Venu Swamy Controversy: నాగచైతన్య, శోభితా గురించి అందుకే మాట్లాడా.. ఆ మాట మీదనే ఉంటా: వేణుస్వామి
Venu Swamy Controversy: నాగచైతన్య - శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ తర్వాత వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాను చైతూ, శోభిత జాతకం ఎందుకు చెప్పానో తాజాగా వెల్లడించారు వేణుస్వామి.
సెలెబ్రెటీ ఆస్ట్రాలజర్‌గా చెప్పుకునే వేణుస్వామి.. చాలాసార్లు తన వ్యాఖ్యలతో వివాదాలు రేపారు. జాతకం పేరుతో సంచలనం అయ్యేలా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. దీంతో వేణుస్వామిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఇక సెలెబ్రిటీల జాతకాలు చెప్పకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఇటీవలే హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మందికి ఆగ్రహం తెప్పించాయి. మాట కూడా తప్పారంటూ ట్రోల్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో వేణుస్వామి నేడు (ఆగస్టు 12) స్పందించారు.
అందుకే వారి జాతకం చెప్పా
గతంలో తాను నాగచైతన్య, సమంత జాతకం చెప్పానని, దానికి కొనసాగింపుగానే ఇప్పుడు నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం గురించి మాట్లాడానని వేణు స్వామి తెలిపారు. సెలెబ్రిటీల జాతకాలు చెప్పనని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానంటూ నేడు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
“మూడు రోజుల కిందట నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాతకాన్ని విశ్లేషించా. దానిపై చాలా తీవ్రమైన డిబేట్లు సాగుతున్నాయి. నేను ఇంతకు ముందు నాగచైతన్య, సమంత జాతకాన్ని చెప్పాను కాబట్టి.. దానికి కొనసాగింపుగా ఈ జాతకాన్ని చెప్పా. అంతేకానీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలెబ్రిటీ జాతకాలు చెప్పనని తెలిపాను. అదే మాట మీద ఉంటాను” అని వేణుస్వామి ఆ వీడియోలో తెలిపారు.
విష్ణుతో మాట్లాడా
ఈ విషయంపై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు తనతో మాట్లాడారని, ఇక సెలెబ్రిటీ, రాజకీయ జాతకాలు చెప్పనని తాను ఆయనతో చెప్పానని వేణుస్వామి వెల్లడించారు. “మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడారు. వారికి కూడా నేను క్లారిటీ ఇచ్చా. ఇక మీదట సెలెబ్రిటీ జాతకాలు, రాజకీయ జ్యోతిష్యాలు కానీ చెప్పబోనని తెలిపా. తాను సెలెబ్రిటీల వ్యక్తిగత జాతకాలు విశ్లేషించనని చెప్పా. వచ్చాక కలుద్దామని విష్ణు అన్నారు” అని వేణుస్వామి తెలిపారు.
పోలీసులకు కంప్లైట్
నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్ ఆగస్టు 8న జరిగింది. అయితే ఈ ఇద్దరు 2027లో విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. చాలా మంది సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. కాగా, చైతూ - శోభిత గురించి మాట్లాడిన వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్టు తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆయనపై కంప్లైట్ ఇచ్చినట్టు సమాచారం.
నాగచైతన్య, సమంత విడిపోతారంటూ అప్పట్లో వేణుస్వామి చెప్పారు. వారిద్దరూ విడాకులు తీసుకోవడంతో ఆయనకు పాపులారిటీ వచ్చింది. అయితే, రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా వేణుస్వామి చెప్పారు. అయితే, ఆ తర్వాత సలార్, కల్కి చిత్రాలతో ప్రభాస్ భారీ హిట్‍లు కొట్టారు. దీంతో వేణుస్వామిపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఆయన చెప్పిన అంచనా తప్పటంతో ఆయనపై ట్రోల్స్ తీవ్రమయ్యాయి. దీంతో సెలెబ్రిటీ, రాజకీయ జాతకాలు చెప్పనని ఆయన వెల్లడించారు.