Anushree: రజాకార్‌లో ఏకైక గ్లామర్ రోల్ నాదే, ఎలాంటి పాత్రకైనా రెడీ: అనుశ్రీ
Anushree Razakar: ఇటీవల విడుదలైన సినిమాల్లో తెలంగాణ చరిత్ర నేపథ్యంలో వచ్చింది రజాకార్. మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న రజాకార్ సినిమాపై పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా మూవీలో నిజాం భార్యగా నటించిన అనుశ్రీ లేటెస్ట్ ఇంటర్వ్యూ విశేషాలు చూద్దాం.
Anushree Razakar: తెలంగాణ చరిత్ర నేపథ్యంలో వచ్చిన రజాకార్ సినిమాలో యాంకర్ అనసూయ, బాబీ సింహా, మకరంద్ దేశ్ పాండే, అనుశ్రీ, సీనియర్ హీరోయిన్ ప్రేమ, ప్రధాన పాత్రలో నటించారు. దీనికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. మార్చి 15న రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో నటి అనుశ్రీ ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.
"చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలే సాయుధులై కదన రంగంలోకి దూకి చేసిన పోరాటం.. ఇప్పటికీ సజీవం. అలాంటి కథను రజాకార్ రూపంలో భావోద్వేగభరితంగా తెరపై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చింది'' అని సినిమాలో కీలక పాత్ర పోషించిన అనుశ్రీ తెలిపారు.
రజాకార్ చిత్రానికి వస్తున్న స్పందన ఎలా అనిపిస్తుంది ?
ముందు రజాకార్ చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. రజాకార్ ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకుల కళ్లలో దేశభక్తి కనిపించింది. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు థియేటర్స్‌లో మారుమోగడం చూసినప్పుడు ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా అనిపించింది. ఇంతమంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాటా సత్యనారాయణ, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
మీ నేపథ్యం గురించి చెప్పండి? ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
నేను బెంగళూరులో కాలేజ్ చేశాను. అక్కడే థియేటర్స్ గ్రూప్‌లో కూడా ఒక సభ్యురాలిగా ఉన్నాను. అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. విభిన్న పాత్రలలో నటించడం, ఆ పాత్రలలో లీనం అవ్వడం నాకు చాలా నచ్చింది. కాలేజ్ పూర్తయిన తర్వాత నేను సివిల్స్ చదవాలని నాన్నగారు కోరుకున్నారు. దాదాపు మూడేళ్లు చదువుల్లోనే ఉన్నాను. అయితే నటిని కావాలనే కోరిక బలంగా ఉండేది. ఆ కల నెరవేర్చుకోవడం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమాలో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెదుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు.
ఈ పాత్ర చేయడం సవాల్‌గా అనిపించిందా?
ఇందులో నిజాం భార్యగా కనిపించా. చాలా బలమైన, అదే సమయంలో సున్నితమైన పాత్ర ఇది. వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే ఆ పాత్ర. కథ చెప్పినపుడు నా పాత్ర సవాల్‌గా అనిపించింది. అలాగే ఇందులో ఉన్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరినట్లయింది. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండే గారితో లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతే నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ పాత్ర నా కెరీర్‌కు గొప్పగా కలిసొస్తుందని భావిస్తున్నాను.
భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
మంచి కథలో ఎలాంటి పాత్ర చేయడానికైన సిద్ధంగా ఉంటాను. పాత్రలతో పాటు మంచి కథ, దర్శకుడు, టీం ముఖ్యం.