#NBK109: బాలకృష్ణ కొత్త సినిమాకు పూజ.. చిరు డైరెక్టర్‌తో బాలయ్య
#NBK109: బాలకృష్ణ తన కొత్త మూవీకి కొబ్బరికాయ కొట్టారు. ఎన్‍బీకే 109 మూవీకి నేడు పూజ జరిగింది. బాబీ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించనున్నారు.
#NBK109: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చాలా జోష్‍లో ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహా రెడ్డితో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం భగవంత్ కేసరి మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పుట్టిన రోజు సందర్భంగా నేడు (జూన్ 10) మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు బాలకృష్ణ. ఈ కొత్త మూవీ పూజ నేడు జరిగింది. బాలకృష్ణ 109వ సినిమా (NBK109)గా ఇది ఉండనుంది. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర).. బాలయ్య 109వ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. వివరాలివే..
ఎన్‍బీకే 109 అంటూ చిత్రయూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. వయిలెన్స్ కా విజిటింగ్ కార్డ్ అంటూ పేర్కొంది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లు ఈ బాలయ్య - బాబీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మాతలుగా ఉన్నారు.
బాబీ డైరెక్టర్ గా ఉన్న ఈ ఎన్‍బీకే 109 ప్రాజెక్టు గురించి సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది. గొడ్డలి, కత్తులు, సుత్తులు సహా కొన్ని ఆయుధాలు ఉన్న బాక్స్ లాంటి లుక్‍ను పోస్ట్ చేసింది. “ఆయన ప్రపంచానికి తెలుసు.. కానీ ఆయన ప్రపంచం ఏ ఒక్కరికీ తెలియదు” అని ఆ పోస్టర్‌పై ఉంది. “వయిలెన్స్ కా విజిటింగ్ కార్డ్.. NBK109 2024 ప్రారంభంలో వచ్చేస్తుంది. నట సింహం నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇది బాబీ చిత్రం. వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వస్తోంది” అని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది.
అయితే, ఈ ఎన్‍బీకే 109 చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు సహా మిగిలిన వివరాలను చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే క్రమంగా విషయాలు వెల్లడవుతాయి. బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‍లో వస్తున్న ఈ మూవీ కూడా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండే అవకాశం ఉంది. 2024 సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. భగవంత్ కేసరి ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందు రానుంది. అంటే ఐదు నెలల వ్యవధిలోనే బాలయ్య నుంచి రెండు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక, బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నేడు భగవంత్ కేసరి టీజర్ విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఈ మూవీ చేస్తున్నారు. తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‍లు అదిరిపోయాయి.