AR Rahman on Naatu Naatu: నాటు నాటు పాట ఆస్కార్‌నే కాదు.. గ్రామీ కూడా గెలవాలి.. రెహమాన్ ఆకాంక్ష-ar rahman says he want naatu naatu to win ahead of oscars 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ar Rahman On Naatu Naatu: నాటు నాటు పాట ఆస్కార్‌నే కాదు.. గ్రామీ కూడా గెలవాలి.. రెహమాన్ ఆకాంక్ష

AR Rahman on Naatu Naatu: నాటు నాటు పాట ఆస్కార్‌నే కాదు.. గ్రామీ కూడా గెలవాలి.. రెహమాన్ ఆకాంక్ష

AR Rahman on Naatu Naatu: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు భారత సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామీ కూడా పొందాలని ఆకాంక్షించారు.

ఏఆర్ రెహమాన్

AR Rahman on Naatu Naatu: 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి మరి కొన్ని గంటలే ఉంది. ఈ పురస్కారాలు ప్రతి ఏటా ఇచ్చినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే భారత్ నుంచి ఆర్ఆర్ఆర్‌ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ అందుకుంది. దీంతో ఈ పాటకే అవార్డు వరిస్తుందని సర్వత్రా తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్నారు. సినిమా గురించి బాగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డు రావడంపై భారత సంగీత దిగ్గజం, రెండు అకాడమీ అవార్డుల గ్రహీత అయిన ఏఆర్ రెహమాన్ స్పందించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

"నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను. గ్రామీ అవార్డు కూడా రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పురస్కారం వచ్చినా అది భారత కీర్తి పతాకాలను, సంస్కృతిని ఉన్నతంగా ఉంచుతుంది." అని ఏఆర్ రెహమాన్ అన్నారు.

ఏఆర్ రెహమాన్ ఇప్పటికే రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని జై హో పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అకాడమీ అందుకున్నారు. అంతేకాకుండా ఆయన అకాడమీ మోషన్ పిక్చర్, ఆర్ట్స్‌ అండ్ సైన్సెస్‌లో భాగంగా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తే కనుక ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయ పాటగా రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే జైహో సాంగ్ హాలీవుడ్ సినిమా కోసం రూపొందించింది.

"జనవరిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన రెహమాన్ భారత్ ప్రతి ఏటా ఆస్కార్‌కు నామినేట్ అవుతుందని స్పష్టం చేశారు. భారత్ నామినేషన్‌లోకి వచ్చి 10 ఏళ్లయిందని అనుకుంటున్నాను. కాదు 12 సంవత్సరాలు ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నామినేటైంది. ఇకపై ఇలా ప్రతి ఏటా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం 130 కోట్ల మంది జనాభా ఉన్నాం. ప్రతి అంశం, విభాగంలో అద్భుతమైన మేధావులు చాలా మంది ఉన్నారు. చాలా సినిమాలు పోటీలోకి రావడం లేదు. కనీసం ఆర్ఆర్ఆర్ మేకర్స్ అయినా బయటకొచ్చారు. సినిమా గురించి బయట తెలియకపోతే ఎవరు ఓటు వేస్తారు. ఆర్ఆర్ఆర్ బృందానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గెలవాలని కోరుకుంటున్నాను." అని రెహమాన్ స్పష్టం చేశారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేటైంది. మార్చి 12న అంటే భారత కాలమానం ప్రకారం మార్చి 13 తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ బృందం సినిమా గురించి విరివిగా ప్రమోట్ చేసింది.