Bigg Boss 8 Telugu Day 23: హౌస్‍కు కొత్త చీఫ్.. గొడవ పడి ఏడ్చిన యష్మి.. హార్ట్ బ్రేక్ చేశావ్: నిఖిల్‍తో సోనియా
Bigg Boss 8 Telugu Day 23 Highlights: బిగ్‍బాస్ హౌస్‍లో కొత్త చీఫ్ ఎంపికయ్యారు. నూతన చీఫ్‍ను ఎంపిక చేసుకునే ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. సోనియా, నబీల్ మధ్య హీట్ కొనసాగింది. యష్మితోనూ సోనియా గొడవ కొనసాగింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నాలుగో వారం నామినేషన్ల తర్వాత కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ జరిగింది. నేటి (సెప్టెంబర్ 24) 23వ రోజు ఎపిసోడ్‍లో కొత్త చీఫ్ సెలెక్షన్ తంతు జరిగింది. ఈ సందర్భంగా సుత్తి కోసం కంటెస్టెంట్ల మధ్య పోరాటాలు, బొమ్మలను పగులగొట్టే సమయంలో వాగ్వాదాలు జరిగాయి.
సోనియా, యష్మి మధ్య గొడవ కంటిన్యూ
నామినేషన్ల సమయంలోని గొడవ సోనియా, యష్మి మధ్య కొనసాగింది. నిఖిల్, పృథ్విరాజ్‍ను సోనియా వాడుకుంటున్నారని యష్మి నేరుగా అటాక్ చేశారు. దీనిపై సోనియా వాదించారు. తల్లి, చెల్లి అంటూ వారిద్దరినీ ఆయుధాలుగా వాడుకున్నారని యష్మి అన్నారు. టాస్కుల విషయంలోనూ వాదించుకున్నారు.
యష్మి కన్నీళ్లు
ఈ గొడవంతా అయ్యాక యష్మి ఏడ్చారు. సోనియా నోటికొచ్చినట్టు మాట్లాడుతోందని కన్నీరు పెట్టుకున్నారు. ఇంట్లో వాళ్ల గురించి అంతా తెలుసని సోనియా అంటోందని, వారు ఏమనుకుంటారంటూ బాధపడ్డారు. యష్మిని నిఖిల్, సీత ఓదార్చారు. ఈ అంశంపైనే నిఖిల్, పృథ్వితో సోనియా మాట్లాడారు.
నా హార్ట్ బ్రేక్ చేశావ్
వాడుకుంటున్నారని యష్మి చేసిన వ్యాఖ్యలపై సోనియా, నిఖిల్ మధ్య అర్ధరాత్రి మాటలు సాగాయి. అబద్ధం బతుకు బతుకుతున్నావని, ముందు పెట్టి ఆడుతున్నావని, వాడుకుంటున్నావని యష్మి తనను అనిందని, అప్పుడు నీకు అర్థం కాలేదా అని నిఖిల్‍తో సోనియా అన్నారు. యష్మి ఏదో పాయింట్ చెబితే దానిపై పృథ్వితో చర్చ పెట్టావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
హార్ట్ బ్రేక్ చేశావని నిఖిల్‍తో సోనియా చెప్పారు. “నేను నిన్ను ఇప్పుడు ఏమీ అనడం లేదు. నువ్వు చెప్పేది నేను అంగీకరిస్తున్నా. నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే. నాకు అది సమస్య కాదు. కానీ ఈరోజు నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్. ఇది పర్సనల్. ఇది నాకు పాఠం” అని నిఖిల్‍తో సోనియా మాట్లాడారు. 'దోచేస్తా' అనే పాటతో 23వ రోజు మొదలైంది.
రెండో చీఫ్ ఎంపిక.. సోనియా, నబీల్ క్లాష్
హౌస్‍లో శక్తి క్లాన్‍కు ఇప్పటికే నిఖిల్ చీఫ్‍గా ఉన్నారు. కాంతార క్లాన్‍కు చీఫ్ ఎంపిక ప్రక్రియ సాగింది. నిఖిల్ తప్ప అందరూ పోటీలో ఉన్నారని బిగ్‍బాస్ చెప్పారు. పది మంది కంటెస్టెంట్ల ముఖాలతో పది బొమ్మలను బిగ్‍బాస్ ఇచ్చారు. అందులో పగులకుండా ఉండే వ్యక్తి చీఫ్ అవుతారని చెప్పారు. చీఫ్‍గా ఎవరు వద్దో కారణాలు చెప్పి ముఖాలు ఉన్న బొమ్మలను సుత్తితో పగులగొట్టాలని బిగ్‍బాస్ తెలిపారు. ముందుగా సుత్తిని పట్టుకునే కంటెస్టెంట్ మరొకరికి సుత్తి ఇచ్చి.. బొమ్మను పగులగొట్టే అవకాశం కల్పించాలని తెలిపారు.
ముందుగా ఆదిత్య బొమ్మను నిఖిల్ పగులగొట్టారు. దోశ విషయంలో అంత గొడవ జరుగుతున్నా కల్పించుకోలేదని, లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవని నిఖిల్ అన్నారు. ఆ తర్వాత వరుసగా కంటెస్టెంట్లు సుత్తులను అందుకొని ఒకరికొకరు ఇచ్చుకుంటూ బొమ్మలను పగులగొట్టారు. కారణాలు చెప్పుకున్నారు. సుత్తి తీసుకునేందుకు కూడా కంటెస్టెంట్లు తంటాలు పడ్డారు. ఈ క్రమంలో వాదనలు గట్టిగానే జరిగాయి.
నబీల్, సోనియా మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. నబీల్‍కు ఎలా ప్రవర్తించాలో, పెద్దలను గౌరవించాలో తెలియదని సోనియా అన్నారు. ఎవరితోనూ సరిగా మాట్లాడడని చెప్పారు. దీంతో నీతో ఓపెన్ అవలేదా, మాట్లాడలేదా అంటూ నబీల్ అందరినీ అడిగారు. సోనియా అన్న మాటలపై నబీల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సుత్తి కోసం పోరాడడం, బొమ్మలను పగులగొట్టే ప్రక్రియ సాగింది.
చీఫ్‍గా సీత
ఫొటోలు ఉన్న బొమ్మలు పగులగొట్టే ప్రక్రియ పూర్తయ్యాక సీత బొమ్మ ఒక్కటే మిగిలింది. దీంతో కాంతార క్లాన్‍కు సీత చీఫ్ అయ్యారు. శక్తి క్లాన్‍కు ఇప్పటికే నిఖిల్ చీఫ్‍గా కంటిన్యూ అవుతున్నారు. ఏ క్లాన్‍లో ఎవరు ఉంటారనే విషయం రేపటి ఎపిసోడ్‍లో తేలనుంది.