Bigg Boss 8 Telugu Day 16: ‘రూల్స్ మార్చేశావ్.. చీటర్’: సోనియాపై యష్మి ఆగ్రహం.. రేషన్ టాస్కుల్లో విన్నర్స్ ఎవరంటే..
Bigg Boss 8 Telugu Day 16: బిగ్‍బాస్ హౌస్‍లో మూడో వారం రేషన్ టాస్కులు రచ్చరచ్చగా సాగాయి. బెలూన్ ఛాలెంజ్‍లో సోనియా తీసుకున్న నిర్ణయంపై అభయ్ క్లాన్ సభ్యులు తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు. అంతా గందరగోళంగా సాగింది.
బిగ్‍బాస్ తెలుగు 8 సీజన్‍లో రేషన్ కోసం రెండు క్లాన్‍ల మధ్య జరిగిన గేమ్ ఛాలెంజ్‍లు రసవత్తరంగా సాగాయి. నేటి (సెప్టెంబర్ 17) 16వ రోజు ఎపిసోడ్‍లో మూడు టాస్కుల్లో కంటెస్టెంట్లు తలపడ్డారు. దీంతో మూడో టాస్క్ బెలూన్ ఛాలెంజ్ రసాభాసగా జరిగింది. సంచాలక్‍గా ఉన్న సోనియా తీసుకున్న నిర్ణయంపై గొడవ గట్టిగా సాగింది. యష్మి మరోసారి రెచ్చిపోయారు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే..
మణి వల్ల ఏడ్చేసిన యష్మి
నామినేషన్స్, ఫ్రెండ్‍షిప్ వేరంటూ యష్మికి నచ్చజెప్పేందుకు మణికంఠ ప్రయత్నించారు. వెనుక నుంచి యష్మిని కౌగిలించుకున్నారు. దీంతో యష్మి చిరాకు పడి.. వదిలెయ్ అని గట్టిగా అన్నారు. పాయింట్స్ లేకపోయినా ఎప్పుడూ నిన్నే నామినేట్ చేస్తానని మణితో మళ్లీ చెప్పారు. మణికంఠ ప్రవర్తనను తాను తట్టుకోలేకున్నానంటూ బిగ్‍బాస్‍కు చెబుతూ ఏడ్చేశారు యష్మి. తన అంగీకారం లేకుండా మణి కౌగిలించుకోవడంపై బాధపడ్డారు. ఆ తర్వాత 16వ రోజ మొదలైంది.
నిఖిల్, నబీల్ హోరాహోరీగా..
ఈ వారం రేషన్‍ను మళ్లీ సంపాదించుకునే అవకాశం వచ్చిందని కంటెస్టెంట్లతో బిగ్‍బాస్ చెప్పారు. తొలి ఛాలెంజ్‍గా ‘ఫొటో పెట్టు.. ఆగేటట్టు’ ఇచ్చారు. వారి చీఫ్ ఫొటోలను ఫొటో స్లాట్‍ల్లో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. నిఖిల్‍కు చెందిన శక్తి క్లాన్ నుంచి పృథ్విరాజ్, అభయ్ చీఫ్‍గా ఉన్న కాంతార టీమ్ నుంచి నబీల్ పోటీ పడ్డారు. సీత సంచాలక్‍గా వ్యవహరించారు. ఫొటోలు పెట్టేందుకు నబీల్, పృథ్వి హోరాహోరీగా తలపడ్డారు. ఒకరి ఫొటోలు ఒకరు తీసేసేందుకు కిందామీదా పడ్డారు. ఒకరినొకరు పట్టుకోవద్దని చెప్పినా పృథ్వి వినలేదు. మొత్తంగా నబీల్ ఆడిన అభయ్ టీమ్ తొలి ఛాలెంజ్‍లో గెలిచింది.
యష్మి అంటే ఇష్టమా..
యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావని నిఖిల్‍తో సీత అన్నారు. చేయలేదని యష్మి చెప్పారు. జోకర్‌లా సోనియా ముక్కుకు రెడ్ కలర్ రాశారు పృథ్వి. నీకు, యష్మికి మధ్య ఏముందని పృథ్విని సోనియా అడిగారు. ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారని చెప్పారు. డ్రెస్ బాగుందంటే ఇలాంటివే తెప్పించుకుంటానని యష్మి నీతో చెప్పింది కదా అని పృథ్వితో సోనియా అన్నారు. వ్యక్తిగా యష్మి అంటే తనకు ఇష్టమని పృథ్వి చెప్పారు. నువ్వు కూడా ఇష్టమే అని సోనియాతో చెప్పారు. ఫ్రెండ్స్‌గా ఉందామని నిఖిల్‍తో సీత అన్నారు.
