Modi, Shah, Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల వేళ.. ఈ ఐదుగురు నేతలదే కీలక పాత్ర..-modi shah rahul gandhi 5 key leaders who play crucial role in the upcoming lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Modi, Shah, Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల వేళ.. ఈ ఐదుగురు నేతలదే కీలక పాత్ర..

Modi, Shah, Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల వేళ.. ఈ ఐదుగురు నేతలదే కీలక పాత్ర..

HT Telugu Desk HT Telugu
Mar 12, 2024 02:35 PM IST

Modi, Shah, Rahul Gandhi: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల వేడి పెరిగింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశంలో ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న ముఖ్యమైన నాయకుల వివరాలు..

ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

Modi, Shah, Rahul Gandhi: 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలందరి దృష్టి కొందరు ప్రముఖ నాయకులపైననే ఉంటుంది. వారిలో ప్రధానమైన వారు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బిహార్ సీఎం నితిశ్ కుమార్. వీరు కాకుండా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితర నాయకులు కూడా ఈ ఎన్నికల్లో తమ ప్రభావం చూపించనున్నారు.

నరేంద్ర మోదీ

దేశ రాజకీయ ముఖచిత్రంపై 2014 నుంచి వెలుగొందుతున్న నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమే. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి నరేంద్ర మోదీ ప్రభ రోజురోజుకీ.. ప్రతీ ఎన్నికలకు పెరిగిపోతూనే ఉంది. 2014 లో విజయం సాధించి బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత.. మోదీ (PM Modi)కి ఎదురులేకుండా పోయింది. ప్రస్తుతం బీజేపీ మోదీ ఇమేజ్ పైననే ఆధారపడి ఈ ఎన్నికలకు వెళ్తోందంటే అతిశయోక్తి కాదు. 2014 నుంచి బీజేపీలో మోదీ, షాల యుగం ప్రారంభమైంది.

2014 లోమొత్తం 545 స్థానాలకు గాను 282 స్థానాలు గెలుచుకున్న బీజేపీ తొలిసారిగా పూర్తి మెజారిటీ సాధించింది. ఐదేళ్ల పాలనలో పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారు. ఐదేళ్ల పాలన వ్యతిరేకత, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకలు.. తదితర ఆరోపణలను సమర్ధంగా ఎదుర్కొన్ని తిరిగి 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీకి ఘన విజయం సాధించిపెట్టారు. పుల్వామా దాడిపై భారత్ దూకుడుగా స్పందించిన తీరు దేశ ప్రజలకు మోదీ పట్ల సానుకూలతను మరింత పెంచింది. 2019 ఎన్నికల్లో బీజేపీ 545 సీట్లకు గాను 303 సీట్లు గెలుచుకుంది.

అమిత్ షా

2014 వరకు అమిత్ షా గుజరాత్ లో శక్తివంతమైన నాయకుడు. కానీ, 2014 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడం వెనుక కీలకంగా నిలిచిన వ్యూహాత్మక శక్తి అమిత్ షానే. న్యూఢిల్లీకి మార్గం ఉత్తర ప్రదేశ్ అన్న విషయాన్ని గుర్తించిన షా.. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం సాధించిపెట్టే బాధ్యతను విజయవంతంగా పూర్తిచేశారు. ఆ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో 80 స్థానాలకు గాను 71 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2014లో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈశాన్య రాష్ట్రాలు వంటి కొత్త ప్రాంతాల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. 2019 నాటికి ప్రభుత్వంలో, పార్టీలో మోదీ తరువాత రెండో స్థానంలో నిలిచిన నేత అమిత్ షా నే.

