Khammam : "ఖమ్మం" అధికార పక్షమే-కొత్త సంప్రదాయం కొనసాగింపు!-khammam news in telugu new tradition continues tummala won in elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam : "ఖమ్మం" అధికార పక్షమే-కొత్త సంప్రదాయం కొనసాగింపు!

Khammam : "ఖమ్మం" అధికార పక్షమే-కొత్త సంప్రదాయం కొనసాగింపు!

HT Telugu Desk HT Telugu
Dec 05, 2023 05:05 PM IST

Khammam : గత ఎన్నికల వరకూ ఖమ్మంలో భిన్న సంప్రదాయం ఉండేది. ఖమ్మంలో ప్రతిపక్ష పార్టీ గెలుస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో ఈ సంప్రదాయం మారగా, తాజాగా ఇది కొనసాగింది.

తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్
తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్

Khammam : రాష్ట్రంలో ఒక పార్టీ అధికార పగ్గాలు చేపడితే అందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఖమ్మంలో కొలువై ఉండేవారు. అంటే ఖమ్మం నియోజకవర్గం ఎప్పుడూ విపక్షంలోనే మగ్గుతూ ఉండేది. ఇది ఖమ్మం రాజకీయ చరిత్రలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే ఈ సంప్రదాయానికి స్వస్తి పలికి సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 2018 ఎన్నికల్లో రెండోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగా ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు లభించింది. దీంతో అనాదిగా వస్తున్న సంప్రదాయానికి తెరపడి కొత్త సంప్రదాయానికి పునాదులు పడ్డాయి.

yearly horoscope entry point

నాటి నుంచి ప్రతిపక్షమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం భిన్నమైన సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి సంస్కృతిని పుణికిపుచ్చుకున్న ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు అధికార పక్షాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. అంటే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో కొనసాగితే ఆ పార్టీకి భిన్నంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు వరకు ఇదే సంప్రదాయం కొనసాగింది. 1969లో తెలంగాణ తొలి విడత ఉద్యమానికి నాంది పలికిన ఖమ్మం జిల్లా మలి విడత ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించింది. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో సీపీఎం, సీపీఐ పార్టీలు బలంగా ఉండేవి. చైతన్యవంతమైన ప్రజలతో ఉద్యమాలకు పెట్టింది పేరుగా ఖమ్మం జిల్లా విరాజిల్లుతూ ఉండేది. ఈ ఫలితంగా ఎప్పుడూ ఖమ్మం ప్రతిపక్ష పాత్రనే పోషిస్తూ వచ్చింది.

ఉదాహరణకు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఖమ్మంలో మాత్రం సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం విజయం సాధించారు. అలాగే తెలుగుదేశం తరపున కూడా ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టగా ఖమ్మంలో తెలుగుదేశం తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగగా ఖమ్మంలో మాత్రం నాడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించడం గమనార్హం. కాగా ఆ తర్వాత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పువ్వాడ, పొంగులేటి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

2018 నుంచి కొత్త సంప్రదాయం

2014లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచే ఆయన పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టగా ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీకే చెందిన అజయ్ కుమార్ గెలుపొందారు. దీంతో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత సంప్రదాయానికి తెరపడింది. అలాగే ఎప్పుడూ ప్రతిపక్ష హోదానే కలిగి ఉన్న ఖమ్మం నియోజక వర్గం మంత్రి పదవికి దూరంగా ఉంటూ వచ్చింది. 2018లో పువ్వాడ అజయ్ కుమార్ విజయంతో ఆ సంప్రదాయానికి కూడా తెరపడింది. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడంతో ఖమ్మం గుమ్మంలో తొలి మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు.

కొనసాగుతున్న అదే సంప్రదాయం

పువ్వాడ అజయ్ ద్వారా నెలకొన్న కొత్త సంప్రదాయం ఆ తర్వాత కూడా కొనసాగుతోంది. ఇందుకు తాజాగా జరిగిన ఎన్నికలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుండగా ఖమ్మంలో పదింటిలో 9 నియోజకవర్గాల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందడంతో అజయ్ బీజం వేసిన సంప్రదాయం కొనసాగుతుందనడానికి ఇదే ప్రతీకగా చెప్పవచ్చు. అలాగే సీనియర్ నేతగా ఉన్న తుమ్మలకు తాజాగా కాంగ్రెస్ మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశాలు సైతం ఉండడంతో పాత సంప్రదాయానికి చెక్ పడినట్లే కనిపిస్తోంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

Whats_app_banner