నిఖిల్ క్లాన్ విన్.. ప్రేరణ ఫైర్
‘నత్తలా సాగకు.. ఒక్కటీ వదలకు’ అంటూ కంటెస్టెంట్లకు రెండో రేషన్ చాలెంజ్ ఇచ్చారు బిగ్‍బాస్. ప్రతీ క్లాన్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు తలతో క్యాబేజీలను ఎండ్ పాయింట్‍కు తీసుకెళ్లాలని, ఎక్కువగా చేసిన టీమ్ గెలిచినట్టు అని బిగ్‍బాస్ చెప్పారు. మణికంఠ సంచాలక్‍గా చేశారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు గేమ్ ఆడారు. నిఖిల్ క్లాన్ ఈ టాస్కులో గెలిచింది. క్యాబేజీ పెట్టడంలో సంచాలక్ మణికంఠ ఫెయిల్ అయ్యారంటూ ప్రేరణ వాదించారు. నిఖిల్‍కు చెందిన శక్తి క్లాన్ గెలిచినట్టు మణి ప్రకటించారు. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడి వరకే గేమ్ అని మణి అన్నారు. “నువ్వెవరు చెప్పడానికి” అని ప్రేరణ అరిచారు. తొక్కలో సంచాలక్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ టాస్క్ గురించి మణిపై ప్రేరణ వాదన కొనసాగించారు. తాను చెప్పే పాయింట్స్ ఎందుకు అర్థం చేసుకోలేదని మణి ఒంటరిగా కూర్చుని ఏడ్చారు. ఆ తర్వాత మణి వద్దకు వెళ్లి ప్రేరణ ఓదార్చారు.
రచ్చరచ్చగా బెలూన్ ఛాలెంజ్
“బూరను కొట్టు.. రేషన్ పట్టు” అంటూ మూడో ఛాలెంజ్ ఇచ్చారు బిగ్‍బాస్. ఒక్కొక్కరు ఎదుటి సభ్యుడి మీద అతికించిన బెలూన్ కొట్టాలన్నారు. బజర్ మోగేసరికి ఎవరి శరీరంపై ఎక్కువ బెలూన్‍లు ఉంటే వారు గెలిచినట్టు అని తెలిపారు. గెలిస్తే.. మనసుకు నచ్చిన ఆహారాన్ని పొందుతారని అన్నారు. రెండు క్లాన్‍ల చీఫ్‍లు నిఖిల్, అభయ్ తలపడ్డారు. సోనియా సంచాలక్‍గా చేశారు. బాక్స్ బయటికి వచ్చి కొడుతున్నావంటూ అభయ్‍ను సోనియా చాలాసార్లు వారించారు. బాక్స్ బయటికి వస్తే డిస్‍క్వాలిఫై చేస్తానని అన్నారు. నిఖిల్ స్టిక్ కూడా విరిగిపోయింది. అయినా, ఇద్దరు బెలూన్లను పోటాపోటీగా పగలగొట్టుకున్నారు.
రూల్స్‌ను కాదని సోనియా నిర్ణయం
బజర్ మోగే సరికి అభయ్ శరీరంపై ఓ బెలూన్ ఉండగా.. నిఖిల్‍పై ఒక్కటి కూడా లేదు. అయితే, అభయ్ చాలాసార్లు రూల్స్ బ్రేక్ చేశారని, తాను చెప్పినా వినలేదంటూ నిఖిల్ క్లాన్‍ను విన్నర్‌గా ప్రకటించారు సోనియా. దీంతో గేమ్ మెయిన్ రూల్ ప్రకారం బెలూన్ ఉన్న అభయ్ విన్నర్ అంటూ యష్మి వాదించారు. తాను ఇక నుంచి ఏ గేమ్ ఆడబోనని, బయటికి పంపినా పర్లేదంటూ అభయ్ కూడా సోనియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
యష్మి ఆగ్రహం
బాక్స్ బయటికి వెళ్లవద్దని ఎన్నిసార్లు చెప్పినా అభయ్ వినలేదని, నిఖిల్ స్టిక్ విరిగిపోయిందని చెప్పినా ఆగలేదని సోనియా అన్నారు. తాను లోపలికి వచ్చి బెలూన్స్ కొట్టానని అన్నారు అభయ్ వాదించారు. తమకు సంబంధించిన బెలూన్‍లను ఇవ్వలేదని సోనియాతో యష్మి చెప్పారు.
సోనియాను చీటర్.. చీటర్ అని అన్నారు యష్మి. సంచాలక్‍గానూ చీటర్ అని నిరూపించుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా ఇష్టమొచ్చినట్టు రూల్స్ మార్చేశారని యష్మి ఫైర్ అయ్యారు. “రూల్స్ ఫాలో కావాలంటే చేయొచ్చు. ఫస్ట్ పాయింట్‍లో ఉన్న లైన్ వదిలేసి.. నీకు కంఫర్ట్ ఉన్నవి తీసుకున్నావ్. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్‌ను డిక్లేర్ చేశావ్. ఫస్ట్ లైన్ వదిలేశావ్. అభయ్ బాడీ మీద బెలూన్ ఉంది” అని యష్మి గట్టిగా వాదించారు.
మూడు రేషన్ ఛాలెంజ్‍ల్లో రెండింట్లో నిఖిల్ క్లాన్ గెలిచింది. అభయ్ టీమ్ ఓ టాస్కులో విజయం సాధించింది. ఈ టీమ్‍లకు బిగ్‍బాస్ ఏ విధంగా రేషన్ ఇస్తారో రేపటి ఎపిసోడ్‍లో తేలనుంది.