ సేఫ్ అవటంతో ప్రస్తుతం మూడో వారానికి ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరి, శుభశ్రీ, రతిక రోజ్, దామిని, గౌతమ్ కృష్ణ నామినేషన్లలో ఉన్నారు. దీంతో ఈ ఎపిసోడ్‍లో ఓ దశలో వీరిలో కొందరి ఫొటోలు ఉన్న పలకలను నాగార్జున సుత్తితో పగులగొట్టారు. ఇది నామినేషన్ల ప్రక్రియలో భాగం అయి ఉండొచ్చు. ఫొటోలను పగులగొట్టేటప్పుడు కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి, ఇది ఎందుకు చేశారో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 24) 22వ రోజు ఎపిసోడ్ చూడాలి. ఓటింగ్ ప్రకారం మూడో వారం సింగర్ దామిని హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే అంచనాలు ఉన్నాయి.