Alia Bhatt on Deepfake Video: డీప్‍ఫేక్ వీడియోపై స్పందించిన ఆలియా భట్.. ఏమన్నారంటే!
Alia Bhatt on Deepfake Video: తన డీప్‍ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అవడంపై స్పందించారు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. ఏఐ టెక్నాలజీపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
Alia Bhatt on Deepfake Video: ఇటీవల చాలా మంది హీరోయిన్లకు డీప్‍ఫేక్ వీడియోల బెదడ ఎదురవుతోంది. రష్మిక మందన్నకు సంబంధించిన ఓ డీప్‍ఫేక్ మార్ఫింగ్ వీడియో దుమారాన్ని రేపింది. ఆ తర్వాత వరుసగా కొందరు హీరోయిన్ల డీఫ్‍ఫేక్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎవరి వీడియోలకో హీరోయిన్ల ముఖాలను ఏఐ సాఫ్ట్ వేర్ల ద్వారా మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయిలు సోల్ మీడియాలో పోస్టులు చేశారు. బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్‍కు సంబంధించిన ఫేక్‍వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది. ఈ తరుణంలో ఈ విషయం గురించి ఆమె తాజాగా స్పందించారు.
రెడీ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ఆలియా భట్ తాజాగా పాల్గొన్నారు. తన హాలీవుడ్ ఎంట్రీ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ సహా మరిన్ని విషయాలపై ఆమె మాట్లాడారు. ఈ క్రమంలో డీప్‍ఫేక్ వీడియో గురించి కూడా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హానీ నుంచి కాపాడేలా చట్టాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఏఐ నుంచి లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయని అన్నారు.
“ఈ విషయంలో చెప్పడానికి చాలా ఉంది. ఎక్కడ మంచి ఉంటుందో.. అక్కడ చెడు కూడా ఉంటుంది. మానవులుగా మన మనుగడ కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే సమస్య ఏదైనా మనం ముందుకు సాగుతూనే ఉంటాయి. అయితే, ఆ సమస్యను పరిష్కరించేందుకు మార్గం కనుగొనాలి. ఏఐ కొన్ని రంగాలకు, కొందరు ప్రొఫెషనల్స్‌కు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, ఇతరులకు హానికరంగానూ ఉంది. ప్రజలకు రక్షణ కల్పించేందుకు చట్టాలు వస్తాయని నేను కచ్చితంగా అనుకుంటున్నా” అని ఆలియా భట్ చెప్పారు.
కెమెరా ముందు ఆలియా భట్ అభ్యకరమైన సంజ్ఞలు చేస్తున్నట్టుగా డీప్‍ఫేక్ వీడియో కొన్ని రోజుల ముందు వైరల్ అయింది. అయితే, వేరే మహిళలకు ఆలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియో అది.
బాలీవుడ్‍లో స్టార్ హీరోయిన్‍గా వెలుగొందుతున్న ఆలియా భట్.. హార్ట్ ఆఫ్ ది స్టోన్ మూవీతో హాలీవుడ్‍లోనూ ఎంట్రీ ఇచ్చారు. తదుపరి జిగ్రా అనే బాలీవుడ్ మూవీ చేయనున్నారు ఆలియా. ఆ సినిమాకు నిర్మాత కూడా ఆమెనే. వాసన్ బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహింనున్నారు. జిగ్రాలోనూ ఆలియాకు యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉంటాయని టాక్. 2024లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.