రాహుల్ గాంధీ

2014 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ చవి చూసిన పరాజయం కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగింది. ఆ తరువాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా తగ్గిపోసాగింది. యూపీఏ-2ను పట్టిపీడించిన అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై అవినీతి వ్యతిరేక నిరసనలు కాంగ్రెస్ ను దెబ్బ తీశాయి. మరోవైపు పార్టీలో సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడం, నాయకత్వ బాధ్యతల విషయంలో రాహుల్ గాంధీ చూపించిన వ్యవహార శైలి కాంగ్రెస్ పై ప్రజల్లో అనాసక్తికి కారణమైంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. 543 సీట్లకు గానూ కేవలం 44 సీట్లు గెల్చుకుంది. అయిదేళ్ల తర్వాత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మెరుగైన స్థితిలో కనిపించింది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. 2018 చివరినాటికి ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాలను స్వాధీనం చేసుకోవడం లేదా నిలుపుకోగలిగింది. రాహుల్ గాంధీ మళ్ళీ నాయకత్వం వహించాడు. కానీ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కాంగ్రెస్ బలం 2019 ఎన్నికల తరువాత 44 నుంచి 52కు పెరిగింది. 2019 తరువాత, రాహుల్ గాంధీ కొంత క్రియశీలం అయ్యారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతమయ్యాయి. ప్రజల్లో రాహుల్ గాంధీ పై సానుకూలత పెరిగింది.

మమతా బెనర్జీ

కాంగ్రెస్ నుండి విడిపోయిన పదమూడేళ్ల తరువాత, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ పై వామపక్షాల పట్టును విచ్ఛిన్నం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 34 సంవత్సరాల నిరంతర పాలన తరువాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. అందువల్ల 2014 ఎన్నికలు పశ్చిమ బెంగాల్ కు చాలా కీలకం. రాష్ట్రంలో ఉన్న 40 పార్లమెంటు స్థానాలతో, జాతీయ ఎన్నికల ఫలితాలు తూర్పులో మమతా బెనర్జీ స్థానాన్ని సుస్థిరం చేస్తాయి. లేదా సీపీఐ (ఎం) తిరిగి వచ్చే అవకాశం కల్పిస్తాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 40 సీట్లకు గాను 34 సీట్లు గెలుచుకుని పార్లమెంటులో ఆ పార్టీకి బలమైన వాయిస్ ను సంపాదించి, సీపీఐ (ఎం)ను తుడిచిపెట్టేసింది. లోక్ సభలో అత్యధిక స్థానాలున్న రాష్ట్రాల్లో.. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల తరువాత.. పశ్చిమబెంగాల్ మూడో స్థానంలో ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినప్పటికీ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ బాగా పుంజుకుంది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు గాను బీజేపీ 18 స్థానాలను గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే మళ్లీ, 2021 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ పోరాటంలో మమత బెనర్జీ మళ్లీ విజయం సాధించారు.

నితీష్ కుమార్

అత్యధిక లోక్ సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ 4 స్థానంలో ఉంది. బిహార్ లో మొత్తం 40 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఈ కీలకమైన రాష్ట్రంలో రాజకీయాలకు కేంద్ర బిందువుగా.. ఒకప్పటి లాలు ప్రసాద్ స్థాయిలో.. ప్రస్తుతం నితీశ్ కుమార్ ఉన్నారు. 2013 లో మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) నుండి నితీశ్ కుమార్ బయటకు వచ్చారు. కానీ, అది చివరికి బిహార్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) బిహార్ లో ఒంటరిగా పోటీ చేసి రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఎన్డీయే 31 స్థానాలను గెలుచుకుంది. ఏడాది తర్వాత కుమార్ తిరిగి ఎన్డీయేలో చేరారు. 2019లో ఎన్డీయే తరఫున బీజేపీ, జేడీయూ, రాంవిలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 సీట్లలో 39 సీట్లను ఎన్డీయే గెలుచుకోగా, కాంగ్రెస్ ఒక స్థానానికి, శత్రువుగా మారిన మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ను సున్నాకు పరిమితం అయ్యాయి. ఆ తరువాత ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి బిహార్ లో నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ, లేటెస్ట్, దాదాపు నెల క్రితం కాంగ్రెస్, ఆర్జేడీలకు నుంచి విడిపోయి, మళ్లీ బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.