BJP Peddapalli Ticket : పెద్దపల్లి బీజేపీలో మరో ట్విస్ట్..! నామినేషన్ వేసిన ఇద్దరు నేతలు, ఏం జరగబోతుంది..?-two bjp candidates filed nominations in peddapally ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Peddapalli Ticket : పెద్దపల్లి బీజేపీలో మరో ట్విస్ట్..! నామినేషన్ వేసిన ఇద్దరు నేతలు, ఏం జరగబోతుంది..?

BJP Peddapalli Ticket : పెద్దపల్లి బీజేపీలో మరో ట్విస్ట్..! నామినేషన్ వేసిన ఇద్దరు నేతలు, ఏం జరగబోతుంది..?

HT Telugu Desk HT Telugu
Apr 25, 2024 06:13 PM IST

BJP Peddapalli MP Candidate 2024: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు బీజేపి తరపున నామినేషన్ వేశారు. ఇద్దరి పేరిట భీపామ్ ఇవ్వడంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

పెద్దపల్లి లో ఇద్దరు బిజేపి అభ్యర్థులు నామినేషన్
పెద్దపల్లి లో ఇద్దరు బిజేపి అభ్యర్థులు నామినేషన్

Peddapalli Lok Sabha Constituency: పార్లమెంట్ ఎన్నికల వేళ పెద్దపల్లి(Peddapalli) నియోజకవర్గంలో బిజేపి రాజకీయాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరు బిజేపి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా బిజేపి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను ప్రకటించిన పార్టీ అధిష్టానం, అతను ప్రచారం చేయకపోవడంతో అభ్యర్థిని మార్చాలని రాష్ట్ర నాయకత్వం బావించింది. నామినేషన్ ల చివరి రోజువరకు బి ఫామ్ ఇవ్వకుండా జాప్యం చేసింది. చివరకు నామినేషన్ ల చివరి రోజు గోమాస శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు బి పామ్ ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం ఓ తిరకాసు పెట్టింది. బి పామ్ లో గోమాస తోపాటు పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ నేత ఎస్.కుమార్ పేరును నమోదు చేసి ఆల్టర్నేట్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇద్దరి పేరిట బి పామ్ ఇవ్వడమే కాకుండా ఎస్.కుమార్ ను నామినేషన్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఎస్.కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశం మేరకు నామినేషన్ ధాఖలు చేశానని ఎస్.కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థి విషయంలో పార్టీదే తుది నిర్ణయమన్నారు. గోమాస శ్రీనివాస్ పనితీరు మార్చుకునేలా అతన్ని భయపెట్టడానికే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇద్దరిని బరిలో దింపినట్లు ప్రచారం జరుగుతుంది.

గోమాస శ్రీనివాస్ ర్యాలీలో ఘర్షణ…

బిజేపి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్(Gomasa Srinivas) నామినేషన్ ర్యాలీ రసాభసగా మారింది. ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్ బి ఫామ్ తో మరోసారి అట్టహాసంగా నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. ఇప్పటికే అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వ్యవహారశైలిపై వివాదస్పదంగా ఉండగా నామినేషన్ ల చివరిరోజు ర్యాలీలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. బిజేపి జిల్లా అధ్యక్షులు చందుబట్ల సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయుల మధ్య ర్యాలీలో వాగ్వివాదం తోపులాట ఘర్షణకు దారితీసింది. రెండు వర్గాలు పరస్పరం నెట్టేసుకుని పిడిగుద్దులతో తన్నుకున్నారు. పార్టీ నేతలతోపాటు పోలీసులు ఇరువర్గాలను సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. అటు అభ్యర్థి విషయంలోనే కాకుండా ఇటు రెండు వర్గాల మద్య గ్రూప్ రాజకీయాలు పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేస్తున్నాయి.

అట్టహాసంగా బండి సంజయ్ నామినేషన్

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బిజేపి అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay Nomination)అట్టహాసంగా నామినేషన్ ధాఖలు చేశారు. బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజినీకాంత్ బాయ్ పటేల్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి టవర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రసంగించిన సీఎం ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయన్నారు. తొలిసారిగా ప్రజలే ఒక పార్టీ, ఒక వ్యక్తి, 400 సీట్లు గెలువాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలు అనుకున్నట్లు కచ్చితంగా 400 సీట్లు గెలుస్తామనే దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బిజెపి ఏకగ్రీవంగా గెలుచుకుంది ఇంకా 399 సీట్లలో మనం గెలిపించాలని కోరారు. బారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత నరేంద్ర మోదీ కే దక్కిందని ఆలాంటి వ్యక్తిని మూడో సారి ప్రధానమంత్రిని చేసుకోవాలన్నారు.

నరేంద్ర మోడీ కావాలా.. రాహుల్ గాంధీ, కేసీఆర్ కావాలా కరీంనగర్ ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ కోరారు. నేను మీ బిడ్డను పక్కా లోకల్..మీరు తయారు చేసిన కాషాయ బిడ్డనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తయారు చేసిన నాణేనికి కెసిఆర్ బొమ్మ బొరుసు లాంటివారని ఆరోపించారు. వందల కోట్లు ఖర్చు చేయడానికి కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులు వచ్చారని వాళ్ళ మాదిరిగా తన వద్ద కోట్లు లేకున్నా ప్రజలకోసం కొట్లాడే శక్తి ఉంది..వందల కేసులు ఉన్నాయని తెలిపారు. నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బిఆర్ఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. గరీబోని బిడ్డ కావాలా గడీల వారసులు కావాలో ప్రజలే ఆలోచించి ఓట్లు వేయాలని సంజయ్ కోరారు. ప్రస్తుతం ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ జరుగుతుందని దానికి కెప్టెన్ నరేంద్ర మోడీ అని, కాంగ్రెస్ కు కెప్టెన్ లేడని పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్ తో పోల్చారు బండి సంజయ్.

కాంగ్రెస్, బిఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కులేదు-కిషన్ రెడ్డి

దేశ భవిష్యత్తు ను నిర్దేశించే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులను చూసిన తర్వాత బండి సంజయ్ ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేసుకునే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 పైగా సీట్లు బిజెపి గెలుస్తుందని జూన్ రెండో వారంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతుంటే ఆపుకునే శక్తి లేని కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి ఆ పార్టీలని విమర్శించారు. తెలంగాణలో 17 కు 17 స్థానాలు బిజెపి గెలుస్తుందని జోస్యం చెప్పారు. బిజెపి గుజరాత్ లో బోనీ కొట్టిందని ఇక 399 సీట్లు బిజెపి గెలవాలన్నారు కిషన్ రెడ్డి.

రిపోర్టింగ్ - HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

Whats_app_banner