Annapoorani OTT Release Date: అఫీషియల్: నయనతార 'అన్నపూర్ణి' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. తెలుగులోనూ..
Annapoorani OTT Release Date: అన్నపూర్ణి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే..
Annapoorani OTT Release Date: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషించిన అన్నపూర్ణి సినిమా.. డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత నయనతార కాస్త కామెడీ ప్రాధాన్యం ఉన్న మూవీ చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మంచి అంచనాల మధ్య ఈ చిత్రం తమిళంలో రిలీజ్ అయింది. అన్నపూర్ణి చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చింది.
అన్నపూర్ణి సినిమా డిసెంబర్ 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ నేడు అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో తమిళంలో మాత్రమే రిలీజ్ అయిన అన్నపూర్ణి చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో డిసెంబర్ 29 నుంచి తెలుగులో కూడా చూడొచ్చు.
అన్నపూర్ణి చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా.. జై, సత్యరాజ్, అచ్యుత కుమార్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్‍స్లే, కుమారి సంచు, రేణుక, కార్తీక్ కుమార్, సురేశ్ చక్రవర్తి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు నిలేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించారు.
బ్రహ్మాణ కుటుంబంలో అమ్మాయి అన్నపూర్ణి పాత్రలో నయనతార ఈ చిత్రంలో నటించారు. అన్నపూర్ణి తండ్రి రంగరాజన్ (అచ్యుత కుమార్) శ్రీరంగం దేవాలయంలో ప్రసాదం తయారు చేస్తుంటారు. అన్నపూర్ణి టాప్ చెఫ్ కావాలాని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే, మాంసాహారం తినడం, వండడం పాపం అని అన్నపూర్ణి కుటుంబ సభ్యులు అడ్డుచెబుతారు. అయితే, అన్నపూర్ణి చెఫ్ అయిందా? అన్నికష్టాలను దాటి టాప్ చెఫ్ స్థాయికి ఎదిగిందా? అన్నదే అన్నపూర్ణి సినిమా ప్రధాన కథగా ఉంది.
అన్నపూర్ణి సినిమాలో కామెడీ ప్రధానంగా ఉన్నా చాలా సామాజిక అంశాలు కూడా ఉన్నాయి. మహిళా సాధికారత అంశం కూడా ఈ చిత్రంలో ఉంది.
టాపిక్