Peddapalli BJP: పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిని మార్చే యోచన! బిజేపి పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ-plan to change bjp candidate in peddapally complaints from bjp leaders ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Peddapalli Bjp: పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిని మార్చే యోచన! బిజేపి పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ

Peddapalli BJP: పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిని మార్చే యోచన! బిజేపి పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ

HT Telugu Desk HT Telugu
Apr 16, 2024 08:57 AM IST

Peddapalli BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ పెద్దపల్లి లో బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ యవ్వారం కలకలం సృష్టిస్తోంది.‌ అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థి గోమాస పై అధిష్టానంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్ధి మార్పుపై విస్తృత ప్రచారం
పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్ధి మార్పుపై విస్తృత ప్రచారం

Peddapalli BJP: పార్టీలో చేరిన వెంటనే పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కన్ఫామ్ చేసుకున్న గోమాస శ్రీనివాస్ Gomasa Srinivas స్ధానిక కమల నాధులను పట్టించు కోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీ పెద్దలు అభ్యర్థి మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ Sitting MP బొర్లకుంట వెంకటేష్ నేతను కమలదళంలో చేర్చుకుని బరిలోకి దింపే ప్రయత్నం జరుగుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

గోమాస గోస... కమలం నేతలకు తలనొప్పి

తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన బిజేపి TS BJP కి పెద్దపల్లి అభ్యర్థి పంచాయితీ తలనొప్పిగా మారింది. గెలుపే లక్ష్యంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ, 10 నుంచి 12 స్థానాలకు తగ్గకుండా గెలుచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాలతో పాటు పెద్దపల్లి స్థానంపై కన్నేసిన బీజేపీ వ్యూహత్మకంగా గోమాస శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బిఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తుండగా ఆ ఇద్దరు మాల సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో బిజేపి ఎస్సీలో నేతకాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ ను బరిలోకి దింపింది.

నేతకాని ఓటర్లే కీలకం

ఎస్సీ రిజర్వు అయిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేతకాని Nethakani సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ప్రభావం చూపుతాయి. గత ఎన్నికల్లో నేతకాని సామాజిక వర్గానికి చెందిన బొర్లకుంట వెంకటేష్ నేత ను బీఆర్ఎస్ బరిలోకి దింపి విజయం సాధించడంతో ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలోకి దింపి సత్పలితం సాధించాలనే ధీమాతో బీజేపీ నాయకత్వం గోమాస అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

ఈనెల 20 తర్వాత జాతీయ నాయకులు ప్రచారానికి వచ్చేలా ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అయితే పెద్దపల్లి అభ్యర్థి మాత్రం ఉలుకుపలుకు లేకుండా ఉండడం.. అసలు ప్రచార ఊపు లేకపోవడం... గతంలోనూ ఇలానే ప్రత్యర్థులు గెలిచేలా ప్రచారం వేళ ఆస్పత్రి పాలవడం.. ఈసారి అలాగే చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుండడంతో బీజేపీలో అంతర్మధనం మొదలయ్యింది.

ఎంతో నమ్మకంతో పార్టీ టికెట్ ఇస్తే.. ప్రచారం చేయకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలోనే అభ్యర్థిని మార్చాలని స్థానిక నాయకులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ పై పార్టీ అగ్రనాయకత్వం పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొక్కుబడి ప్రచారమే ముప్పు

తెలంగాణ రాష్ట్ర సమితిలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గోమాస శ్రీనివాస్ 2009 లో టీఆర్ఎస్ టికెట్ పై పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలానికి కాంగ్రెస్ లో చేరారు. 2019, 2024 లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ శ్రీనివాస్ గత నెలలో బిజేపిలో చేరి అభ్యర్థిగా ఎంపిక అయ్యారు.

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాస్త పట్టు ఉండడంతో బిజేపి అధిష్ఠానం నమ్మకంతో టికెట్ ఇచ్చింది. అయితే బీజేపీ టికెట్ ప్రకటించి పాతిక రోజులు దాటింది. చాలా మంది టికెట్ ప్రకటించక ముందునుంచే తమ నియోజకవర్గాల్లో ప్రచారం మొదలు పెట్టారు. పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాత్రం టికెట్ ఇచ్చినా పెద్దగా ప్రచారం చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రచారం పేరిట మొక్కుబడిగా చిన్నచిన్న సమావేశాలకే పరిమితమవుతున్నారు. గతంలో ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేసిన సందర్భంలో ప్రచారం సరిగా చేయక పోవడం వల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని.. ప్రత్యర్ధికి సహకరించడానికి చేతులెత్తేశారనే ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోకుండా హడావుడిగా ఎంపీ టికెట్ ఇచ్చిన బీజేపీ ఇప్పుడు పునరాలోచనలో పడి అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పై కన్నేసిన కమలదళం

ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి ప్రయత్నంగా బీజేపీ మరో అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాషాయ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం అవుతోంది.

కాంగ్రెస్ టికెట్ వస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన వెంకటేశ్ నేతకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది. దీంతో అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎంపీ బీజేపీతో టచ్ లోకి వెళ్ళినట్లు స్థానికులు భావిస్తున్నారు. కమలం నేతలు అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉండడంతో వెంకటేశ్ నేతను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈమేరకు చకచకా మార్పులు జరుగుతున్నట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో గోమాస పనితీరు మార్చుకొని ఎన్నికల కదనరంగంపై దృష్టి సారిస్తారా.. లేక తనపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తారా అన్న దానిపై కమలనాథుల్లో ఉత్కంఠ నెలకొన్నది.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

WhatsApp channel

సంబంధిత కథనం