KCR Campaign in Medak : ప్రతిష్టాత్మకంగా మెదక్ సీటు - రంగంలోకి కేసీఆర్..! ఈసారి ఏం జరగబోతుంది..?-loksabha polls 2024 brs chief kcr focused on victory in medak lok sabha constituency ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr Campaign In Medak : ప్రతిష్టాత్మకంగా మెదక్ సీటు - రంగంలోకి కేసీఆర్..! ఈసారి ఏం జరగబోతుంది..?

KCR Campaign in Medak : ప్రతిష్టాత్మకంగా మెదక్ సీటు - రంగంలోకి కేసీఆర్..! ఈసారి ఏం జరగబోతుంది..?

HT Telugu Desk HT Telugu
May 08, 2024 02:48 PM IST

KCR Bus Yatra in Medak : మెదక్ ఎంపీ స్థానంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురిపెట్టారు. ఈసారి కూడా గులాబీ జెండా ఎగిరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

లోక్ సభ ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
లోక్ సభ ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR Campaign in Medak Lok Sabha Constituency: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక రోడ్ షో ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్… మెదక్ లోక్ సభ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏదైనా లోక్ సభ స్థానంలో తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ గట్టి నమ్మే లిస్ట్ లో మెదక్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత… మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఐదు ఎన్నికల్లో కూడా గులాబీ జెండానే ఎగిరింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ లోక్ సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది. ఫలితంగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీల కంటే బలంగా ఉంది.

మారిపోయిన సీన్… శ్రమిస్తున్న బీఆర్ఎస్…

అధికారం కోల్పోవటంతో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మారిపోయింది. ఆరు స్థానాల్లో గెలిచినప్పటికీ… ఈసారి ఇక్కడ గెలవటం అతిపెద్ద సవాల్ గా మారింది. ఓవైపు కాంగ్రెస్ అధికార పార్టీగా, మరోవైపు మోదీ మ్యానియాతో బీజేపీ బలమైన ప్రత్యర్థిగా బరిలో ఉన్నాయి. దీంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

ఇక కేసీఆర్ సొంత జిల్లా కావటం కూడా బీఆర్ఎస్ ఈ సీటు సవాల్ గా మారింది. హరీశ్ రావుతో పాటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా… స్వయంగా కేసీఆరే ఈ సీటుపై ఫోకస్ పెట్టారు.

నేటి కేసీఆర్ పర్యటన….

మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 16వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇక నిన్న( మంగళవారం) మెదక్ లో బస్సు యాత్ర కొనసాగింది. ఇవాళ నర్సాపూర్, పటాన్చెరు నియోజకవర్గాలలో మాట్లాడనున్నారు. ఇక మే 10వ తేదీన గజ్వేల్ లో పర్యటిస్తారు. అదే రోజు సిద్ధిపేట బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని ముగించనున్నారు. ఈ సభకు దుబ్బాక నుంచి భారీగా ప్రజలను తరలించనున్నారు.

కేసీఆర్ రోడ్డుషో లతో పాటు పబ్లిక్ మీటింగ్ ద్వారా తన విజయం సులువుగా మారుతుందని పార్టీ అభ్యర్థి పి వెంకట్రామి రెడ్డి భావిస్తున్నారు. మెదక్ లోక్ సభ పరిధిలోని ప్రతి మండలంలో ప్రచారం చేసిన హరీష్ రావు… కేసీఆర్ సభలను కూడా అన్ని తానై నడిపిస్తున్నారు. ఇక మెదక్ స్థానంలో ఆశించిన ఫలితం రాకపోతే… కేసీఆర్ కు గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… మరోసారి కూడా ఇక్కడ విక్టరీ కొట్టాలని గూలాబీ బాస్ భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం