Actor Nikhil: నిఖిల్‌కు ప్రమోషన్.. తండ్రి కాబోతున్న హీరో-actor nikhil siddhartha to become father soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actor Nikhil: నిఖిల్‌కు ప్రమోషన్.. తండ్రి కాబోతున్న హీరో

Actor Nikhil: నిఖిల్‌కు ప్రమోషన్.. తండ్రి కాబోతున్న హీరో

Hari Prasad S HT Telugu

Actor Nikhil: టాలీవుడ్ నటుడు నిఖిల్‌కు ప్రమోషన్ రానుంది. అతడు త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి వర్మ ప్రస్తుతం గర్భవతి అని వార్తలు వస్తున్నాయి.

భార్య పల్లవి వర్మలో నిఖిల్ సిద్ధార్థ

Actor Nikhil: టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోగా మారిపోయిన నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అతని భార్య పల్లవి వర్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నిఖిల్ సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. తాను తండ్రి కాబోతున్న వార్త విని నిఖిల్ చాలా ఆనందంగా ఉన్నాడని నిఖిల్, పల్లవి సన్నిహితులు తెలిపారు.

కార్తికేయ 2, స్పై మూవీస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్.. ఇప్పటి వరకూ దీనిపై సోషల్ మీడియాలోగానీ, బయటగానీ స్పందించలేదు. ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 2020లో కరోనా పీక్ లో ఉన్న సమయంలో మే నెలలో నిఖిల్, పల్లవి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ దగ్గరలోని ఫామ్ హౌజ్ లో వీళ్లు పెళ్లితో ఒక్కటయ్యారు.

కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. తర్వాత వీళ్లిద్దరూ పబ్లిగ్గా చాలాసార్లు కనిపించారు. అయితే గతేడాది నవంబర్ లో ఈ ఇద్దరూ విడిపోయినట్లు కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిఖిల్ కొట్టిపారేశాడు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య వరుసగా రెండు ఫ్లాపులు ఎదురయ్యాయి.

కార్తికేయ 2 మంచి హిట్ సాధించి అతన్ని పాన్ ఇండియా హీరోని చేసినా.. తర్వాత వచ్చిన 18 పేజెస్, స్పై సినిమాలు నిరాశ పరిచాయి. స్పై మూవీ కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజైనా.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక ప్రస్తుతం అతడు స్వయంభు సినిమా చేస్తున్నాడు. ఈ పీరియడ్ యాక్షన్ సినిమా కోసం అతడు యుద్ధ కళల్లో శిక్షణ కూడా తీసుకున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ మధ్యే దీనికి సంబంధించిన గ్లింప్స్ ను నిఖిల్ షేర్ చేశాడు. ఇక వీర్ సావర్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఇండియా హౌజ్ లోనూ నిఖిల్ నటించనున్నాడు.